పశ్చిమాసియాలో శాంతికోసం బ్రిక్స్ దేశాలు శ్రమించాలి
సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపు
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న దేశాల నూతన అంతర్జాతీయ విపణుల మధ్య సహకారానికి అత్యంత ప్రభావవంతమైన వేదికగా బ్రిక్స్ కూటమి ఎదిగిందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీలో శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ఆయన ఈ కూటమి దేశాల అగ్రనేతలనుద్దేశించి కీలక ప్రసంగంచేశారు. ‘‘పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతల స్థాపనకు బ్రిక్స్ దేశాలు ద్విపాత్రాభినయం చేయాల్సిందే.
ఎందుకంటే పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లోని యుద్ధాలు, మారుతున్న విపరిణామాలతో ఆయా ప్రాంతాల ప్రజలు కష్టాల కడలిలో పడిపోయారు. అంతర్జాతీయ సమాజం ఉమ్మడి ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కల్గుతోంది. ఇకనైనా పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం అభివృద్ధి చెందుతున్న దేశాల అగ్రనేతలు ఉమ్మడిగా పోరాడాలి. చరిత్ర గుర్తుంచుకునేలా సరైన పథంలో నడిచి ఈ ప్రాంతాల పురోభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలి’’అని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. చైనా సైతం పశ్చిమాసియా, గల్ఫ్‌లో శాంతి,సుస్థిరత కోసం ఈ కూటమితో కలిసి సమష్టిగా కృషిచేస్తుందని స్పష్టంచేశారు.
ఆ మనస్తత్వం మానండి..
‘‘ఇకనైనా బ్రిక్స్ దేశాలు ప్రచ్ఛన్న యుద్ధకాలంనాటి మనస్తత్వాన్ని వీడాలి. సభ్య దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడం మానుకోవాలి. ఆయా దేశాల సార్వ¿ౌమత్వాలకు భంగం వాటిల్లేలా వ్యవహరించడం వంటి పనులకు చరమగీతం పాడాలి. శత్రుత్వాలకు త్యజించాలి. ఇందుకోసం పరస్పర అవగాహన, విశ్వాసం పెంచుకోవడంపై కూటమి దేశాలు దృష్టిపెట్టాలి.
బ్రిక్స్ దేశాలు స్వావలంబన సాధిస్తూనే, దేశీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే సరికొత్త అభిృవృద్ధిబాటల్లో పయనించడం శుభసూచకం. అగ్రదేశాల ఆధిపత్య విధానాలు, కేంద్రీకృత రాజకీయాల విపరిణామాల దుష్పఫలితాలను మనందరం చవిచూస్తున్నాం. దీంతో శాంతి, అభివృద్ధి, భద్రత, సుపరిపాలన అనేవి కష్టమవుతున్నాయి. వీటికి పరిష్కారాలు వెతుకుదాం. కోవిడ్ సంక్షోభాన్ని సమష్టిగా ఎదుర్కొన్నట్లు ఇకమీదటా వాతావరణ మార్పులు, ఆర్థిక సంక్షోభం వంటి అంతర్జాతీయ సమస్యలను ఉమ్మడిగా పరిష్కరించుకుందాం’’అని జిన్‌పింగ్ అన్నారు.


