ఎఫ్‌వై 2031 నాటికి 300 బిలియన్ డాలర్ల ఆదాయం
వినియోగ ఆధారిత రంగాలదే సగం వాటా
ఏటా 25% వృద్ధితో 3 రెట్లు విస్తరణ
ఐపీఓ నిధుల్లో 40% వాటా లక్ష్యం
రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ నివేదిక
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ క్యాపిటల్, డిజిటల్ ఆవిష్కరణల ఆధారంగా అభివృద్ధి చెందుతున్న భారత ‘న్యూ–ఏజ్ ఎకానమీ’ (కొత్త తరం ఆర్థిక వ్యవస్థ) వేగంగా విస్తరిస్తోంది. ఆర్థిక సంవత్సరం 2030–31 (ఎఫ్‌వై31) నాటికి ఈ రంగం ఆదాయం మూడు రెట్లు పెరిగి 300 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.25 లక్షల కోట్లు) చేరుతుందని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ నివేదిక వెల్లడించింది. ఇది ప్రస్తుత భారత ఐటీ పరిశ్రమ స్థాయికి చేరువ కానుంది. దేశీయ న్యూ–ఏజ్ కంపెనీల ఉమ్మడి ఆదాయం ఎఫ్‌వై22లో 33 బిలియన్ డాలర్ల నుంచి ఎఫ్‌వై26 (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు) నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరనుంది. అక్కడి నుంచి ఏటా 25 శాతం వృద్ధితో ఎఫ్‌వై31 నాటికి 300 బిలియన్ డాలర్ల మార్కును తాకనుంది. నివేదికలో మరిన్ని అంశాలు ....
ఎఫ్‌ఎంసీజీ, రిటైల్, లీజర్ వంటి వినియోగ ఆధారిత రంగాలు ‘న్యూ–ఏజ్ ఎకానమీ’ విస్తరణకు దోహదపడనున్నాయి. ఈ రంగాలు ఏటా 25 శాతం వృద్ధితో ఎఫ్‌వై31 నాటికి 150 బిలియన్ డాలర్లకు చేరతాయని రెడ్‌సీర్ అంచనా వేసింది. అంటే మొత్తం న్యూ–ఏజ్ ఎకానమీలో దాదాపు సగం వాటా ఈ రంగాలదే కానుంది. మరోవైపు టెక్నాలజీ, మీడియా, టెలికాం (టీఎంటీ), ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అధునాతన తయారీ వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ రంగాలు ఏటా 26 శాతం వృద్ధి చెందనున్నాయి.
కంపెనీల కార్యాచరణ పనితీరు మెరుగవడంతో ఆర్థిక సంవత్సరం 2025లో ఈ రంగాలు మళ్లీ లాభాల్లోకి ప్రవేశించి, ఉమ్మడిగా 1.4 బిలియన్ డాలర్ల లాభాన్ని నమోదు చేశాయి. అయితే, ఇందులో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగానిదే 140 శాతం వాటా కావడం విశేషం. బీఎఫ్‌ఎస్‌ఐని మినహాయిస్తే మిగిలిన అన్ని రంగాలు కలిపినా ఇంకా నష్టాల్లోనే ఉన్నాయని రెడ్‌సీర్ పేర్కొంది.
డైరెక్ట్–టు–కన్జూమర్ (డీ2సీ) ఛానళ్లు, క్విక్ కామర్స్ వేగంగా విస్తరించడంతో వినియోగ వస్తువుల బ్రాండ్లు రూ. 100 కోట్ల ఆదాయాన్ని సాధించే సమయం సగానికి తగ్గింది. 2016 నాటి బ్రాండ్లకు రూ. 100 కోట్ల ఆదాయం దాటడానికి 6.8 ఏళ్లు పడితే, 2020లో వచి్చన బ్రాండ్లు కేవలం 3.4 ఏళ్లలోనే ఈ మార్కును చేరుకున్నాయి.
ఆర్థిక సంవత్సరం 2022లో రూ.100 కోట్లకు పైగా ఆదాయ ఉన్న బ్రాండ్ల సంఖ్య 90 ఉన్నాయి. ఇవి ఎఫ్‌వై 2026కి 230కి, ఎఫ్‌వై 2031 నాటికి 500కి పెరుగుతుందని రెడ్‌సీర్ అంచనా వేసింది. అయితే, ఆఫ్‌లైన్ నెట్‌వర్క్, నెట్‌వర్క్ మౌలిక సదుపాయిల సవాళ్ల కారణంగా రూ. 500 కోట్ల ఆదాయం దాటడం మాత్రం కంపెనీలకు ప్రధాన అడ్డంకిగా ఉంది. 2016 తర్వాత రూ. 100 కోట్లు దాటిన 110 బ్రాండ్లలో కేవలం 26 మాత్రమే రూ. 500 కోట్ల మార్కును దాటగలిగాయి.


