breaking news
September 11 attacks
-
లాడెన్ హిట్‌లిస్ట్‌లో భారత్.. బయటపడ్డ సంచలన రహస్యాలు
అమెరికా సెప్టెంబర్ 11 దాడులకు పాతికేళ్లు పూర్తయిన వేళ.. అమెరికా గూఢచార సంస్థ (CIA) సంచలన విషయాలు బయటపెట్టింది. అల్ ఖైదా వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్.. భారత్‌పై కూడా దాడులకు ప్లాన్ చేసినట్లు షాకింగ్ విషయం వెలుగులోకి తెచ్చింది. 1998లోనే ఈ కుట్రకు పథకం రచించినట్లు సీఐఏ తాజాగా విడుదల చేసిన రహస్య పత్రాల ద్వారా బయటపడింది. బిన్ లాడెన్‌కు సంబంధించిన 70కి పైగా ప్రెసిడెన్షియల్ ఇంటెలిజెన్స్ బ్రీఫ్లను, 100 పేజీలకు పైగా సమాచారాన్ని సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ బహిర్గతం చేశారు.ఒసామా బిన్ లాడెన్ దాడులు జరపాలనుకుంటున్న దేశాల జాబితాలో భారత్‌తో పాటు పాకిస్థాన్, ఈజిప్ట్, అరేబియన్ ద్వీపకల్పంలోని దేశాలు, ఉగాండా, నైజీరియా ఉన్నాయి. అయితే, ఆ పత్రాల్లో భారత్‌లో ఎక్కడ? ఎప్పుడు? దాడి చేయాలనుకున్నారో వంటి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు. "బిన్ లాడెన్ టెర్రరిస్ట్ నెట్వర్క్ స్టిల్ ఏ థ్రెట్" అనే పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక.. అమెరికా దాడుల తర్వాత కూడా లాడెన్ నెట్వర్క్ చెదిరిపోలేదని పేర్కొంది.కాగా, ఉగ్రవాదుల ఉన్మాదానికి 2,977 మంది బలైపోయిన సెప్టెంబర్ 11(9/11) దాడులకు 25 ఏళ్లు పూర్తయ్యాయి. అగ్రరాజ్యం అమెరికానే సవాలు చేస్తూ ముష్కరులు సాగించిన మారణహోమాన్ని ప్రపంచం ఇప్పటికీ మర్చిపోలేదు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా 2001 సెప్టెంబర్ 11న అమెరికాపై విరుచుకుపడింది. ఆత్మాహుతి దాడులకు పాల్పడింది. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రవాద దాడికి నిలిచిపోయింది. అల్‌ఖైదా శిక్షణలో రాటుతేలిన 19 మంది ఉగ్రవాదులు నాలుగు విమానాలను హైజాక్ చేసి పలు లక్ష్యాలను ఢీకొట్టారు.ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్, వాషింగ్టన్ డీసీలపై జరిగిన దాడులు భారీ ప్రాణనష్టాన్ని, పెను విధ్వంసాన్ని సృష్టించాయి. న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడిలో దాదాపు 2,750 మంది, పెంటగాన్ వద్ద 184 మంది, పెన్సిల్వేనియాలో 40 మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ అఘాయిత్యానికి తెగించిన మొత్తం 19 మంది ఉగ్రవాదులు సైతం మృత్యువాత పడ్డారు. మంటల్లో చిక్కుకున్న బాధితులను రక్షించే ప్రయత్నంలో 400 మందికి పైగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మరణించడం గమనార్హం. 9/11 దాడుల వల్ల అమెరికాకు 10 బిలియన్ డాలర్లుకుపైగా నష్టం వాటిల్లింది.ఇదీ చదవండి: ఘోర కలికి పాతికేళ్లు -
ఫ్లైట్ 93 చివరి ఫోన్ కాల్స్.. 9/11 లో ఏం జరిగింది?
-
9/11... నివాళి
న్యూయార్క్: సెప్టెంబర్ 11(9/11) దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం న్యూయార్క్‌లోని గ్రౌండ్ జీరో వద్ద సంతాపం కార్యక్రమం ఏర్పాటైంది. ఈ కార్యక్రమానికి అమెరికా మాజీ అధ్యక్షులు నలుగురు, ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, న్యూయార్క్ సిటీ మేయర్ జొహ్రాన్ మమ్దానీ హాజరయ్యారు. ఉగ్రదాడిలో నేలమట్టమైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ స్థలం పేరే గ్రౌండ్ జీరో. ఇక్కడ ఏర్పాటు చేసిన స్మారక చిహ్నం వద్ద ఏటా సెప్టెంబర్ 11న మృతులకు నివాళులర్పిస్తున్నారు. శుక్రవారం హాజరైన మాజీ అధ్యక్షులు, వారి భార్యలు.. బిల్–హిల్లరీ క్లింటన్, జార్జి–లారా బుష్, బరాక్– మిషెల్ ఒబామా, జో–జిల్ బైడెన్‌తోపాటు పోలీసు, ఫైర్ విభాగాల ఉన్నతాధికారులు, మృతులు, బాధితుల బంధువులు తదితరులు హాజరయ్యారు. ఎప్పటి మాదిరిగానే ఈ సందర్భంగా 9/11 దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి పేర్లను ముందుగా చదివి వినిపించారు. అనంతరం ఏడు సెకన్లపాటు మౌనం పాటించారు. జంట టవర్లతోపాటు పెంటగాన్ భవానాన్ని విమానాలు ఢీకొట్టిన సమయాన్ని గుర్తు చేస్తూ గంటలు మోగించారు. టవర్లు కుప్పకూలిన సమయాలు, హైజాకర్లు విమానాన్ని తమ అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించగా యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 93లోని ప్రయాణికులు వారిపై ఎదురుదాడి చేసిన క్షణాలను గుర్తు చేసుకుంటూ సరిగ్గా అదే సమయాలకు గంటలు మోగిస్తూ మౌనం పాటించారు. దాడుల అనంతర పరిణామాలతో ఆరోగ్య సమస్యల వల్ల మరణించిన వారిని స్మరించుకుంటూ మౌనం పాటించారు. ఈ సంస్మరణ కార్యక్రమాన్ని నగర మేయర్ మమ్దానీ ప్రారంభించారు. ముందుగా ఆయన జంట టవర్లలో మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడే క్రమంలో ప్రాణాలర్పించిన 300 మంది ఫైర్ సిబ్బందికి నివాళులర్పించారు. అనంతరం, ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేశారు. సెప్టెంబర్ 11 దాడిని ‘ఒక భయానక తీవ్రవాద చర్య, అపారమైన నష్టాన్ని మిగిల్చిన రోజు’గా వర్ణించారు. ‘న్యూయార్క్ చరిత్రలోనే 9/11 అత్యంత చీకటి రోజుగా మిగిలిపోతుంది. అదేవిధంగా, ఎందరో న్యూయార్క్ వాసులు చేసిన సేవలను కూడా గుర్తు చేసుకుందాం. దాడుల తరువాత రక్తం దానం చేయడానికి గంటల తరబడి వరుసలో నిలబడిన వేలాది మంది న్యూయార్కర్ల సేవలను, బాధితుల కోసం తమ ఇళ్ల తలుపులు తెరిచిన వారిని, ఎన్నో వ్యయప్రయాసల కోర్చి సహచరులను రక్షించిన వారిని గుర్తు చేసుకుందాం’అని మమ్దానీ పేర్కొన్నారు. మనకు దూరమైన వారి విషయంలో మనకు ఒక పవిత్రమైన బాధ్యత ఉందని ఆయన చెప్పారు. ‘వారు అపరిచితుల పట్ల చూపిన ఆదరణలాగే మనం కూడా ఒకరినొకరు ఆదుకోవాలి. వారు చేసిన త్యాగాలకు తగినట్లుగా జీవించాలి, వారి ధైర్యానికి తగిన నగరాన్ని ..ఒకరికొకరు తోడుగా నిలిచే నగరాన్ని నిర్మించుకోవాలి. అలా చేయడం ద్వారానే మనం వారిని సరిగ్గా స్మరించుకున్నట్లవుతుంది’అని ఆయన పేర్కొన్నారు. -
ఘోర కలికి పాతికేళ్లు
ఉగ్రవాదుల ఉన్మాదానికి 2,977 మంది బలైపోయిన సెప్టెంబర్ 11(9/11) దాడులకు 25 ఏళ్లు పూర్తయ్యాయి. అగ్రరాజ్యం అమెరికానే సవాలు చేస్తూ ముష్కరులు సాగించిన మారణహోమాన్ని ప్రపంచం ఇప్పటికీ మర్చిపోలేదు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా 2001 సెప్టెంబర్ 11న అమెరికాపై విరుచుకుపడింది. ఆత్మాహుతి దాడులకు పాల్పడింది. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రవాద దాడికి నిలిచిపోయింది. అల్‌ఖైదా శిక్షణలో రాటుతేలిన 19 మంది ఉగ్రవాదులు నాలుగు విమానాలను హైజాక్ చేసి పలు లక్ష్యాలను ఢీకొట్టారు. ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్, వాషింగ్టన్ డీసీలపై జరిగిన దాడులు భారీ ప్రాణనష్టాన్ని, పెను విధ్వంసాన్ని సృష్టించాయి. న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడిలో దాదాపు 2,750 మంది, పెంటగాన్ వద్ద 184 మంది, పెన్సిల్వేనియాలో 40 మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ అఘాయిత్యానికి తెగించిన మొత్తం 19 మంది ఉగ్రవాదులు సైతం మృత్యువాత పడ్డారు. మంటల్లో చిక్కుకున్న బాధితులను రక్షించే ప్రయత్నంలో 400 మందికి పైగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మరణించడం గమనార్హం. 9/11 దాడుల వల్ల అమెరికాకు 10 బిలియన్ డాలర్లుకుపైగా నష్టం వాటిల్లింది. దాడి ఎలా జరిగింది? హైజాకర్ల ముసుగులోని ఉగ్రవాదులు తూర్పు తీరంలోని మూడు ఎయిర్‌పోర్టుల నుంచి తమ మారణకాండ ప్రారంభించారు. నాలుగు విమానాల్లోకి ప్రవేశించారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వాటిని తమ ఆ«దీనంలోకి తీసుకున్నారు. రహస్యంగా తమ వెంట తెచ్చుకున్న బాక్స్ కట్టర్లతో పైలట్లతోపాటు తమకు ఎదురు తిరిగిన కొందరు ప్రయాణికులను పొడిచేశారు. ఉదయం 8.46 గంటలకు బోస్టన్ నుండి బయలుదేరిన మొదటి విమానం(అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం) న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్‌ను ఢీకొట్టింది. బోస్టన్ నుండే బయలుదేరిన రెండో విమానం 17 నిమిషాల తర్వాత సౌత్ టవర్‌లోకి దూసుకెళ్లింది. రెండు టవర్ల నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. జనం హాహాకారాలు చేశారు. కొందరు ప్రాణాలు దక్కించుకొనే క్రమంలో టవర్ల నుంచి కిందికి దూకేశారు. నిమిషాల వ్యవధిలోనే రెండు టవర్లు నేలమట్టమయ్యాయి. అప్పటిదాకా అందరూ ఇది విమాన ప్రమాదంగానే భావించారు. ముష్కర మూకల ఘాతుకమేనన్న అనుమానం రాలేదు. ఇక వాషింగ్టన్ డీసీ సమీపంలోని డల్లెస్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన మూడో విమానం ఉదయం 9.37 గంటలకు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయమైన పెంటగాన్ నైరుతి వైపు భాగాన్ని ఢీకొట్టింది. దాంతో అక్కడ మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మూడుచోట్ల విమాన ప్రమాదాలు జరగడంలో ఇది ఉగ్రవాద దాడికి అనుమానించిన ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత న్యూజెర్సీలోని నెవార్క్ నుంచి వస్తున్న నాలుగో విమానం పెన్సిల్వేనియా గ్రామీణ ప్రాంతంలోని షాంక్స్‌విల్ సమీపంలో కూలిపోయింది. న్యూయార్క్, పెంటగాన్ ఘటనల గురించి అప్పటికే సెల్ఫోన్ల ద్వారా సమాచారం అందుకున్న నాలుగో విమానంలోని ప్రయాణికులు ఉగ్రవాదులపై తిరగబడ్డారు. నిలువరించేందుకు గట్టిగా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే విమానం కుప్పకూలింది. అందులోని 40 మంది అగ్నికి ఆహూతయ్యారు. మొత్తం నాలుగు ఘటనల్లో 2,974 మృతిచెందగా, వీరిలో 90 దేశాల పౌరులు ఉన్నారు. 35 నుంచి 41 మంది భారతీయులు మరణించినట్లు అంచనా.ఉగ్రవాదంపై పోరాటం సఫలమైనట్లేనా? ఉగ్రవాదంపై అమెరికా ప్రారంభించిన ప్రపంచ యుద్ధం సఫలమైందా? అంటే లేదనే చెప్పాలి. సెపె్టంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉగ్రవాదులు దాడులకు దిగారు. వేలాది మందిని బలి తీసుకున్నారు. ఉగ్రవాద భూతం అంతం కాలేదు. అంతమయ్యే సూచనలు కూడా కనిపించడం లేదు. ఉగ్రవాదం ప్రపంచానికి పెను సవాళ్లు విసురుతూనే ఉంది. అయితే, అమెరికాలో మాత్రం గత 25 ఏళ్లలో చెప్పుకోదగ్గ ఉగ్రవాద దాడులేవీ జరగలేదు. నిఘాను కట్టుదిట్టడం చేయడమే ఇందుకు కారణం. ఉగ్రవాదంపై యుద్దంలో అమెరికా అరకొర విజయం సాధించినట్లే చెప్పుకోవాలి. ఆపరేషన్ ఒసామా బిన్ లాడెన్ 9/11 దాడులు అమెరికాతోపాటు ప్రపంచాన్ని కుదిపేశాయి. ఆ రోజు అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ ఫ్లోరిడాలోని సరసోటాలో ఓ పాఠశాలలో ఉన్నారు. రెండో తరగతి విద్యార్థులతో మాట్లాడుతున్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్లోకి ఒక విమానం దూసుకుపోయిందని ఆయనకు సమాచారం అందింది. కొద్దిసేపటి తర్వాత చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయిన ఆండ్రూ కార్డ్ అధ్యక్షుడి కుడి చెవిలో గుసగుసలాడారు. అమెరికాపై దాడి జరుగుతోందని చెప్పారు. అదే రోజు రాత్రి 8.30 గంటలకు బుష్ వైట్‌హౌస్‌లో దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులకు, వారికి ఆశ్రయం కల్పించిన వారిని శిక్షించి తీరుతామని ప్రతిజ్ఞ చేశారు. సెపె్టంబర్ 11 దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ‘గ్లోబల్ వార్ ఆన్ టెర్రర్’ప్రారంభించింది. మానవాళికి ముప్పుగా మారిన ఉగ్రవాద సంస్థలను నిర్మూలించేందుకు చర్యలు చేపట్టింది. అల్‌ఖైదాకు మద్దతు ఇస్తున్నారన్న ఆరోపణలతో అఫ్గానిస్తాన్ తాలిబన్ ప్రభుత్వాన్ని కూల్చిచేసింది. అమెరికా పట్ల నరనరాన విద్వేషం నింపుకొని ‘సెపె్టంబర్ 11’మారణకాండకు స్వయంగా వ్యూహరచన చేసిన అల్‌ఖైదా అధినేత, అంతర్జాతీయ ఉగ్రవాద ఒసామా బిన్ లాడెన్ 2011 మే 2న పాకిస్తాన్ భూభాగంలోని అబోటాబాద్‌లో అమెరికా సైన్యం చేతిలో దారుణంగా హతమయ్యాడు. సముద్రంలో అతడి మృతదేహాన్ని ఖననం చేశారు. శిథిలాల దిబ్బగా మారిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ స్థలాన్ని(గ్రౌండ్ జీరో) శుభ్రపరిచే పని 2002 మే నెలలో పూర్తయింది. పెంటగాన్‌ను ఒక సంవత్సరంలోపే మరమ్మత్తు చేశారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ స్థలంలో ఒక స్మారక చిహ్నం ఏర్పాటుచేశారు. ప్రతిఏటా సెప్టెంబర్ 11న మృతులకు నివాళులర్పిస్తున్నారు. అలాగే నూతన వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను నిర్మించారు. పెంటగాన్, పెన్సిల్వేనియాలోనూ స్మారక చిహ్నాలు ఏర్పాటు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
9/11 హీరో వెల్లెస్ క్రౌథర్కు అమెరికా అత్యున్నత పురస్కారం!
సెప్టెంబర్ 11, 2001లో (9/11) అల్‌ఖైదా జరిపిన ఉగ్ర దాడిలో ప్రాణాలను పణంగా పెట్టి ఎందరినో కాపాడిన వెల్లెస్ రెమీ క్రౌథర్కు అమెరికా ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. ఆయనకు మరణానంతరం దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన 'ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్' ఇవ్వనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ఉగ్రదాడి జరిగి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.కాగా 2001, సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్ (సౌత్ టవర్) పై ఉగ్రవాదులు దాడి జరిగినప్పుడు క్రౌథర్ వయస్సు కేవలం 24 ఏళ్లు మాత్రమే. ఈ దాడి జరిగే సమయంలో క్రౌథర్ సౌత్ టవర్లోని 104వ అంతస్తులో ఈక్విటీస్ ట్రేడర్‌గా పనిచేస్తున్నాడు. మొదటి విమానం నార్త్ టవర్‌ను ఢీకొన్న తర్వాత వెల్లెస్కు అక్కడ నుంచి తప్పించుకునే అవకాశముండేంది. కానీ ఆయన మాత్రం తన ప్రాణం కన్న అక్కడ ఉన్నవారిని ఎలాగైనా రక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్రౌథర్ ముఖానికి ఎర్రటి రుమాలు కట్టుకుని మెట్ల మార్గాల గుండా ప్రజలను కిందకు దించుతూ వారిని కాపాడాడు. కానీ ఈ ప్రయత్నంలో వెల్లెస్ రెమీ క్రౌథర్ తన ప్రాణాలను కోల్పోయారు. ఆయన ఎరుపు రంగు రుమాలు 9/11 మెమోరియల్ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఆయన 'మ్యాన్ ఇన్ ది రెడ్ బందాణా'గా గుర్తింపు పొందారు. -
9/11: చేదు జ్ఞాపకాలే అయినా పదిలంగా ఉంచేందుకు..
9/11 Attacks: సెప్టెంబర్ 11, 2001.. ఈరోజు అమెరికా చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచాన్ని కొద్దిగంటలు చీకట్లోకి నెట్టేసిన రోజు. చరిత్రలోనే ఇప్పటిదాకా రికార్డు అయిన అతిపెద్ద ఉగ్రమారణహోమది. సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లోకి హైజాక్ విమానాల ద్వారా ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. ప్రత్యక్షంగా సుమారు నాలుగు వేల మంది ప్రాణాల్ని బలిగొన్నారు. ఈ దాడి తర్వాత రకరకాల గాయాలతో, జబ్బులతో చనిపోయిన వాళ్ల సంఖ్య చాలా చాలా ఎక్కువ.బాధితులకు జ్జాపకార్థంగా ట్విన్ టవర్స్ కూలిన ప్రాంతం(గ్రౌండ్ జీరో) ఒక స్మారక భవనం, మ్యూజియం ఉంటాయి. ఇక్కడ ప్రతీ ఏడాది సెప్టెంబర్ 11న ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబసభ్యులు, వారి పిల్లలు, బంధువులు నివాళులు అర్పిస్తారు. అయితే ఇలా నివాళులు అర్పించటం వారసత్వంగా కొనసాగుతోంది. ఈ ఘటన జరిగి నేటికి(బుధవారం) నాటికి 23 ఏళ్లు. స్మారక భవనం వద్ద ప్రతీ ఏడాది బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు మృతి చెందినవారి పేర్లు చదువుతూ నివాళి అర్పిస్తారు. మృతి చెందినవారి వారసులు, వారి పిల్లలు.. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన తమవారి పేర్లు చదివి స్మరించుకోవటం ఆనవాయితీగా కొనసాగుతోంది. 23 ఏళ్లు గడుస్తున్నా.. దాడుల తర్వాత బాధితుల వారసులు వాళ్ల తాత, అమ్మమ్మ, నానమ్మలు పేర్లు స్మరించుకుంటూ నివాళులు అర్పించటం పెరుగుతోంది. అయితే గతేడాది సుమారు మొత్తం 140 మంది వారసులు దాడుల్లో మృతి చెందినవారికి నివాళులు అర్పించగా.. అందులో దాడులు జరిగిన అనంతరం పుట్టిన యువతీయువకులు 28 మంది ఉన్నారు. అయితే ఈ ఏడాది కూడా ఆ యువతీయువకులు తమవారికోసం నివాళులు అర్పించడానికి ఎదురు చూస్తున్నారు. బాధితులకు సంబంధించిన వారసులు అధికంగా వారి మేనకోడళ్లు, మేనల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు ఉన్నారు. వారి వద్ద మృతి చెందినవారి కథలు, ఫొటోలు, జ్ఞాపకాలు ఉన్నాయి.9/11 దాడులకు ప్రత్యక్ష సాక్ష్యులు, బాధితులతో అనుబంధం ఉన్నవారి సంఖ్య తగ్గినా స్మరించుకోవటం తరతరాలకు కొనసాగుతుందని 13 ఏళ్ల అలన్ ఆల్డిక్కీ అంటున్నాడు. గత రెండేళ్లుగా తన తాత, అనేక మంది వ్యక్తుల పేర్లను చదివి నివాళులు అర్పించాను. ఇవాళ (బుధవారం) బాధితుల పేర్లు చదివి నివాళులు అర్పిస్తానని అన్నాడు. ట్విన్ టవర్స్ దాడుల్లో ప్రాణాలు కొల్పోయిన తన తాత అల్లన్ తారాసివిచ్ జ్ఞాపకాలను తన గదిలో భద్రపర్చుకున్నానని తెలిపాడు. దాడుల్లో మృతిచెందిన న్యూయార్క్ అగ్నిమాపక సిబ్బంది క్రిస్టోఫర్ మైఖేల్ మోజిల్లో సోదరి పమేలా యారోస్జ్, ఆమె కుమార్తె కాప్రీ.. మెజిల్లో ఫొటోను చూపిస్తూ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. బుధవారం వీరు ఆయన పేరు చదివి నివాళులు అర్పించడానికి సిద్ధం ఉన్నారు. పమేలా యారోస్జ్ తన పిల్లలకు ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు. ఈ విధంగా నాటి దాడులు, బాధితులకు సంబంధించిన జ్ఞాపకాలు రేపటి తరాలకు సజీవంగా కొనసాగనున్నాయి.సెప్టెంబర్ 11, 2001 ఉదయం మొత్తం నాలుగు విమానాల్ని అల్‌ఖైదా ఉగ్రవాదులు హైజాక్ చేశారు. మొదటి ఫ్లైట్ అమెరికన్ ఎయిర్‌లైన్స్11ను.. ఉదయం 8గం.46ని.కు మాన్‌హట్టన్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్‌ను ఢీకొట్టారు. పదిహేడు నిమిషాల తర్వాత రెండో విమానం(యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 175) వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్‌ను ఢీకొట్టింది. కేవలం గంటా నలభై రెండు నిమిషాల్లో 110 అంతస్తుల ట్విన్ టవర్స్ చూస్తుండగానే కుప్పకూలిపోయాయి. మంటలు.. దట్టమైన పొగ, ఆర్తనాదాలు, రక్షించమని కేకలు, ప్రాణభీతితో ఆకాశ హార్మ్యాల నుంచి కిందకి దూకేసిన భయానక దృశ్యాలు ఆన్కెమెరా రికార్డు అయ్యాయి. ఆ దాడులతో రెండు కిలోమీటర్ల మేర భవనాలు సైతం నాశనం అయ్యాయి. దట్టంగా దుమ్ము అలుముకుని మొత్తం ఆ ప్రాంతాన్ని పొద్దుపొద్దున్నే చీకట్లోకి నెట్టేశారు ఉగ్రదాడులు. -
మరణించాడని భావిస్తే.. మళ్లీ ప్రత్యక్షమయ్యాడు..
బీరూట్: కొద్ది నెలల క్రితమే మరణించాడని భావిస్తున్న అల్ కాయిదా చీఫ్ అయమాన్ అల్ జవహిరి తిరిగి ప్రత్యక్షమయ్యాడు. అమెరికాపై అల్‌కాయిదా దాడులు జరిపి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అల్‌కాయిదా విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన కనిపించాడు. ఈ విషయాన్ని జిహాదిస్టు వెబ్సైట్లను మానిటర్ చేసే సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ వెల్లడించింది. వీడియోలో అయమాన్ అల్ జవహిరి జెరూసలేం గురించి, జనవరిలో రష్యన్ బలగాలపై సిరియాలో జరిగిన దాడుల గురించి ప్రస్తావించాడు. అమెరికా బలగాలు అఫ్గాన్ నుంచి వెళ్లిపోవడంపైనా మాట్లాడాడు. తాలిబన్లు అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకోవడాన్ని మాత్రం ప్రస్తావిచంలేదు. దీంతో ఈ వీడియో జనవరి తర్వాత రికార్డు చేసి ఉండవచ్చని సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ అభిప్రాయపడింది. 2020 ఫిబ్రవరిలోనే అమెరికా–తాలిబన్ల మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో దాని గురించి మాట్లాడటాన్ని బట్టి వీడియో తాజాది అని చెప్పలేమని సైట్ పేర్కొంది. 2020 చివరలో ఆయన అనారోగ్యంతో మరణించి ఉంటాడని భావిస్తున్న నేపథ్యంలో ఈ వీడియో విడుదలైంది. మొత్తం 61 నిమిషాల, 37 సెకెన్ల నిడివి ఉన్న వీడియో విడుదలైందని సైట్ డైరెక్టర్ రిటా కాట్జ్ తెలిపారు. 2021 జనవరి తర్వాత ఆయన మరణించి ఉండవచ్చని అన్నారు. 2011లో ఒసామాను అమెరికా హతం చేసిన అనంతరం ఈజిప్టుకు చెందిన నేత అయమాన్ అల్ జవహిరి ఆల్కాయిదా చీఫ్‌గా మారాడు. -
ప్రమాణ స్వీకారోత్సవం రద్దు చేసిన తాలిబన్లు
కాబూల్: కొత్తగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణ స్వీకారాన్ని తాలిబన్లు రద్దు చేశారు. వనరులు, నిధుల వృ«థా నివారణకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. అమెరికాపై దాడులు జరిగిన 11 సెప్టెంబర్ నాడే అట్టహాసంగా తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించాలని తొలుత తాలిబన్లు భావించారు. ఇందుకోసం రష్యా, చైనా, ఖతార్, పాకిస్తాన్, ఇరాన్‌కు ఆహ్వానాలు కూడా పంపారు. కానీ అకస్మాత్తుగా ప్రమాణస్వీకారోత్సవ రద్దు నిర్ణయం ప్రకటించారు. ప్రమాణ స్వీకారోత్సవం లేకపోయినా ప్రభుత్వం ఏర్పడి పనిచేయడం ప్రారంభమైందని తాలిబన్ ప్రతినిధి ఇనాముల్లా సమంగని ప్రకటించారు. అయితే నిధుల వృథా నివారణ అనేది అసలు కారణం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాలిబన్ మిత్రుల ఒత్తిడి వల్లనే ఈ ఉత్సవాన్ని రద్దు చేశారని రష్యా న్యూస్ ఏజెన్సీ టాస్ తెలిపింది. 11న ప్రమాణ స్వీకారోత్సవం జరపడం అమానవీయమని, దాన్ని నిలిపివేయమని తాలిబన్లకు సలహా ఇవ్వాలని యూఎస్, నాటో దేశాలు ఖతార్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయని పేర్కొంది. దీనివల్ల అఫ్గాన్‌లో తాలిబన్ల పాలనను ప్రపంచ దేశాలు గుర్తించడం మరింత కఠినతరమవుతుందని హెచ్చరించినట్లు తెలిసింది. -
సెప్టెంబర్ 11.. మానవత్వంపై దాడి
అహ్మదాబాద్: అగ్రరాజ్యం అమెరికాలో సరిగ్గా 20 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 11న జరిగిన ఉగ్ర దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఇలాంటి దారుణ ఘటనలు, విషాదాలకు మానవీయ విలువల్లోనే శాశ్వత పరిష్కార మార్గాలను కనుగొనాలని చెప్పారు. 1893 సెప్టెంబర్ 11న షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద భారతీయ మానవ విలువల ప్రాధాన్యతను వివరించారని గుర్తుచేశారు. అమెరికాలో జరిగిన సెప్టెంబర్ 11(9/11) దాడికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ శనివారం ఒక సందేశం ఇచ్చారు. అంతేకాకుండా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సర్దార్‌ధామ్ భవన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు ఇక్కడ వసతి కల్పిస్తారు. బాలికల హాస్టల్ అయిన సర్దార్‌ధామ్ ఫేజ్–2 కన్యా ఛత్రాలయ నిర్మాణానికి మోదీ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘సెప్టెంబర్ 11.. ప్రపంచ చరిత్రలో మర్చిపోలేని రోజు. మానవత్వంపై దాడి జరిగిన రోజుగా గుర్తుండిపోతుంది. ఆ రోజు మొత్తం ప్రపంచానికి ఎన్నో పాఠాలు నేర్పించింది’’ అని అన్నారు. ఇలాంటి భీకర దాడుల నుంచి నేర్చుకున్న పాఠాలను సదా గుర్తుంచుకోవాలి్సన అవసరం ఉందని సూచించారు. మానవీయ విలువలను కాపాడుకోవడానికి కృషి చేయాలన్నారు. సుబ్రహ్మణ్య భారతికి అంకితం తమిళ భాష అధ్యయనానికి బనారస్ హిందూ యూనివర్సిటీ(బీహెచ్‌యూ)లోని ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్‌లో ప్రత్యేక పీఠాన్ని నెలకొల్పుతామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ పీఠాన్ని తమిళ కవి సుబ్రహ్మణ్య భారతికి ఆయన వర్ధంతి సందర్భంగా అంకితమిస్తున్నట్లు తెలిపారు. ఏక్ భారత్.. శ్రేష్ట భారత్ అనే భావనను సర్దార్ పటేల్ ముందుకు తెచ్చారని, మహాకవి సుబ్రహ్మణ్య భారతి సాగించిన తమిళ రచనల్లోనూ ఇదే భావన స్పష్టంగా ప్రతిఫలించిందని పేర్కొన్నారు. సమాజానికి నూతన ఆత్మవిశ్వాసం బ్రిటిష్ పాలకులను తలవంచేలా చేసిన సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ స్ఫూర్తి, శక్తి నేడు ఐక్యతా శిల్పం రూపంలో మన ముందు ఉన్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. స్ఫూర్తి, దేశ ఐక్యత, ప్రజల ఉమ్మడి ప్రయత్నానికి ఈ శిల్పం ఒక ప్రతీక అని కొనియాడారు. మన సంపద దేశం కోసం నైపుణ్యాల వృద్ధి(స్కిల్ డెవలప్మెంట్)కి అధిక ప్రాధాన్యం ఇస్తూ నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చామని మోదీ చెప్పారు. ప్రపంచ మార్కెట్లో ఉన్న డిమాండ్‌కు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మన యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడమే ఈ విధానం ఉద్దేశమని వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లక్షలాది మంది యువత కొత్త అవకాశాలను అందిపుచ్చుకున్నారని వివరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ‘సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్, సబ్కా వికాస్’కు సబ్కా ప్రయాస్‌ను జత చేద్దామని చెప్పారు. విద్యార్థుల కోసం రూ.200 కోట్లతో సర్దార్‌ధామ్ భవన్‌ను నిర్మించిన విశ్వ పాటిదార్ సమాజ్‌పై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. -
ప్రపంచాన్ని చీకట్లో ముంచెత్తిన రోజు ఇది
20 Years For 9/11 Attacks: 9/11 ఉగ్రదాడులు. సెప్టెంబర్ 11, 2001.. ఈరోజు అమెరికా చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచాన్ని కొద్దిగంటలు చీకట్లోకి నెట్టేసిన రోజు. ట్విన్ టవర్స్, పెంటగాన్‌లపై వైమానిక దాడుల తర్వాత.. కరెంట్, ఇంటర్నెట్, శాటిలైట్, రేడియో ఫ్రీక్వెన్సీ కట్టింగ్లతో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రపంచం మొత్తం భయాందోళలకు లోనైంది. ఇంతకీ దాడి టైంలో అప్పటి అధ్యక్షుడు బుష్ ఎక్కడున్నాడు? ఇప్పటి అధ్యక్షుడు బైడెన్ గురించి లాడెన్ ఆనాడు ఏం చెప్పాడు? 9/11 దాడులకు ఇరవై ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రత్యేక కథనం.. సెప్టెంబర్ 11 ఉగ్రదాడులు.. చరిత్రలోనే ఇప్పటిదాకా రికార్డు అయిన అతిపెద్ద ఉగ్రమారణహోమం. 11 ఎకరాల విస్తీర్ణంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లోకి హైజాక్ విమానాల ద్వారా ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. ప్రత్యక్షంగా సుమారు నాలుగు వేల మంది ప్రాణాల్ని బలిగొన్నారు. ఈ దాడి తర్వాత రకరకాల గాయాలతో, జబ్బులతో చనిపోయిన వాళ్ల సంఖ్య చాలా చాలా ఎక్కువ. నష్టపరిహారం కోసం ఇప్పటిదాకా 67,000 దరఖాస్తులు వచ్చాయి. వీసీఎఫ్(విక్టిమ్ కాంపంజేషన్ ఫండ్) ద్వారా 40 వేలమందికి పైగా.. దాదాపు 9 బిలియన్ల డాలర్ల నష్టపరిహారాన్ని అందజేసినట్లు నిర్వాహకురాలు రూపా భట్టాచార్య చెప్తున్నారు. ఈ లెక్కన బాధితుల సంఖ్య ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కారణాలు.. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద మారణహోమానికి అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ కారణమని చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో ఇజ్రాయెల్‌తో అమెరికా స్నేహహస్తం, సోమాలియా, మోరో అంతర్థ్యుద్దం(ఫిలిఫ్ఫైన్స్), రష్యా, లెబనాన్, కశ్మీర్(భారత్)లలో హింసాత్మక ఘటనలు, ముస్లింల అణచివేత, ఇస్లాం వ్యతిరేక కుట్రలకు అమెరికా వెన్నుదన్నుగా నిలిచిందన్నది అల్‌ఖైదా ప్రధాన ఆరోపణ. అంతేకాదు సౌదీ అరేబియా గడ్డపై యూఎస్ భద్రతా దళాల మోహరింపు, ఇరాక్‌కు వ్యతిరేకంగా ఆంక్షల విధింపు.. తదితర కారణాలు అమెరికాపై ఉగ్రవాద దాడులకు అల్‌ఖైదాను ఉసిగొల్పాయనేది వాదన. నాలుగోది ఫ్లాప్.. పక్కా ప్రణాళిక.. విమానం నడపడంలో శిక్షణ పొందిన 19 మంది ఉగ్రవాదులు. ఐదుగురు మూడు గ్రూపులుగా, నలుగురు ఒక గ్రూప్‌గా విడిపోయారు. సెప్టెంబర్ 11, 2001 ఉదయం మొత్తం నాలుగు విమానాల్ని హైజాక్ చేశారు. మొదటి ఫ్లైట్ అమెరికన్ ఎయిర్‌లైన్స్11ను.. ఉదయం 8గం.46ని.కు మాన్‌హట్టన్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్‌ను ఢీకొట్టారు. పదిహేడు నిమిషాల తర్వాత రెండో విమానం(యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 175) వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్‌ను ఢీకొట్టింది. కేవలం గంటా నలభై రెండు నిమిషాల్లో 110 అంతస్తుల ట్విన్ టవర్స్ చూస్తుండగానే కుప్పకూలిపోయాయి. మంటలు.. దట్టమైన పొగ, ఆర్తనాదాలు, రక్షించమని కేకలు, ప్రాణభీతితో ఆకాశ హార్మ్యాల నుంచి కిందకి దూకేసిన భయానక దృశ్యాలు ఆన్కెమెరా రికార్డు అయ్యాయి. ఆ దాడులతో రెండు కిలోమీటర్ల మేర భవనాలు సైతం నాశనం అయ్యాయి. దట్టంగా దుమ్ము అలుముకుని మొత్తం ఆ ప్రాంతాన్ని పొద్దుపొద్దున్నే చీకట్లోకి నెట్టేశాయి ఉగ్రదాడులు. 9/11.. పెంటగాన్ దాడి దృశ్యం ఇక మూడో దాడి.. డల్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన విమానాన్ని ఓహియో వద్ద హైజాక్ చేశారు. వర్జీనియా అర్లింగ్టన్ కౌంటీలోని పెంటగాన్ పడమర భాగాన్ని ఉదయం 9గం.37ని. నిమిషాలకు ఢీకొట్టారు. నాలుగో విమానం.. ఉ.10.03ని. సమయంలో పెన్సిల్వేనియా షాంక్స్విల్లే దగ్గర మైదానాల్లో క్రాష్ ల్యాండ్ అయ్యింది. బహుశా ఇది వైట్ హౌజ్ లేదంటే యూఎస్ పార్లమెంట్ భవనం లక్క్ష్యంగా దూసుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మొత్తానికి భద్రతా దళాలు, రక్షణ దళాలు అప్రమత్తం అయ్యేలోపే ఊహించని ఘోరం జరిగిపోయింది. బుష్ చెవిలో ఊదింది ఆయనే సెప్టెంబర్ 11, 2001.. మంగళవారం ఉదయం. ఆనాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్.. ఉదయాన్నే చాలా నీరసంగా ఉన్నారు. అయినప్పటికీ కరోలీ బూకర్ ఎలిమెంటరీ స్కూల్లో ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. పిల్లలతో ఇంటెరాక్ట్ అయిన టైంలో బుష్ చెవిలో ఏదో గొణిగాడు ఆండ్రూ కార్డ్. ఈయన వైట్‌హౌజ్‌లో చీఫ్ స్టాఫ్‌గా పని చేశాడు అప్పుడు. అయితే వాళ్లకు దాడి గురించి ప్రాథమిక సమాచారం తప్పుగా అందింది. ఓ చిన్న విమానం.. అదీ పైలెట్‌కు గుండెపోటు వల్ల జరిగిందన్న సమాచారంతో పొరబడి ఆ దుర్ఘటనలపై విచారం వ్యక్తం చేశారు వాళ్లు. కాసేపటికే అదొక కమర్షియల్ జెట్‌లైనర్ విమానమని, భారీ ఉగ్రదాడి అనే క్లారిటీ వచ్చింది. సెకండ్ గ్రేడ్ క్లాస్ రూంలో వైట్ హౌజ్ స్టాఫ్, యూఎస్ నేవీ కెప్టెన్ అంతా అధ్యక్షుడు బుష్‌తో భేటీ అయ్యారు. ఆటైంలోనే యూబీఎల్ అనే పేరును ప్రెసిడెంట్ బుష్ వద్ద ప్రస్తావించాడు కార్డ్. యూబీఎల్.. అంటే వుసామా బిన్ లాడెన్. ఈ దాడులకు సరిగ్గా నెల రోజుల క్రితం అమెరికాపై దాడులకు పాల్పడతామని లాడెన్ బెదిరించినట్లు సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీ వైట్ హౌజ్‌కు నివేదిక సమర్పించిన విషయాన్ని కార్డ్ గుర్తు చేశాడు. కాసేపటికే పెంటగాన్ దాడి వార్త అందాక బుష్‌ను వైట్‌హౌజ్‌కు కాకుండా.. రహస్య ప్రాంతానికి తరలించి తర్వాతి ప్రణాళిక మీద చర్చలు జరిపారు. అఫ్గన్ ద్వారా వేట సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో చాలా మార్పులొచ్చాయి. ఆసియన్ దేశాల విషయంలో పాశ్చాత్య దేశాల ధోరణి పూర్తిగా మారిపోయింది. ట్రావెల్ బ్యాన్-ఆంక్షలు, మతవిద్వేష దాడులు పేట్రేగిపోయాయి. ఇక అల్‌ఖైదా మీద ప్రతీకారంతో అప్గన్ ఆక్రమణ చేపట్టిన అమెరికా సైన్యం.. ఒసామా బిన్‌లాడెన్ కోసం వేట మొదలుపెట్టింది. అయితే తొలుత ట్విన్ టవర్స్ దాడులతో తనకేం సంబంధం లేదని ప్రకటించుకున్న లాడెన్.. ఆ తర్వాత మూలకారకుడు తానే అని ఒప్పుకున్నట్లు వీడియో ఆధారాలు వెలుగు చూశాయి. దాడి జరిగిన పదేళ్ల తర్వాత 2011, మే 1న అబ్బోట్టాబాద్ (పాక్) దగ్గర అమెరికా సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్’లో లాడెన్ హతం అయినట్లు అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. బైడెన్ గురించి లాడెన్ లేఖ! తాజా అఫ్గన్ పరిణామాలు దాదాపు అందరికీ తెలిసినవే. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోగా.. తిరిగి తాలిబన్లు ఆక్రమణకు పాల్పడ్డారు. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే తాలిబన్లు బిన్ లాడెన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 9/11 దాడుల్లో లాడెన్ ప్రమేయం లేదని, లాడెన్‌కు వ్యతిరేకంగా అమెరికా దొంగ సాక్క్క్ష్యాలు సృష్టించిందని, ఆధిపత్య ధోరణితో అఫ్గన్‌లో అమెరికా సైన్యం మోహరించిందంటూ వరుస ప్రకటనలు విడుదల చేశారు. ఇక అల్‌ఖైదా నేత బిన్ లాడెన్.. 2010లో రాసిన ఓ లేఖ తాలిబన్ పరిణామాల తర్వాత తెర మీదకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడి పోటీలో జో బైడెన్ పేరు తెర మీదకు రావడాన్ని ఒసాబా బిన్ లాడెన్ స్వాగతించాడని 48 పేజీల లేఖ ఒకటి విడుదల అయ్యింది. ‘బైడెన్ అధ్యక్ష పదవికి ముందస్తుగా సిద్ధంగా లేడు. అతను గనుక అధ్యక్షుడు అయితే.. అమెరికా దానంతట అదే సంక్షోభంలోకి కూరుకుపోతుంది. బైడెన్ అసమర్థన పాలన అమెరికాను నాశనం చేస్తుంద’ని ఆ లేఖలో లాడెన్ పేరిట రాసి ఉంది. అమెరికా 9/11 ఉగ్రదాడులకు 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. - సాక్షి, వెబ్‌డెస్క్ -
లిటిల్ మిరాకిల్.. సంచలనం రోజునే
ఈ మధ్యకాలంలో తమ పిల్లలు పుట్టే తేదీలు వినూత్నంగా, క్రేజీగా ఉండాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. దాని కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే దైవ సంకల్పమో లేక యాదృచ్ఛికమో తెలియదు గాని అమెరికాలో ఓ పాప క్రేజీ తేదీన జన్మించింది. అమెరికాకు చెందిన కామెట్రియోన్ మూర్ బ్రౌన్ ఈ నెల 11న(సెప్టెంబర్ 11) పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ప్రసవించిన సమయం కూడా రాత్రి 9.11 గంటలకు. అంతేకాదు ఆ చిన్నారి బరువు కూడా 9 పౌండ్ల 11 ఔన్సులు. డాక్టర్ ఈ అంకెలు చెప్పగానే ఆ చిన్నారి తల్లిదండ్రులు తొలుత ఆశ్చర్యపోయారు. అనంతరం చరిత్రలో మర్చిపోలేని రోజున తమ పాప జన్మించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 11 ఈ పేరు వినగానే అమెరికన్లు కలలో కూడా ఉలిక్కిపడతారు. ప్రపంచం మొత్తం గజగజా వణికిపోతారు. అమెరికా చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే పెను విషాదం అదే రోజున చోటు చేసుకుంది. అమెరికా ఆర్థిక శక్తికి సూచికగా చెప్పుకునే వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రదాడి జరిగింది సెప్టెంబర్ 11నే. అందుకే 9/11ను అమెరికన్లు మర్చిపోలేరు. సరిగ్గా ఆ సంఘటన జరిగి 18 ఏళ్లు పూర్తయిన రోజునే క్రిస్టినా బ్రౌన్ జన్మించింది. దీనిపై ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘లిటిల్ మిరాకిల్’ అంటూ తెగ సంబరపడిపోతున్నారు. -
9/11 ఉగ్రదాడి ; కుండబద్దలుకొట్టిన సౌదీ
న్యూయార్క్ : అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేసి, అటుపై అనేక యుద్ధాలకు కారణమైన ‘సెప్టెంబర్ 11 ఉగ్రదాడి’కి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్‌కాయిదా ఉగ్రవాదులు జరిపిన దాడులతో తనకేమాత్రమూ సంబంధంలేదని సౌదీ అరేబియా తేల్చిచెప్పింది. 2001నాటి దాడుల్లో భాగం పంచుకున్న ఉగ్రవాదులకు నిధులు అందజేసినట్లు వచ్చిన ఆరోపణల్లో ఇసుమంతైనా నిజం లేదని పేర్కొంది. మాన్‌హట్టన్ కోర్టులో గురువారం జరిగిన విచారణలో సౌదీ తరఫు న్యాయవాది మిచెల్ కెల్లాగ్ ఈ మేరకు వాదనలు వినిపించారు. మూలాలు సౌదీలోనే! : అల్‌కాయిదాకు సౌదీ అరేబియానుంచి పెద్ద మొత్తంలో నిధులు వెళ్లాయని, ఆ నిధులతోనే ఉగ్రవాదులు సెప్టెంబర్ 11 దాడులకు పాల్పడ్డారని.. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ, సీఐఏ, 9/11కమిషన్, 9/11 రివ్యూ కమిషన్లు పలు రిపోర్టుల్లో పేర్కొన్నాయి. దాడుల్లో పాల్గొన్న 19 మంది ఉగ్రవాదుల్లో అత్యధికులు సౌదీ జాతీయులేనన్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదులకు నిధులందించే వారిని కూడా నిందితులుగా పేర్కొనవచ్చంటూ నాటి రిపబ్లికన్ ప్రభుత్వం ‘జస్టా’ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ 9/11 సంబంధిత కేసుల్లో సౌదీని కూడా నిందితురాలిగా పేర్కొంటూ పలువురు బాధితులు కోర్టుల్లో దావాలు వేశారు. అది తప్పు.. ఒక్క ఆధారమూ లేదు: అమెరికా అధికారుల రిపోర్టుల్లోనూ సౌదీని నిందితురాలిగా పేర్కొనే ఏ ఒక్క ఆధారమూ లేదని న్యాయవాది మిచెల్కెల్లాంగ్ వాదించారు. ‘‘ఏవో కొన్ని ఊహాగానాలు, ముక్తాయింపుల ఆధారంగా నిందలు వేయడం సరికాదు. 9/11 దాడుల్లో సౌదీ పాత్ర ఉందనడానికి ఎలాంటి ఆధారాలులేవు’’ అని పేర్కొన్నారు. దాడుల అనంతరం రిపబ్లిక్ ప్రభుత్వం చేసిన ‘జస్టా’ చట్టాన్ని 2016లో ఒబామా వీటో చేసిన సంగతి తెలిసిందే. సౌదీ తాజా వాదనలపై బాధితులు, అమెరికా ప్రభుత్వం స్పందించాల్సిఉంది. -
సిక్కు వ్యక్తికి ఎట్టకేలకు అమెరికాలో న్యాయం
న్యూయార్క్ : ఉగ్రవాది అంటూ దూషణలతో పాటు దాడులకు గురయిన భారతీయ సంతతికి చెందిన ఓ సిక్కు వ్యక్తికి ఎట్టకేలకు న్యాయం జరిగింది. గతేడాది సిక్కు జాతీయుడిని దూషించి అతడిపై ముష్టియుద్ధానికి దిగిన కేసులో ఓ వ్యక్తికి రెండేళ్ల శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు ఇచ్చింది. 9/11 దాడుల నేపథ్యంలో సెప్టెంబర్ 8న ఓ భారతీయుడిపై అమెరికన్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. 'టెర్రరిస్టు', 'బిన్ లాడెన్' అంటూ కొందరు దాడికి పాల్పడ్డారని బాధితుడు ఇందర్జిత్ సింగ్ ముక్కర్ చికాగో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ కేసు ప్రస్తుతం విచారణకు రాగా నిందితుడికి శిక్ష పడిందని చికాగో పోలీసులు తెలిపారు. నిందితుడి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. అతడు ఇంకా టీనేజీలోనే ఉన్నందున జువెనైల్ హోమ్ కు తరలించినట్లు వివరించారు. సిక్కు కమ్యూనిటీకి 200 గంటల పాటు సేవ చేయడంతో పాటు దాదాపు రూ.3.24 లక్షలు ఫైన్ విధించారు. ఇందర్జీత్కు అమెరికా పౌరసత్వం ఉంది. ఆయనకు ఇద్దరు సంతానం. గ్రాసరి స్టోర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. 'టెర్రరిస్ట్ గో బ్యాక్ టు యువర్ కంట్రీ, బిన్ లాడెన్' అంటూ నినాదాలు చేస్తూ ముక్కర్పై దాడికి పాల్పడి అతడికి ఊపిరాడకుండా చేశారని సిక్కు సంస్థ ఆరోపించింది. ఓ వ్యక్తి తన మొహంపై పదేపదే పంచ్‌లు విసిరాడని దీంతో కొద్దిసేపు తనకు ఊపిరాడలేదని, స్పృహకోల్పోయినట్లు బాధితుడు ముక్కర్ చెబుతున్నాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స చేసి ఆరు కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఇందర్ జిత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. -
బిన్ లాడెన్ అంటూ భారతీయుడిపై అమెరికాలో దాడి
న్యూయార్క్ : భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తిపై ఉగ్రవాది అంటూ అగ్రదేశం అమెరికాలో దాడి జరిగింది. 'టెర్రరిస్టు', 'బిన్ లాడెన్' అంటూ దాడికి పాల్పడ్డారని ఇందర్జిత్ సింగ్ ముక్కెర్ అనే వ్యక్తి చికాగో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సెప్టెంబర్ 11 దాడుల నేపథ్యంలో ఓ భారతీయుడిపై అమెరికన్ దాడికి పాల్పడటం గమనార్హం. ప్రస్తుతం తమ అదుపులోనే నిందితుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందర్జీత్కు అమెరికా పౌరసత్వం ఉంది. ఆయనకు ఇద్దరు సంతానం. గ్రాసరి స్టోర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే మంగళవారం నాడు అక్కడి జాత్యహంకారవాదులు 'టెర్రరిస్ట్ గో బ్యాక్ టు యువర్ కంట్రీ, బిన్ లాడెన్' అంటూ నినాదాలు చేస్తూ ముక్కర్పై దాడికి పాల్పడ్డారని స్థానిక సిక్కు మతానికి చెందిన ఓ సంస్థ పేర్కొంది. ఓ వ్యక్తి తన మొహంపై పదేపదే పంచ్‌లు విసిరాడని దీంతో కొద్దిసేపు తనకు ఊపిరాడలేదని, స్పృహకోల్పోయినట్లు బాధితుడు ముక్కర్ చెబుతున్నాడు. తీవ్రంగా రక్తస్రావం అవుతున్న అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స చేసి ఆరు కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. దవడ భాగంలో ఓ ఎముక ఫ్రాక్చర్ అయినట్లు కూడా సమాచారం. ' ఈ ఘటనపై స్పందించిన అధికారులకు కృతజ్ఞతలు', సహించరాని నేరంగా దాడిని పరిగణించి దర్యాప్తు చేయాలని వారిని కోరుతున్నట్లు ముక్కర్ పేర్కొన్నాడు. సిక్కు మత వేషధారణలో ఉండటం వల్ల, అతడి జాతీయత కనిపించడంతోనే ఈ దాడి జరిగిందని సిక్కు మత లీగల్ డైరెక్టర్ హర్ సిమ్రన్ కౌర్ అన్నారు. గత ఆగస్టులో సందీప్ సింగ్ అనే వ్యక్తిని 'టెర్రరిస్టు' అంటూ న్యూయార్క్ సిటీలో దాడి చేసిన విషయం విదితమే. 2012లలోనూ ఓ సిక్కు వ్యక్తి ఇంట్లోకి చోరబడ్డ ఆగంతకుడు కాల్పులు జరిపి ఆరుగురిని పొట్టనపెట్టుకున్న ఘటన అప్పట్లో అమెరికాలో సంచలనం సృష్టించింది.


