వడాపావ్‌ అమ్ముతూ.. బంగ్లా కొనేశాడు: ఎవరీ అనిల్‌భాయ్‌? | From Rs 2.50 Vada Pav to a Posh Bungalow: Know About The Anilbhai Journey | Sakshi
Sakshi News home page

వడాపావ్‌ అమ్ముతూ.. బంగ్లా కొనేశాడు: ఎవరీ అనిల్‌భాయ్‌?

Sep 15 2026 5:20 PM | Updated on Sep 15 2026 5:51 PM

From Rs 2.50 Vada Pav to a Posh Bungalow: Know About The Anilbhai Journey

సూరత్‌లో ఓ తెల్లటి బంగ్లా పక్కన కనిపించే చిన్న వడాపావ్‌ బండి ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. బండి ముందు నిలబడి వడాపావ్‌ అమ్ముతున్న వ్యక్తిని చూస్తే.. సాధారణ వ్యాపారిలాగే కనిపిస్తారు. కానీ.. ఆ బండి పక్కనే ఉన్న బంగ్లా కూడా ఆయనదే అని తెలిస్తే మాత్రం తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆయన ఎవరు?, ఆయన బ్యాగ్రౌండ్ ఏమిటి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

30ఏళ్లుగా వ్యాపారం
దాదాపు 30 ఏళ్లుగా వడాపావ్‌ అమ్ముతున్న అనిల్‌భాయ్‌.. 1997లో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అప్పట్లో ఒక్క వడాపావ్‌ ధర కేవలం రూ.2.50 మాత్రమే. నేడు ఆయనకు సొంత బంగ్లా ఉన్నా.. తన వడాపావ్‌ బండిని మాత్రం వదల్లేదు. ఇప్పటికీ అవసరమైతే స్వయంగా బండి తీసుకుని ఉదయం 6 గంటలకే వ్యాపారం మొదలుపెడతారు.

ఫుడ్‌ వ్లాగర్‌ హ్యారీ ఉప్పల్‌తో జరిగిన సంభాషణలో అనిల్‌భాయ్‌ తన జీవితంలోని ఎన్నో విషయాలను పంచుకున్నారు. తన బంగ్లా గురించి మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాటలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. ''ఆ బంగ్లాను నేను కట్టలేదు.. మాతాజీ ఆశీర్వాదంతో అది వచ్చింది'' అని ఆయన అన్నారు. తన విజయాన్ని తన కష్టంతో పాటు దేవుడి ఆశీస్సులకు, కుటుంబ సభ్యుల కృషికి ఆపాదించారు.

వడాపావ్‌ అమ్మడానికి ముందు
వడాపావ్‌ అమ్మకాలు ప్రారంభించడానికి ముందు అనిల్‌భాయ్‌ కుటుంబం ఎన్నో రకాల పనులు చేసింది. ఆలయం దగ్గర చెప్పులు చూసుకోవడం, కార్లు పార్క్‌ చేయించడం, కూరగాయలు అమ్మడం వంటి పనులు చేశారు. తల్లి, సోదరుడు, సోదరితో కలిసి కుటుంబమంతా పనిచేసేది.

తర్వాత అనిల్‌భాయ్‌కు ఓఎన్‌జీసీలో ప్యూన్‌గా ఉద్యోగం వచ్చింది. అయితే అక్కడ 17 నెలలు పనిచేసిన తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. ఆ తర్వాతే వడాపావ్‌ వ్యాపారాన్ని ప్రారంభించారు. ముంబైలో అప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన వడాపావ్‌ను సూరత్‌లో విక్రయించాలనే ఆలోచన ఆయన తల్లిదే. తల్లికి వడాపావ్‌ తయారు చేయడం తెలుసు. ఆమె వడా తయారు చేస్తే.. అనిల్‌భాయ్‌ వాటిని తీసుకెళ్లి అమ్మేవారు. అలా మొదలైన చిన్న వ్యాపారం క్రమంగా ఎదిగింది.

రూ.2.50 నుంచి
1997లో వడాపావ్‌ను రూ.2.50కే విక్రయించేవారు. మొదట్లో ప్రధాన రహదారి పక్కన బండి పెట్టేవారు. అక్కడ కొన్ని సమస్యలు రావడంతో తర్వాత బండిని ప్రస్తుత ప్రదేశానికి మార్చారు. అయితే.. అప్పట్లో పరిస్థితులు అంత సులభంగా లేవు. సరుకులు తీసుకురావడం నుంచి రోడ్డుపై బండి పెట్టుకుని అమ్మడం వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా వ్యాపారాన్ని మాత్రం వదిలిపెట్టలేదు.

తన వడాపావ్‌ ప్రత్యేకత ఏమిటని హ్యారీ ఉప్పల్‌ అడిగినప్పుడు అనిల్‌భాయ్‌ చాలా సింపుల్‌గా సమాధానం ఇచ్చారు. ''మా అమ్మ మసాలా చేస్తుంది. ఆమె చేతుల్లో మాయ ఉంది. ఆమె తయారు చేస్తుంది.. మేము అమ్ముతాం'' అని చెప్పారు. ఈ వ్యాపారం కేవలం తన ఒక్కడిదే కాదని, కుటుంబం మొత్తం కలిసి చేసిన ప్రయాణమని ఆయన చెబుతారు. ఆయన అల్లుడు కూడా ప్రస్తుతం ఆయనతో కలిసి పనిచేస్తున్నారు. ఆయన సోదరుడు కూడా గతంలో వడాపావ్‌ వ్యాపారం నిర్వహించేవారు.

బంగ్లా నా కల కాదు
అనిల్‌భాయ్‌ కథలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇప్పుడు ఆయన నివసిస్తున్న బంగ్లాకు ఒకప్పుడు ఆయన కూరగాయలు అమ్మేందుకు వెళ్లేవారు. ఆ బంగ్లా అప్పట్లో హితేష్‌ పారేఖ్‌ అనే వ్యక్తికి చెందినది. తర్వాత అనిల్‌భాయ్‌ ఆ బంగ్లాను కొనుగోలు చేశారు. తాను ఎప్పుడైనా బంగ్లాలో నివసిస్తానని అసలు ఊహించలేదని ఆయన చెప్పారు. ఇది నా కల కాదు. నా తల్లి, నా సోదరుడి కల. నేను బంగ్లాలో ఉంటానని ఎప్పుడూ అనుకోలేదని ఆయన తెలిపారు.

అనిల్‌భాయ్‌ కథలో అందరికీ నచ్చే విషయం ఏమిటంటే.. ఆర్థికంగా ఎదిగిన తర్వాత కూడా, ఆయన తన పాత వృత్తిని వదిలిపెట్టలేదు. ఇప్పటికీ ఉదయం 6 గంటలకు నేనే బండి తీసుకెళ్తాను, పనివాళ్లు లేకపోతే నేనే చేస్తానని అన్నారు.

బంగ్లా పక్కనే వడాపావ్‌ బండి ఉండటం ఇప్పుడు ఆయన జీవితానికి ఒక ప్రత్యేక గుర్తుగా మారింది. బంగ్లా ఆయన సాధించిన స్థాయిని చూపిస్తే.. బండి ఆయన ఎక్కడి నుంచి మొదలుపెట్టారో గుర్తు చేస్తుంది. రోడ్డుపై ఆహారం అమ్మేవారిని చాలామంది పేదలుగా చూస్తారని అనిల్‌భాయ్‌ చెప్పారు. కానీ వారి కష్టాన్ని తక్కువగా చూడకూడదని ఆయన అభిప్రాయం.

కష్టపడితే మంచిరోజు
ప్రజలు మమ్మల్ని పేదవాళ్లమని అనుకుంటారు. కానీ ఎవరైనా కష్టపడి పనిచేస్తే.. చిన్నవారైనా, పెద్దవారైనా.. ఏదో ఒకరోజు మంచి ఫలితం పొందుతారు అని అనిల్‌భాయ్‌ అన్నారు.

రూ.2.50కి వడాపావ్‌ అమ్ముతూ మొదలైన అనిల్‌భాయ్‌ ప్రయాణం.. నేడు సొంత బంగ్లా వరకు చేరింది. అయితే ఆయన కథలో నిజమైన విజయం బంగ్లా సంపాదించడంలోనే లేదు. ఎంత ఎదిగినా తాను మొదలుపెట్టిన పనిని, తన కుటుంబాన్ని, తన మూలాలను మర్చిపోకపోవడంలో ఉంది.

ఇదీ చదవండి: ఉదయం 6 గంటలకే మెయిల్.. ఉద్యోగులకు షాక్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement