భారత్‌కు పుతిన్.. ‘రష్యా ప్రళయ విమానం’లో ఏముంది? | Putin In India For BRICS, His Doomsday Plane Draws Attention | Sakshi
Sakshi News home page

భారత్‌కు పుతిన్.. ‘రష్యా ప్రళయ విమానం’లో ఏముంది?

Sep 12 2026 3:47 PM | Updated on Sep 12 2026 4:04 PM

Putin In India For BRICS, His Doomsday Plane Draws Attention

ఒకేలా కనిపించే రెండు విమానాలు.. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ విమానంలో ఉన్నారో ఎవరికీ తెలియదు.. అత్యాధునిక భద్రతా వ్యవస్థలు.. రహస్య కమ్యూనికేషన్ టెక్నాలజీ, అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ కమాండ్ సెంటర్‌గా మారే సామర్థ్యం.. ఇవన్నీ కలగలిసిన పుతిన్‌ ‘డూమ్స్‌డే ప్లేన్’ ఇప్పుడు భారత్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బ్రిక్స్ సదస్సు కోసం పుతిన్ ఢిల్లీకి చేరుకోవడంతో అసలు ఈ ‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’లో ఏముంది అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం తెల్లవారుజామున న్యూఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన సహకారం విస్తరణపై చర్చించారు. ప్రపంచంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన నాయకులలో ఒకరైన రష్యా అధ్యక్షుడు కఠిన భద్రతా ఏర్పాట్ల మధ్య విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన ప్రయాణించే విమాన శ్రేణిలో ఒకేలా ఉండే రెండు విమానాలు ఉంటాయి. వాటిలో ఒకటి 'డికాయ్'.. అత్యంత సురక్షితమైన ప్రత్యేక అధ్యక్ష విమానం('ఇల్యుషిన్ IL-96-300PU). దీనినే ఫ్లయింగ్ క్రెమ్లిన్ లేదా డూమ్స్‌డే ప్లేన్ అని కూడా పిలుస్తారు.

రష్యా అధ్యక్షుడు ప్రయాణించేందుకు ఒకేలా ఉండే రెండు ఇల్యుషిన్ IL-96-300PU విమానాలను ఉపయోగిస్తారు. రష్యా అధ్యక్షుడు ఏ విమానంలో ఎక్కారనేది ఎవరికీ తెలియకుండా ఉండటానికి ఈ రెండు విమానాలు ఒకేసారి గాల్లోకి ఎగురుతాయి. మాస్కోకు ఈ డబుల్-షీల్డ్ భద్రత కొత్త వ్యూహం కాదు. అదనపు భద్రత కోసం పుతిన్ గతంలో కూడా ఇతర దేశాలకు ఇలాగే ప్రయాణించారు.

1980లలో ఇల్యుషిన్ డిజైన్ బ్యూరో చేత అభివృద్ధి చేయబడిన ఈ విమానం.. రష్యా అధ్యక్షుడికి అత్యంత సురక్షితమైన కమాండ్ సెంటర్‌గా పనిచేస్తుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లగల నాలుగు ఇంజిన్ల రష్యన్ విమానం ఇది. అత్యంత ప్రమాద పరిస్థితుల నుంచి రష్యా అగ్ర నాయకత్వాన్ని రక్షించేలా దీనిని రూపకల్పన చేశారు. సుదూర ప్రయాణాలు చేసే IL-96 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన ఈ "ఫ్లయింగ్ క్రెమ్లిన్"లో అవిాద్‌విగటెల్ PS-90A టర్బోఫాన్ ఇంజిన్‌లు ఉన్నాయి. ఇది ఒకేసారికీ సుమారు 11,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. దీనివల్ల సుదీర్ఘ ప్రయాణాలలో పదే పదే ఇంధనం నింపాల్సిన అవసరం ఉండదు. ఈ విమానం పొడవు 55.35 మీటర్లు కాగా.. దీని రెక్కల వెడల్పు 60.12 మీటర్లు. అధ్యక్షుడి ప్రయాణాలన్నింటినీ పర్యవేక్షించే రష్యా ప్రత్యేక విమాన స్క్యాడ్రన్ దీనిని నడుపుతుంది.

జాతీయ అత్యవసర పరిస్థితుల్లో IL-96-300PU పూర్తి స్థాయి మొబైల్ కమాండ్ సెంటర్‌గా పనిచేయగలదు. ఇది ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సైనిక, నిఘా, ప్రభుత్వ నెట్‌వర్క్‌లను సురక్షితంగా సంప్రదించగల ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్‌ వ్యవస్థలను కలిగి ఉంది. ఈ విమానంలో రాడార్-జామింగ్ సాంకేతికత ఉంది. అంతేకాకుండా ఇది అధునాతన రక్షణాత్మక వ్యవస్థలను కలిగి ఉంటుంది. అంతరాయం లేని, సురక్షితమైన సంభాషణను కొనసాగించడానికి శాటిలైట్ లింక్‌లు, రక్షిత రేడియో, డేటా ఛానెల్‌లను కూడా ఇది కలిగి ఉంది.

భద్రతతో పాటు, ఈ "ఫ్లయింగ్ క్రెమ్లిన్" విలాసవంతంగా కూడా రూపుదిద్దుకుంది. ఇందులో బెడ్‌రూమ్‌లతో కూడిన ప్రైవేట్ ప్రెసిడెన్షియల్ సూట్, విలాసవంతమైన బాత్‌రూమ్‌లు, ప్రైవేట్ కిచెన్, డైనింగ్ ఏరియాలు, బోర్డ్‌రూమ్ సీటింగ్‌తో కూడిన పెద్ద సమావేశ మందిరం ఉన్నాయి. ఇవి కాకుండా ఈ విమానంలో బంగారంతో పూత పూసిన ఫిట్టింగ్‌లు, ఆకర్షణీయమైన కలప, ప్రీమియం లెదర్, అప్హోల్స్టరీ తదితర విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయి.

 ఇదీ చదవండి: జైలులో తనిఖీలు.. ఫోన్‌తో దొరికేసిన ప్రజ్వల్‌ రేవణ్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement