కొచ్చి: కొందరు ఉద్యోగులతో కలిసి తాను డ్యాన్స్ చేస్తున్నట్లుగా కృత్రిమ మేధ(ఏఐ)తో రూపొందించిన ఓ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుండటంపై కేరళం సీఎం వీడీ సతీశన్ విస్మయం వ్యక్తం చేశారు. ఆ వీడియో చూసి షాకైనట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం, తరచూ కరెంటు కోతల నేపథ్యంలో విద్యుత్ శాఖ ఉద్యోగులతో కలిసి సతీశన్ డ్యాన్స్ చేస్తున్నట్లుగా వచ్చిన వీడియో వైరల్‌గా మారింది.
శుక్రవారం రాత్రి ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సతీశన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే, ఈ అంశాన్ని ఆయన సీరియస్‌గా తీసుకోలేదు. మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్, తన స్నేహితుడు, తమిళనాడు సీఎం విజయ్ కంటే చాలా బాగానే డ్యాన్స్ చేసినట్లుగా అందులో కనిపించిందన్నారు. ఆ ఇద్దరు డ్యాన్సర్ల కంటే తానే బాగా డ్యాన్స్ చేశానంటూ నవ్వేశారు. అయితే, ఇలాంటి వీడియోలను ఏఐతో సృష్టించడంతో చూసి షాకయ్యానన్నారు. ఇటువంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు కాపీరైట్ పరిరక్షణ చట్టాల్ని కఠినతరం చేయాల్సిన అవసరముందని సతీశన్ అన్నారు.


