లాడెన్ హిట్‌లిస్ట్‌లో భారత్.. బయటపడ్డ సంచలన రహస్యాలు | Before 9/11 India Was On Osama Bin Laden Hit List; Deets Inside | Sakshi
Sakshi News home page

లాడెన్ హిట్‌లిస్ట్‌లో భారత్.. బయటపడ్డ సంచలన రహస్యాలు

Sep 13 2026 8:44 AM | Updated on Sep 13 2026 8:49 AM

Before 9/11 India Was On Osama Bin Laden Hit List; Deets Inside

అమెరికా సెప్టెంబర్‌ 11 దాడులకు పాతికేళ్లు పూర్తయిన వేళ.. అమెరికా గూఢచార సంస్థ (CIA) సంచలన విషయాలు బయటపెట్టింది. అల్ ఖైదా వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్.. భారత్‌పై కూడా దాడులకు ప్లాన్ చేసినట్లు షాకింగ్‌ విషయం వెలుగులోకి తెచ్చింది. 1998లోనే ఈ కుట్రకు పథకం రచించినట్లు సీఐఏ తాజాగా విడుదల చేసిన రహస్య పత్రాల ద్వారా బయటపడింది. బిన్ లాడెన్‌కు సంబంధించిన 70కి పైగా ప్రెసిడెన్షియల్ ఇంటెలిజెన్స్ బ్రీఫ్‌లను, 100 పేజీలకు పైగా సమాచారాన్ని సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ బహిర్గతం చేశారు.

ఒసామా బిన్ లాడెన్ దాడులు జరపాలనుకుంటున్న దేశాల జాబితాలో భారత్‌తో పాటు పాకిస్థాన్, ఈజిప్ట్, అరేబియన్ ద్వీపకల్పంలోని దేశాలు, ఉగాండా, నైజీరియా ఉన్నాయి. అయితే, ఆ పత్రాల్లో భారత్‌లో ఎక్కడ? ఎప్పుడు? దాడి చేయాలనుకున్నారో వంటి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు. "బిన్ లాడెన్ టెర్రరిస్ట్ నెట్‌వర్క్ స్టిల్ ఏ థ్రెట్" అనే పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక.. అమెరికా దాడుల తర్వాత కూడా లాడెన్ నెట్‌వర్క్ చెదిరిపోలేదని పేర్కొంది.

కాగా, ఉగ్రవాదుల ఉన్మాదానికి 2,977 మంది బలైపోయిన సెప్టెంబర్‌ 11(9/11) దాడులకు 25 ఏళ్లు పూర్తయ్యాయి. అగ్రరాజ్యం అమెరికానే సవాలు చేస్తూ ముష్కరులు సాగించిన మారణహోమాన్ని ప్రపంచం ఇప్పటికీ మర్చిపోలేదు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా 2001 సెప్టెంబర్‌ 11న అమెరికాపై విరుచుకుపడింది. ఆత్మాహుతి దాడులకు పాల్పడింది. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రవాద దాడికి నిలిచిపోయింది. అల్‌ఖైదా శిక్షణలో రాటుతేలిన 19 మంది ఉగ్రవాదులు నాలుగు విమానాలను హైజాక్‌ చేసి పలు లక్ష్యాలను ఢీకొట్టారు.

ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్, వాషింగ్టన్‌ డీసీలపై జరిగిన దాడులు భారీ ప్రాణనష్టాన్ని, పెను విధ్వంసాన్ని సృష్టించాయి. న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై జరిగిన దాడిలో దాదాపు 2,750 మంది, పెంటగాన్‌ వద్ద 184 మంది, పెన్సిల్వేనియాలో 40 మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ అఘాయిత్యానికి తెగించిన మొత్తం 19 మంది ఉగ్రవాదులు సైతం మృత్యువాత పడ్డారు. మంటల్లో చిక్కుకున్న బాధితులను రక్షించే ప్రయత్నంలో 400 మందికి పైగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మరణించడం గమనార్హం. 9/11 దాడుల వల్ల అమెరికాకు 10 బిలియన్‌ డాలర్లుకుపైగా నష్టం వాటిల్లింది.

ఇదీ చదవండి: ఘోర కలికి పాతికేళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement