ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై తమ సైనిక చర్యను ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఆయన అభివర్ణించారు. గెలుపే లక్ష్యంగా పోరాడుతున్నామని.. వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియా సంక్షోభంపై పూటకో ప్రకటన చేస్తున్న ఆయన.. ఇప్పుడు మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు.
9/11 దాడులకు పాతికేళ్లు పూర్తైన సందర్భంగా వాషింగ్టన్‌లోని పెంటగాన్‌లో జరిగిన స్మారక కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2001 నాటి ఉగ్రదాడులను గుర్తుచేసుకుంటూ.. పెంటగాన్‌పై దూసుకొచ్చిన హైజాక్ విమానంలో 64 మంది, భవనంలో 125 మంది మరణించిన విషయాన్ని ట్రంప్ గుర్తుచేశారు. ‘వార్ ఆన్ టెర్రర్’లో సేవలందించిన అమెరికా సైనికులకు నివాళులర్పించిన ఆయన.. ప్రస్తుతం ఇరాన్‌పై జరుగుతున్న సైనిక చర్యను కూడా ప్రస్తావించారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని పొందకుండా అమెరికా సైనికులు పనిచేస్తున్నారని చెప్పారు.
9/11 విషాదాన్ని, ఇరాన్‌పై యుద్ధాన్ని నేరుగా ముడిపెడుతూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మనం ఎప్పటికీ, ఎప్పటికీ మర్చిపోం. అందుకే ఈరోజు పోరాడుతున్నాం. మనకు మరో మార్గం లేదు. విజయం తప్ప మరోటి ఉండదు. మేం గట్టిగా పోరాడతాం. గెలవడానికి పోరాడతాం’’ అని ట్రంప్ అన్నారు.
ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం ఆరు నెలలకు పైగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. వరుస సైనిక దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికాలోనూ ఈ యుద్ధంపై రాజకీయంగా తీవ్ర చర్చ, వ్యతిరేకత కొనసాగుతోంది.
ట్రంప్ తీరుపై విమర్శలు
9/11 వార్షికోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లోని గ్రౌండ్ జీరోలో జరిగే ప్రధాన స్మారక కార్యక్రమానికి ట్రంప్ హాజరుకాకుండా వాషింగ్టన్‌లోనే ఉండటంపై విమర్శలు వచ్చాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ న్యూయార్క్ వెళ్లి వరల్డ్ ట్రేడ్ సెంటర్ స్థలంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
పెంటగాన్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం దాదాపు 20 నిమిషాల పాటు సాగింది. అమెరికా ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లను ప్రస్తావిస్తూ.. ‘‘అమెరికా ఈరోజు పరీక్షను ఎదుర్కొంటోంది. ఆ పరీక్షలో మనం ఘనంగా విజయం సాధిస్తున్నాం’’ అని చెప్పారు. అయితే 9/11 దాడుల సమయంలో, అనంతరం అమెరికాకు మద్దతుగా నిలిచిన మిత్రదేశాల సహకారాన్ని ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడంపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి.
‘ఇరాన్ రక్షణ వ్యవస్థలు కుప్పకూలాయి’
అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ కూడా పెంటగాన్ కార్యక్రమంలో ఇరాన్‌పై కఠిన వ్యాఖ్యలు చేశారు. దాదాపు అర్ధ శతాబ్దంగా అమెరికా నాశనాన్ని కోరుకుంటున్న ‘‘ఇస్లామిక్ థియోక్రసీ’’గా ఇరాన్‌ను అభివర్ణించారు. ఇరాన్ రక్షణ వ్యవస్థలు పూర్తిగా కూలిపోయాయని ఆయన పేర్కొన్నారు. ‘‘మేం ఇప్పటికీ ఉగ్రవాదులను వారు చేరాల్సిన చోటుకు పంపుతున్నాం. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకుండా చూస్తున్నాం. ఆర్థిక ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది’’ అని హెగ్‌సెత్ అన్నారు. 9/11 తర్వాత మొదలైన ‘‘చెడుపై పోరాటం’’ ఇంకా కొనసాగుతోందని, అది ‘‘జడ్జ్‌మెంట్ డే’’ వరకు కొనసాగుతుందని వ్యాఖ్యానించారు.
అమెరికాలోనూ ముప్పు పొంచి ఉందని హెగ్‌సెత్ హెచ్చరించారు. విదేశాల్లో, దేశంలో ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాదులతో పాటు అమెరికా శక్తిని బలహీనపర్చాలని, అమెరికన్లను చంపాలని చూస్తున్న శత్రువులపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ట్రంప్ నాయకత్వంలో ఇరాన్ సైనిక సామర్థ్యాలను నిర్వీర్యం చేస్తున్నామని చెప్పిన ఆయన.. దేశ సేవకు సిద్ధంగా ఉండే ‘‘బలమైన, ధైర్యవంతమైన యోధుల’’ కొత్త తరం అవసరమని పేర్కొన్నారు.
సౌదీ అరేబియాపై చర్యకు డిమాండ్
మరోవైపు న్యూయార్క్‌లో జరిగిన 9/11 స్మారక కార్యక్రమంలో బాధిత కుటుంబాల తరఫున టెర్రీ స్ట్రాడా అమెరికా ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు. 9/11 బాధితురాలి భర్త అయిన ఆమె.. దాడులతో సౌదీ అరేబియాకు సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఆ దేశాన్ని బాధ్యులను చేయాలని ట్రంప్ ప్రభుత్వాన్ని కోరారు. ‘‘ఒక్కొక్కటిగా మాకు ద్రోహాలు ఎదురవుతూనే ఉన్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికీ దాన్ని మార్చగలరు’’ అని స్ట్రాడా అన్నారు. అమెరికాతో స్నేహం కోరుకుంటే 9/11 ఉగ్రవాదులతో సంబంధాలపై సౌదీ అరేబియా చేస్తున్న నిరాకరణలను ఆపేలా ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.
సాధారణంగా 9/11 వార్షికోత్సవ కార్యక్రమాలు 2001లో మరణించిన దాదాపు 3,000 మందిని స్మరించుకోవడానికే పరిమితమవుతాయి. అయితే 25వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై కొనసాగిస్తున్న యుద్ధాన్ని సమర్థించేందుకు కూడా ఈ వేదిక ఉపయోగపడింది.
ఇదీ చదవండి: ఇంట్రెస్టింగ్.. ట్రంప్ వారసుడెవరు?


