ఉక్రెయిన్‌తో యుద్ధంలో భారీగా నష్టం
యూకే రక్షణ శాఖ అంచనా
కీవ్: 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించినప్పటి నుంచి రష్యా ఏకంగా 5 లక్షల మంది సైనికులను నష్టపోయిందని యూకే రక్షణ శాఖ అంచనా వేసింది. యుద్ధ క్షేత్రంలో 5 లక్షల మంది చనిపోగా, మరో 10 లక్షల మంది వరకు సైనికులు గాయపడ్డారని యూకే డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ సర్ రిచర్డ్ నైటన్ వెల్లడించారు. సైనిక సామగ్రిని కూడా గణనీయంగా రష్యా కోల్పోయిందని ఆయన తెలిపారు.
ఇందులో 10 వేలకు పైగా సాయుధ వాహనాలు, దాదాపు 3 వేల గగనతల, ఫిరంగి వ్యవస్థలు, 370 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఉన్నాయన్నారు. యుద్ధంలో ఉక్రెయిన్‌కు వాటిల్లిన నష్టాలను ఆయన పేర్కొనలేదు. యూకే రక్షణ శాఖ సైనిక నష్టం అంచనాపై రష్యా అధికారులు స్పందించలేదు. కాగా, ఈ ఏడాది రష్యా సైన్యం దూకుడు బాగా తగ్గిందని, ఉక్రెయిన్‌లో చాలా నెమ్మదిగా ముందుకు సాగుతోందని పరిశీలకులు అంటున్నారు.
కీవ్‌లో గ్యాస్ స్టేషన్లే లక్ష్యం
రష్యా వరుసగా రెండో రోజు శుక్రవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని గ్యాస్ స్టేషన్లే లక్ష్యంగా డ్రోన్ల దాడి కొనసాగించింది. రెండు గ్యాస్ స్టేషన్లపై దాడిలో ఇద్దరు చనిపోగా ఆరుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. అదేవిధంగా, సెంట్రల్ ఉక్రెయిన్‌లోని పావ్‌లోహ్రాడ్ నగరంలోని షాపింగ్ మాల్స్‌పై శుక్రవారం రష్యా జరిపిన దాడిలో ఐదుగురు చనిపోగా, 67 మంది వరకు గాయపడ్డారు. జపొరిజియాలోని 9 అంతస్తుల బహుళ అంతస్తుల భవనం, ఓ షాపింగ్ మాల్‌పై రష్యా చేపట్టిన డ్రోన్ దాడిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
777 డ్రోన్లు కూల్చాం: రష్యా
రష్యాలోని కీలక చమురు కేంద్రాలపై ఉక్రెయిన్ దాడులు కొనసాగిస్తోంది. సరిహద్దులకు 3 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యాలోని సైబీరియా ప్రాంతంలోని రిఫైనరీపై డ్రోన్ దాడి జరిపింది. క్రిమియా, అజోవ్, కాస్పియన్ సముద్ర జలాలు సహా 16 ప్రాంతాలపైకి ప్రయోగించిన 777 డ్రోన్లను మధ్యలోనే కూల్చినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. రాజధాని మాస్కో సమీపంలోని తులా ప్రాంతంపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో ఇద్దరు చనిపోగా, ముగ్గురు గాయపడ్డారు.


