'బ్రిక్స్‌ విమెన్‌ ఎకనామిక్‌ కారిడార్‌' ఏర్పాటు చేయాలి: ఉపాసన | Upasana Calls for a BRICS Womens Economic Corridor | Sakshi
Sakshi News home page

'బ్రిక్స్‌ విమెన్‌ ఎకనామిక్‌ కారిడార్‌' ఏర్పాటు చేయాలి: ఉపాసన

Sep 15 2026 4:15 PM | Updated on Sep 15 2026 4:24 PM

Upasana Calls for a BRICS Womens Economic Corridor

మహిళల సాధికారత కేవలం ప్రాతినిధ్యానికే పరిమితం కాకుండా మూలధనం, మార్కెట్లు, ఒప్పందాలు, ఆస్తులు, పెట్టుబడులు, ఆర్థిక యాజమాన్యంగా మారాలని అపోలో ఫౌండేషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌, యూఆర్‌లైఫ్‌ వ్యవస్థాపకురాలు ఉపాసన కామినేని కొణిదెల పిలుపునిచ్చారు. మహిళా పారిశ్రామికవేత్తలను బ్రిక్స్‌ దేశాల మధ్య అనుసంధానించేందుకు ‘బ్రిక్స్‌ విమెన్‌ ఎకనామిక్‌ కారిడార్‌’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

న్యూఢిల్లీలో భారత్‌ బ్రిక్స్‌ అధ్యక్షతన నిర్వహించిన బ్రిక్స్‌ విమెన్‌ బిజినెస్‌ అలయన్స్‌ (డబ్ల్యూబీఏ) విమెన్‌-లెడ్‌ డెవలప్‌మెంట్‌ సమ్మిట్‌-2026లో ఆమె ప్రత్యేక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మహిళలను ఆర్థిక వృద్ధిలో మరింత కీలక భాగస్వాములుగా తీర్చిదిద్దేందుకు విధానాలను పునరాలోచించాల్సిన అవసరం ఉందన్నారు.

''వ్యాపార రంగంలో మరింత మంది మహిళలను ఎలా భాగస్వాములను చేయాలన్నదే చర్చగా ఉండకూడదు. వృద్ధి రూపకల్పనలో మహిళలు కేంద్రంగా ఉంటే బ్రిక్స్‌ ఆర్థిక వ్యవస్థలు ఎలా మారతాయన్నదే అసలు ప్రశ్న'' అని ఉపాసన పేర్కొన్నారు.

ప్రాతినిధ్యం ఉన్నా నిర్ణయాధికారం లేకపోవడం, భాగస్వామ్యం ఉన్నా ఆర్థిక శక్తి లేకపోవడం, ఉద్యోగం ఉన్నా ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం, సాధికారత ఉన్నా యాజమాన్యం లేకపోవడం పూర్తిస్థాయి అభివృద్ధి కాదన్నారు. మహిళా అభివృద్ధి నుంచి మహిళల నేతృత్వంలోని అభివృద్ధి దిశగా ముందుకు సాగాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనకు అనుగుణంగా తదుపరి దశలో స్పష్టమైన ఆర్థిక ఫలితాలను సాధించాలని సూచించారు.

మహిళల కోసం ఏర్పాటయ్యే స్టార్టప్‌ వేదికలు అవార్డులకే పరిమితం కాకుండా పెట్టుబడులకు దారితీయాలని, నెట్‌వర్కింగ్‌ కేవలం పరిచయాలకే కాకుండా వ్యాపార ఒప్పందాలకు దోహదపడాలని, ఆర్థిక సమ్మిళితత కేవలం బ్యాంకు ఖాతాలకే పరిమితం కాకుండా ఆస్తులు, పెట్టుబడుల సృష్టికి దారితీయాలని ఆమె సూచించారు.

మహిళల ఆర్థిక సాధికారతకు ఆరోగ్యం, సంపద, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే హక్కు మూడు కీలక అంశాలని ఆమె పేర్కొన్నారు. ''మహిళకు కేవలం బల్ల దగ్గర ఒక స్థానం ఇవ్వడం కాదు.. ఆ బల్లలోనే వాటా ఇవ్వాలి. అప్పుడే నిజమైన ఆర్థిక శక్తి లభిస్తుంది'' అని ఉపాసన అన్నారు. బ్రిక్స్‌ మహిళా ఆర్థిక కారిడార్‌ ద్వారా మహిళల ఆధ్వర్యంలోని సంస్థలకు పెట్టుబడులు, కొనుగోలుదారులు, అంతర్జాతీయ మార్కెట్లు, భాగస్వామ్యాలు, సరిహద్దులు దాటి వ్యాపార అవకాశాలు అందుబాటులోకి తీసుకురావచ్చని తెలిపారు.

భారత్‌ 2021లో బ్రిక్స్‌ అధ్యక్షత వహించిన సమయంలో బ్రిక్స్‌ విమెన్‌ బిజినెస్‌ అలయన్స్‌ ఇండియా చాప్టర్‌కు అధ్యక్షత వహించిన అపోలో హాస్పిటల్స్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగీతారెడ్డి సేవలను, ప్రస్తుత ఇండియా చాప్టర్‌ చైర్‌పర్సన్‌ అవర్ణ జైన్‌ చేస్తున్న కృషిని ఉపాసన కొనియాడారు.

మహిళల నేతృత్వంలోని సంస్థలను ప్రపంచ విలువ గొలుసులతో అనుసంధానించడం, వ్యాపార నెట్‌వర్క్‌లను విస్తరించడం, బీ2బీ సహకారాన్ని పెంపొందించడం బ్రిక్స్‌ విమెన్‌ బిజినెస్‌ అలయన్స్‌ ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. మహిళలు ఎంతమంది పాల్గొంటున్నారు అన్నదే కాకుండా.. ఎంతమంది యాజమాన్యాన్ని చేపడుతున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు, నాయకత్వం వహిస్తున్నారు, సంపదను సృష్టిస్తున్నారు అన్నదే మహిళా నేతృత్వంలోని అభివృద్ధికి కొలమానంగా ఉండాలని ఉపాసన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement