రిలయన్స్ జియో, కాన్వాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సహకారంలో భాగంగా, ఈ సర్వీస్ ప్రొవైడర్ భారతదేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది జియో వినియోగదారులకు కాన్వా ఏఐ-ఆధారిత డిజైన్ ప్లాట్‌ఫామ్‌ను అందించనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఇకపై సోషల్ మీడియా పోస్టులు, ప్రెజెంటేషన్లు, బిజినెస్ పోస్టులు లేదా స్కూల్ ప్రాజెక్టులు తయారు చేయడానికి ప్రత్యేకంగా డిజైన్ స్కిల్స్ అవసరం లేకపోవచ్చు. ఎందుకంటే జియో, కాన్వా కలిసి తమ కస్టమర్లకు కాన్వాప్రీమియం ఫీచర్లను ఉచితంగా అందించబోతున్నాయి. ఈ ఆఫర్ సెప్టెంబర్ 16, 2026 నుంచి అందుబాటులోకి రానుంది.
అర్హత ఉన్న జియో యూజర్లు 12 నెలల వరకు కాన్వా ప్రో లేదా కాన్వా ప్రో లైట్ వంటివి ఎలాంటి అదనపు డబ్బు చెల్లించకుండా ఉపయోగించుకోవచ్చు. ఈ ఆఫర్ విలువ రూ.4,000 వరకు ఉంటుందని సమాచారం.
అయితే.. అందరికీ ఒకే కాన్వా ప్లాన్ రాదు. వినియోగదారుడు తీసుకునే జియో రీచార్జ్ ప్లాన్‌ను బట్టి కాన్వా ప్రో లేదా ప్రో లైట్ లభిస్తుంది. రూ.399 జియో ప్లాన్ ఉన్నవారికి కాన్వా ప్రో లభిస్తుంది. ఇక రూ.349 ప్లాన్‌తో పాటు రూ.349 కంటే ఎక్కువ ఉన్న కొన్ని అర్హత కలిగిన 2GB/day ప్లాన్లకు కాన్వా ప్రో లైట్ లభిస్తుంది.
ఆఫర్‌ను ఇలా యాక్టివేట్ చేసుకోండి
అర్హత ఉన్న యూజర్లు మైజియో యాప్ ఓపెన్ చేసి కాన్వా ఆఫర్‌ను సెర్చ్ చేసి యాక్టివేట్ చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.
కాన్వా ప్రో తీసుకుంటే ప్రీమియం టెంప్లేట్లు, ఫోటోలు, వీడియోలు, ఫాంట్లు మాత్రమే కాకుండా చాలా ఉపయోగకరమైన డిజైన్ టూల్స్ కూడా అందుబాటులోకి వస్తాయి. ఉదాహరణకు.. ఫోటోలోని బ్యాక్‌గ్రౌండ్‌ను ఒక్క క్లిక్‌తో తొలగించవచ్చు. మ్యాజిక్ ఎరేజర్ వంటి టూల్స్‌తో ఫోటోలో అవసరం లేని వస్తువులను కూడా తొలగించవచ్చు. ఏఐఆధారిత డిజైన్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
కాన్వా ప్రో లైట్ ద్వారా కూడా చాలా ప్రీమియం ఫీచర్లు పొందవచ్చు. అయితే ప్రోతో పోలిస్తే కొన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లకు పరిమితులు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా డిజైన్ చేసే వారికి కాన్వా ప్రో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.


