విభేదాలు వివాదాలుగా మారొద్దు  | Narendra Modi and Xi seek to reset India-China ties on BRICS sidelines | Sakshi
Sakshi News home page

విభేదాలు వివాదాలుగా మారొద్దు 

Sep 13 2026 5:21 AM | Updated on Sep 13 2026 5:21 AM

Narendra Modi and Xi seek to reset India-China ties on BRICS sidelines

మండపం ప్రాంగణంలో మొక్కలు నాటుతున్న పుతిన్, మోదీ, జిన్‌పింగ్‌ 

ప్రధాని మోదీ, చైనా అధినేత జిన్‌పింగ్‌ ఉద్ఘాటన  

బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా సమావేశమైన ఇరువురు నేతలు  

సరిహద్దు సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడి  

‘శాంతి’తోనే సంబంధాలు బలోపేతం అవుతాయన్న మోదీ  

న్యూఢిల్లీ:  భారత్‌–చైనా సంబంధాలు మరింత బలోపేతం కావాలంటే ఇరుదేశాల సరిహద్దు వద్ద శాంతియుత వాతావరణం నెలకొనడం అత్యవసరమని భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు స్పష్టం చేశారు. సరిహద్దు నిర్వహణకు సంబంధించిన ప్రస్తుత ఒప్పందాలను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మోదీ, జిన్‌పింగ్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

 ప్రధానంగా భారత్, చైనా సంబంధాలపై చర్చించారు. వాణిజ్య లోటును తగ్గించడం, ఉగ్రవాదం వంటి సవాళ్లను ఎదుర్కోవడం, బహుపాక్షిక వేదికలపై న్యాయమైన, పారదర్శక వాణిజ్యం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. విభేదాలు వివాదాలుగా మారకూడదని ఇరువురు నేతలు పునరుద్ఘాటించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని వారు పేర్కొన్నట్లు వెల్లడించింది.  

పరస్పర గౌరవం, సున్నితత్వం, ప్రయోజనం  
వాణిజ్య అసమతుల్యత, సప్లై చైన్లు, మార్కెట్‌ ప్రవేశాన్ని సులభతరం చేయడం వంటి అంశాల్లో సమస్యలను పరిష్కరించుకోవాలని మోదీ, జిన్‌పింగ్‌ నిర్ణయానికి వచ్చారు. సమగ్ర ద్వైపాక్షిక సంబంధాలు, ఇరుపక్షాల దీర్ఘకాలిక ప్రయోజనాల ఆధారంగా సరిహద్దు సమస్యకు న్యాయబద్ధమైన, సహేతుకమైన, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. పరస్పర సంబంధాల విషయంలో భారత్, చైనాలు పరస్పర గౌరవం, సున్నితత్వం, ప్రయోజనం అనే మూడు అంశాల ఆధారంగా ముందుకు సాగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు జిన్‌పింగ్‌ శనివారం ఢిల్లీకి చేరుకున్న కొద్ది గంటల తర్వాత ఈ సమావేశం జరిగింది. జిన్‌పింగ్‌ భారత్‌లో పర్యటిస్తుండడం ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి.  

ఉమ్మడి కార్యాచరణ మరింత విస్తృతం  
గత ఏడాది ఆగస్టులో టియాంజిన్‌లో జరిగిన తమ చివరి సమావేశం తర్వాత భారత్‌–చైనా సంబంధాల్లో సాధిస్తున్న స్థిరమైన పురోగతిని మోదీ, జిన్‌పింగ్‌ స్వాగతించారని భారత విదేశాంగ శాఖ తెలియజేసింది. రెండు దేశాలు తమ సంబంధాల పట్ల వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథాన్ని కలిగి ఉండాలని వారు పునరుద్ఘాటించినట్లు వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాల నిరంతర అభివృద్ధికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులే ప్రాతిపదికగా నిలుస్తాయని ప్రధాని మోదీ తేల్చిచెప్పారని ఉద్ఘాటించింది. 

సరిహద్దు సంబంధిత అంశాలపై ప్రస్తుతం అమల్లో ఒప్పందాలు, అవగాహనలను ఇరుపక్షాలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారని పేర్కొంది. ప్రజల మధ్య సంబంధాల్లో సాధించిన పురోగతిని ఇద్దరు నేతలు గుర్తించారని, రెండు దేశాల మధ్య సాంస్కృతిక మారి్పడి, వాణిజ్య సంబంధాలు, రాకపోకలను మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందని నిర్ణయానికి వచ్చారని తెలిపింది. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలతోపాటు వివిధ సవాళ్లను ఎదుర్కోవడంలో ఉమ్మడి కార్యాచరణను మరింత విస్తృతం చేయాలని మోదీ, జిన్‌పింగ్‌ నిర్ణయించినట్లు సమాచారం. భారత్‌ చేపట్టిన బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలకు చైనా అందించిన మద్దతును, కూటమి శిఖరాగ్ర సమావేశం విజయవంతం కావడంలో చైనా చేసిన కృషిని ప్రధాని మోదీ అభినందించారు.

భారత్, చైనాలపై పెద్ద బాధ్యత: జిన్‌పింగ్‌  
భారత్‌–చైనా సంబంధాల అభివృద్ధిని బీజింగ్‌ ఎల్లప్పుడూ వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతోనే చూస్తోందని జిన్‌పింగ్‌ స్పష్టంచేశారు. మన రెండు దేశాల పరిస్థితులు వేర్వేరుగా ఉన్నప్పటికీ మనం ఒకరికొకరు అండగా నిలుస్తూ ఉమ్మడి అభివృద్ధి మార్గంలో పయనించవచ్చని అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలుగా, గ్లోబల్‌ సౌత్‌లో కీలక సభ్యులుగా భారత్, చైనాలు పెద్ద బాధ్యతలను కలిగి ఉన్నాయని వివరించారు. ఇరుపక్షాలు మానవాళి భవిష్యత్తును, తమ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. సహకారాన్ని పెంపొందించుకోవడానికి, సమ్మిళిత ఆర్థిక భవిష్యత్తు దిశగా మనం కలిసి పనిచేయాలని జిన్‌పింగ్‌ భారత్‌కు పిలుపునిచ్చారు.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement