హాజరైన నలుగురు మాజీ అధ్యక్షులు, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
కార్యక్రమాన్ని ప్రారంభించిన న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ
న్యూయార్క్: సెప్టెంబర్ 11(9/11) దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం న్యూయార్క్‌లోని గ్రౌండ్ జీరో వద్ద సంతాపం కార్యక్రమం ఏర్పాటైంది. ఈ కార్యక్రమానికి అమెరికా మాజీ అధ్యక్షులు నలుగురు, ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, న్యూయార్క్ సిటీ మేయర్ జొహ్రాన్ మమ్దానీ హాజరయ్యారు. ఉగ్రదాడిలో నేలమట్టమైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ స్థలం పేరే గ్రౌండ్ జీరో.
ఇక్కడ ఏర్పాటు చేసిన స్మారక చిహ్నం వద్ద ఏటా సెప్టెంబర్ 11న మృతులకు నివాళులర్పిస్తున్నారు. శుక్రవారం హాజరైన మాజీ అధ్యక్షులు, వారి భార్యలు.. బిల్–హిల్లరీ క్లింటన్, జార్జి–లారా బుష్, బరాక్– మిషెల్ ఒబామా, జో–జిల్ బైడెన్‌తోపాటు పోలీసు, ఫైర్ విభాగాల ఉన్నతాధికారులు, మృతులు, బాధితుల బంధువులు తదితరులు హాజరయ్యారు. ఎప్పటి మాదిరిగానే ఈ సందర్భంగా 9/11 దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి పేర్లను ముందుగా చదివి వినిపించారు.
అనంతరం ఏడు సెకన్లపాటు మౌనం పాటించారు. జంట టవర్లతోపాటు పెంటగాన్ భవానాన్ని విమానాలు ఢీకొట్టిన సమయాన్ని గుర్తు చేస్తూ గంటలు మోగించారు. టవర్లు కుప్పకూలిన సమయాలు, హైజాకర్లు విమానాన్ని తమ అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించగా యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 93లోని ప్రయాణికులు వారిపై ఎదురుదాడి చేసిన క్షణాలను గుర్తు చేసుకుంటూ సరిగ్గా అదే సమయాలకు గంటలు మోగిస్తూ మౌనం పాటించారు.
దాడుల అనంతర పరిణామాలతో ఆరోగ్య సమస్యల వల్ల మరణించిన వారిని స్మరించుకుంటూ మౌనం పాటించారు. ఈ సంస్మరణ కార్యక్రమాన్ని నగర మేయర్ మమ్దానీ ప్రారంభించారు. ముందుగా ఆయన జంట టవర్లలో మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడే క్రమంలో ప్రాణాలర్పించిన 300 మంది ఫైర్ సిబ్బందికి నివాళులర్పించారు. అనంతరం, ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేశారు.
సెప్టెంబర్ 11 దాడిని ‘ఒక భయానక తీవ్రవాద చర్య, అపారమైన నష్టాన్ని మిగిల్చిన రోజు’గా వర్ణించారు. ‘న్యూయార్క్ చరిత్రలోనే 9/11 అత్యంత చీకటి రోజుగా మిగిలిపోతుంది. అదేవిధంగా, ఎందరో న్యూయార్క్ వాసులు చేసిన సేవలను కూడా గుర్తు చేసుకుందాం.
దాడుల తరువాత రక్తం దానం చేయడానికి గంటల తరబడి వరుసలో నిలబడిన వేలాది మంది న్యూయార్కర్ల సేవలను, బాధితుల కోసం తమ ఇళ్ల తలుపులు తెరిచిన వారిని, ఎన్నో వ్యయప్రయాసల కోర్చి సహచరులను రక్షించిన వారిని గుర్తు చేసుకుందాం’అని మమ్దానీ పేర్కొన్నారు.
మనకు దూరమైన వారి విషయంలో మనకు ఒక పవిత్రమైన బాధ్యత ఉందని ఆయన చెప్పారు. ‘వారు అపరిచితుల పట్ల చూపిన ఆదరణలాగే మనం కూడా ఒకరినొకరు ఆదుకోవాలి. వారు చేసిన త్యాగాలకు తగినట్లుగా జీవించాలి, వారి ధైర్యానికి తగిన నగరాన్ని ..ఒకరికొకరు తోడుగా నిలిచే నగరాన్ని నిర్మించుకోవాలి. అలా చేయడం ద్వారానే మనం వారిని సరిగ్గా స్మరించుకున్నట్లవుతుంది’అని ఆయన పేర్కొన్నారు.


