న్యూఢిల్లీ: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తోపాటు భారత్ మండపానికి విచ్చేసిన ఆయన కుమార్తె జహ్రా శనివారం ఢిల్లీలోని ‘ప్రధానమంత్రి మ్యూజియం’, బ్రిక్స్ బజార్‌లను సందర్శించారు. ప్రధానిమ్యూజియంలో ప్రజాస్వామ్య ఘనచరితను, భారతదేశ సాంస్కృతిక వారసత్వం తాలూకు విశేషాలను ఆమె తెల్సుకున్నారు. శిఖరాగ్ర సదస్సు జరిగే మండపానికి సమీపంలోని నేషనల్ క్రాఫ్స్ మ్యూజియంను సైతం ఆమె సందర్శించారు.
అక్కడి బ్రిక్స్ బజార్‌లో ఆమె కలియతిరిగారు. చేతి వృత్తి కళాకారులు, సంప్రదాయక వస్తువుల విశేషాలను అడిగి తెల్సుకున్నారు. జహ్రా పెజెష్కియాన్ బ్రిక్స్ బజార్‌ను ఎంతో ఆసక్తిగా చూశారని ఆమెకు అక్కడ స్వాగతం పలికిన కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి చెప్పారు. బ్రిక్స్ బజార్‌లో బ్రెజిల్ మృణ్మయ పాత్రలు మొదలు బెలారస్‌లో విల్లో చెట్ల కొమ్మలతో అల్లిన కళాకృతులదాకా బ్రిక్స్ దేశాలకు చెందిన సంపద్రాయక వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. తీన్ మూర్తి భవన్ కాంప్లెక్స్‌లోని మ్యూజియంను ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ జూనియర్ సతీమణి లీజా అరానేటా కూడా సందర్శించారు.


