సెప్టెంబర్ 11, 2001లో (9/11) అల్‌ఖైదా జరిపిన ఉగ్ర దాడిలో ప్రాణాలను పణంగా పెట్టి ఎందరినో కాపాడిన వెల్లెస్ రెమీ క్రౌథర్‌కు అమెరికా ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. ఆయనకు మరణానంతరం దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన 'ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్' ఇవ్వనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ఉగ్రదాడి జరిగి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా 2001, సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్ (సౌత్ టవర్) పై ఉగ్రవాదులు దాడి జరిగినప్పుడు క్రౌథర్ వయస్సు కేవలం 24 ఏళ్లు మాత్రమే. ఈ దాడి జరిగే సమయంలో క్రౌథర్ సౌత్ టవర్‌లోని 104వ అంతస్తులో ఈక్విటీస్ ట్రేడర్‌గా పనిచేస్తున్నాడు.
మొదటి విమానం నార్త్ టవర్‌ను ఢీకొన్న తర్వాత వెల్లెస్‌కు అక్కడ నుంచి తప్పించుకునే అవకాశముండేంది. కానీ ఆయన మాత్రం తన ప్రాణం కన్న అక్కడ ఉన్నవారిని ఎలాగైనా రక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
క్రౌథర్ ముఖానికి ఎర్రటి రుమాలు కట్టుకుని మెట్ల మార్గాల గుండా ప్రజలను కిందకు దించుతూ వారిని కాపాడాడు. కానీ ఈ ప్రయత్నంలో వెల్లెస్ రెమీ క్రౌథర్ తన ప్రాణాలను కోల్పోయారు. ఆయన ఎరుపు రంగు రుమాలు 9/11 మెమోరియల్ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఆయన 'మ్యాన్ ఇన్ ది రెడ్ బందాణా'గా గుర్తింపు పొందారు.


