ఆగస్టులో ఎగబాకిన రిటైల్, టోకు ద్రవ్యోల్బణం
ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపుపై పెరుగుతున్న అంచనాలు
న్యూఢిల్లీ: సామాన్యుల జేబుకు ధరలు చిల్లు పెడుతున్నాయి. ముఖ్యంగా ఉల్లిపాయలు, ఇతరత్రా ఆహారోత్పత్తుల రేట్లు భారీగా ఎగబాకడంతో ద్రవ్యోల్బణం రివ్వుమంటోంది. ఆగస్టులో రిటైల్, టోకు ద్రవ్యోల్బణం రెండూ పెరిగాయి. దీంతో రాబోయే పాలసీ సమీక్షలో (అక్టోబర్ 5–7) రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వడ్డీ రేట్ల పెంపు దిశగా అడుగులు వేయొచ్చని విశ్లేషకులు లెక్కలేస్తున్నారు. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) 4.82 శాతానికి చేరింది. జూలైలో ఇది 4.45 శాతంగా నమోదైంది. ఇక టోకు ద్రవ్యోల్బణం 9.78 శాతం నుంచి 9.92 శాతానికి ఎగసింది.
రిటైల్ ధరలు ఆర్‌బీఐ నిర్దేశించిన 4 శాతం (రెండు శాతం అటూఇటుగా) పరిధిలోనే ఉన్నప్పటికీ.. పశి్చమాసియా సంక్షోభం దెబ్బకు ఇంధన ధరలకు రెక్కలు రావడంతో ధరల మంట మొదలైంది. దీంతో ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెరుగుదలకు ఆజ్యం పోస్తోంది. రిజర్వ్ బ్యాంక్ విధాన నిర్ణయానికి సీపీఐనే పరిగణనలోకి తీసుకుంటుంది. మరోపక్క, 2024 బేస్ సంవత్సరంగా ఈ ఏడాది జనవరిలో కొత్త సిరీస్ మొదలైన తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులోనే అత్యధికంగా నమోదు కావడం గమనార్హం.
ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, గత నెలలో ఆర్‌బీఐ కీలక రెపో రేటును యథాతథంగా (5.25%) కొనసాగించింది. అధిక క్రూడ్ ధరలు, ద్రవ్యోల్బణం నేపథ్యంలో అక్టోబర్, డిసెంబర్ పాలసీ సమీక్షల్లో రెపో రేటును పావు శాతం చొప్పున పెంచాల్సి ఉంటుందని తాజాగా ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదికలో పేర్కొనడం తెలిసిందే.
ఆహార ధరలు పైపైకి...
⇒ ఆగస్టులో రిటైల్ ఆహార ద్రవ్యోల్బణం 5.95 శాతానికి పెరిగింది. జూలైలో ఇది 5.23 శాతంగా ఉంది.
⇒ ఉల్లిపాయల ధరల పెరుగుదల జూలైలో 22.54 శాతంగా నమోదు కాగా, ఆగస్టులో ఏకంగా 48.27 శాతం ఎగసింది. అలాగే, వెల్లుల్లి ధరలు 35.36 శాతం నుంచి 43.6 శాతానికి ఎగబాకాయి. అల్లం ధరలు అత్యధికంగా జూలైతో పోలిస్తే 73.82 శాతం దూసుకెళ్లాయి.
⇒ మరోపక్క, టమాటా, బంగాళదుంపలు సహా కొన్ని కూరగాయల రేట్లు దిగిరావడం విశేషం.
⇒ తెలంగాణలో అత్యధికంగా 6.27 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం నమోదవగా, మిజోరంలో అత్యల్పంగా 2.35 శాతమే ఉంది.
⇒ కాగా, టోకు ధరల విషయానికొస్తే, ఆహార ద్రవ్యోల్బణం జూలైలో 6.65 శాతం నుంచి ఆగస్టులో 7.05 శాతానికి జంప్ చేసింది. తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం 8.29 శాతం నుంచి 8.37 శాతానికి పెరిగింది. ఇంధన ద్రవ్యోల్బణం 20.05 శాతం నుంచి 22.93 శాతానికి చేరింది.
త్వరలో వడ్డీ రేట్ల పెంపుపై నిర్ణయం..
అధిక ఇంధన ధరల సెగ ఎకానమీ మొత్తానికి తగులుతోంది. ముఖ్యంగా దేశ స్థూల ఆర్థిక ముఖ చిత్రం మారుతోంది. పటిష్ట వృద్ధికి డిమాండ్ దన్నుగా నిలుస్తున్నప్పటికీ, పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో ముడి సరుకుల వ్యయానికి మరింత ఆజ్యం పోస్తోంది. దీంతో వేచిచూసే ధోరణికి ఇక చెల్లు చెప్పి, కఠిన పాలసీ నిర్ణయాల దశలోకి ఆర్‌బీఐ అడుగుపెట్టే అవకాశం ఉంది. అంటే, త్వరలోనే వడ్డీ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవచ్చు’.
– ధర్మకృతి జోషి, క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్


