దేశంలో ఉపాధి పొందేందుకు సిద్ధంగా ఉన్న 15 ఏళ్లు, అంతకుమించి వయసున్న వ్యక్తుల్లో నిరుద్యోగిత రేటు (యూఆర్) ఆగస్టులో 5 శాతానికి దిగొచ్చింది. జూలైలో నమోదైన 5.1 శాతంతో పోలిస్తే ఇది స్వల్పంగా తగ్గింది. గతేడాది (2025) ఆగస్టులోనూ నిరుద్యోగిత రేటు 5.1 శాతంగానే నమోదైనట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీల్‌ఎల్‌ఎఫ్‌ఎస్) నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా మొత్తం 3,70,160 మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఆగస్టు నెలవారీ బులెటిన్‌ను రూపొందించింది.
గ్రామీణ నిరుద్యోగిత రేటు జూలైలోని 4.5 శాతం నుంచి ఆగస్టు నాటికి 4.1 శాతానికి తగ్గింది. ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో నమోదైన అతి తక్కువ నిరుద్యోగిత రేటు ఇదే కావడం విశేషం. గతేడాది ఆగస్టులో నమోదైన 4.3 శాతంతో పోలిస్తే ఇది 0.2 శాతం తక్కువ. ఇక పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు
జూలైలోని 6.7 శాతంతో పోలిస్తే ఆగస్టులో 6.8 శాతానికి స్వల్పంగా పెరిగింది.
దేశంలో మొత్తం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు (ఎల్‌ఎఫ్‌పీఆర్) జూలైలోని 55.4 శాతం నుంచి ఆగస్టు నాటికి 55.6 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 58 శాతం నుంచి 58.2 శాతానికి పెరగ్గా, పట్టణాల్లో 50.4 శాతంతో యథాతథంగా ఉంది. గతేడాది ఆగస్టు (55%)తో పోలిస్తే మొత్తం ఎల్‌ఎఫ్‌పీఆర్ 0.6 శాతం వృద్ధి చెందింది.
మహిళల లేబర్ ఫోర్స్ భాగస్వామ్యం వరుసగా రెండో నెలలోనూ పెరిగి 34.8 శాతానికి చేరింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళల భాగస్వామ్యం జూలైలోని 38.8 శాతం నుంచి ఆగస్టులో 39.4 శాతానికి పెరగడం ఇందుకు తోడ్పడింది. ఏడాది క్రితం ఆగస్టులో ఉన్న 33.7 శాతంతో పోలిస్తే ఇది 1.1 శాతం మేర పుంజుకుంది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల భాగస్వామ్యం (39.4%) గణనీయంగా పెరిగినప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో మాత్రం 25.4 శాతానికే పరిమితం కావడం గమనార్హం.


