ప్రపంచ దేశాల అధినేతలు సదస్సులు, సమావేశాలకు వెళ్లినప్పుడు ప్రసంగాలకే కాదు.. వాళ్ల ప్రయాణాలు, భద్రత-ఆహార ఏర్పాట్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. వెంట తీసుకొచ్చే వస్తువులు, అందుకునే కానుకల వరకు ప్రతీ అంశంపైనా ఆసక్తికర చర్చ నడుస్తుంటుంది. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న 2026 బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ విషయంలో అంతకు మించిందేదో కనిపిస్తోంది..
ఇద్దరు నేతలు భారత్‌కు చేరుకున్న తీరు ఇప్పుడు ప్రత్యేక చర్చకు దారితీసింది. ఒకవైపు పుతిన్ అత్యంత భద్రతా ప్రమాణాలతో రూపొందించిన ఐఎల్-96-300పీయూలో ఢిల్లీకి వచ్చారు. దీనినే ‘డూమ్స్‌డే ప్లేన్’, ‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’ వంటి పేర్లతో పిలుస్తారు. మరోవైపు ఎయిర్ చైనా ప్రత్యేక విమానంలో జిన్‌పింగ్ వచ్చారు. గగన ప్రయాణమే కాదు.. ఇటు వీళ్ల కోసం తెచ్చిన ప్రెసిడెన్షియల్ కార్లు కూడా అంతే ఆసక్తికరంగా ఉన్నాయి. పుతిన్ కోసం ఔరస్ సెనాట్.. జిన్‌పింగ్ కోసం సమ్‌థింగ్ స్పెషల్ హోంగ్‌చీ ఎన్701 హైలైట్‌గా నిలిచాయి. ఒకరిది ‘ఫోర్ట్‌రెస్ ఆన్ వీల్స్’గా పేరొందితే.. మరొకరి రాజకీయ చరిత్రతో ముడిపడిన ‘రెడ్ ఫ్లాగ్’ బ్రాండ్‌గా పేరొందాయి.
‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’..
పుతిన్ ప్రయాణించే విమానం ఐఎల్-96-300పీయూ.. ఎంతో ప్రత్యేకం. అత్యవసర పరిస్థితుల్లోనూ రష్యా అధ్యక్షుడు దేశ సైనిక, ప్రభుత్వ వ్యవస్థలతో సురక్షితంగా కమ్యూనికేట్ చేయగలిగేలా దీన్ని మొబైల్ కమాండ్ సెంటర్‌గా రూపొందించారు. శాటిలైట్ లింకులు, ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్, రాడార్ జామింగ్ సహా పలు రక్షణ వ్యవస్థలు ఇందులో ఉంటాయి. అంతేకాదు.. పుతిన్ భారత్‌కు వచ్చినప్పుడు ఒకే తరహాకు చెందిన రెండు విమానాలు ఒకేసారి ప్రయాణించాయి. అసలు అధ్యక్షుడు ఏ విమానంలో ఉన్నారో గుర్తించడం కష్టమయ్యేలా చేసే ఈ వ్యూహం.. భద్రతలో భాగమే. అందుకే ఐఎల్-96-300పీయూకి ‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’, ‘డూమ్స్‌డే ప్లేన్’ వంటి పేర్లు వచ్చాయి.
ఫోర్ట్‌రెస్ ఆన్ వీల్స్..
ఆకాశంలో ఇంతటి భద్రత ఉంటే.. పుతిన్ నేలపై ప్రయాణించే కారు కూడా అంతే కట్టుదిట్టంగా ఉంటుంది. ఢిల్లీలో పుతిన్ ఉపయోగించిన ఔరస్ సెనాట్‌ను అందుకే ‘ఫోర్ట్‌రెస్ ఆన్ వీల్స్’గా అభివర్ణిస్తారు. బుల్లెట్లు, పేలుళ్ల నుంచి రక్షణ కల్పించేలా రూపొందించిన ఈ ఆర్మర్డ్ లిమోసిన్‌ను రష్యా దేశీయంగా అభివృద్ధి చేసింది. పాశ్చాత్య లగ్జరీ కార్లపై ఆధారపడకుండా.. దేశాధ్యక్షుడి స్థాయికి తగ్గ భద్రతా వాహనాన్ని సొంతంగా తయారు చేసుకోగలిగింది. బ్రిక్స్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పుతిన్ ఇదే కారులో ప్రయాణించడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
జిన్‌పింగ్ ‘ఎయిర్ చైనా’..
ఇక పుతిన్ విమానంతో పోలిస్తే జిన్‌పింగ్ ప్రయాణించిన విమానం మరో రకమైన ప్రత్యేకతను చూపిస్తుంది. చైనా అధ్యక్షుడు ఎయిర్ చైనా ప్రత్యేక విమానంలో భారత్‌కు చేరుకున్నారు. ఇది పుతిన్ ఐఎల్-96-300పీయూ తరహాలో మొబైల్ కమాండ్ సెంటర్‌గా రూపొందించిన ప్రత్యేక అధ్యక్ష విమానం కాదు. అయితే దేశాధ్యక్షుడి విదేశీ పర్యటన కావడంతో భద్రత, ప్రోటోకాల్‌కు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అంటే.. ఒకరి విమానం అత్యంత రహస్య భద్రతా వ్యవస్థలకు ప్రతీక అయితే.. మరొకరి ప్రయాణం చైనా అధికారిక విమానయాన వ్యవస్థను ప్రతిబింబిస్తోంది.
‘రెడ్ ఫ్లాగ్’ ఎన్701..
విమానం నుంచి రోడ్డుపైకి వస్తే.. జిన్‌పింగ్ కోసం ఉపయోగించే హోంగ్‌చీ ఎన్701 మరో ప్రత్యేక ఆకర్షణ. హోంగ్‌చీ అంటే చైనీస్‌లో ‘రెడ్ ఫ్లాగ్’.. అంటే ‘ఎర్ర జెండా’ అని అర్థం. చైనా రాజకీయ, అధికార వ్యవస్థతో దశాబ్దాలుగా ముడిపడిన ఈ బ్రాండ్.. దేశ అత్యున్నత నాయకత్వానికి ప్రతీకగా మారింది. జిన్‌పింగ్ కోసం ఉపయోగించే ఎన్701 సాధారణ హోంగ్‌చీ కారు కాదు. సుమారు 5.5 మీటర్ల పొడవుండే ఈ ప్రత్యేక లిమోసిన్‌లో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, భారీ ఆర్మర్, బుల్లెట్ ప్రూఫ్ టైర్లు వంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే దీని పూర్తి సాంకేతిక వివరాలను చైనా అధికారికంగా వెల్లడించలేదు. అందుకే ఎన్701 చుట్టూ ఉన్న ఆసక్తి.. దాని డిజైన్ కంటే, దానిలో దాగి ఉన్న భద్రతా సాంకేతికతపైనే ఎక్కువ.
కేవలం ప్రయాణం కాదు.. పవర్ స్టేట్‌మెంట్!
ఈ విమానాలు, కార్లు కేవలం ప్రపంచ నేతలను ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లే సాధనాలు మాత్రమే కాదు. ఆ విమానాలు, కార్లు ఆయా దేశాల భద్రతా ఏర్పాట్లు, టెక్నాలజీ, సొంత తయారీ సామర్థ్యాన్ని చూపిస్తాయి. బ్రిక్స్ వంటి ప్రపంచ వేదికపై నేతల రాకతో పాటు వారి వెంట వచ్చిన ఈ ‘పవర్ మెషీన్లు’ కూడా తమదైన రీతిలో ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. ఆకాశంలో భద్రతా కోటలు.. నేలపై కదిలే కోటలు.. మొత్తంగా చూస్తే ఇది కేవలం నేతల ప్రయాణం కాదు.. రష్యా, చైనాల పవర్ స్టేట్‌మెంట్!.
ఇదీ చదవండి: ఏడేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టాడు!


