డీపీఆర్, మాస్టర్ ప్లాన్ రూపకల్పన ప్రక్రియ వేగవంతం
వారం రోజుల్లో ముగ్గురు నోడల్ అధికారుల నియామకం
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆధ్వర్యంలో సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: రక్షణ, వాణిజ్యపరంగా అత్యంత వ్యూహాత్మకమైన ఆదిలాబాద్ విమానాశ్రయ ప్రాజెక్టు పనులను వేగంగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పురోగతిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో శనివారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ భేటీలో పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.
ప్రాజెక్టు అమలును పకడ్బందీగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు రక్షణ శాఖ, పౌరవిమానయాన శాఖ, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్కో నోడల్ అధికారిని వచ్చే వారంలోగా నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే ప్రాజెక్టు డీపీఆర్, మాస్టర్ ప్లాన్ రూపకల్పన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తీర్మానించారు. ఉత్తర తెలంగాణలో పౌర విమానయాన మౌలిక వసతుల కల్పనతోపాటు ప్రాంతీయ వైమానిక అనుసంధాన మెరుగుదలకు ఈ ప్రాజెక్టు బాటలు వేస్తుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
రక్షణ శాఖ సంపూర్ణ సహకారం..
దేశ రక్షణపరంగా వ్యూహాత్మక ప్రాంతమైన ఆదిలాబాద్‌లో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ అభివృద్ధికి రక్షణ శాఖ సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరే దిశగా కీలక ముందడుగు పడిందని కిషన్‌రెడ్డి తెలిపారు.
ఈ ఏడాది ఏప్రిల్ 17న రక్షణ, పౌర విమానయాన శాఖల అధికారులు ఆదిలాబాద్ విమానాశ్రయ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ కోసం 2.75 కిలోమీటర్ల పొడవైన రన్‌వే నిర్మాణం అవసరమని తేల్చారు. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధీనంలో 369.45 ఎకరాల భూమి అందుబాటులో ఉండటంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో 1,500 ఎకరాల భూసేకరణ చేయాలని అధికారులు నిర్ణయించారు.


