రూ.266 కోట్ల పరిహారం పంపిణీ | 420626 cases resolved in Lok Adalat | Sakshi
Sakshi News home page

రూ.266 కోట్ల పరిహారం పంపిణీ

Sep 13 2026 2:07 AM | Updated on Sep 13 2026 2:07 AM

420626 cases resolved in Lok Adalat

లోక్‌ అదాలత్‌లో 4,20,626 కేసుల పరిష్కారం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నిర్వహించిన మూడో జాతీయ లోక్‌ అదాలత్‌లో రూ.266 కోట్ల పరిహారం కక్షిదారులకు పంపిణీ చేశారు. అలాగే 4,20,626 కేసులను పరిష్కరించారు. వీటిలో ప్రీలిటిగెంట్‌ కేసులు 2,78,335 ఉండగా, పెండింగ్‌ కేసులు 1,40,565 ఉన్నాయి. ఈ మేరకు వివరాలను లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సభ్యకార్యదర్శి సీహెచ్‌ పంచాక్షరి మీడియాకు వెల్లడించారు. లోక్‌ అదాలత్‌లో వినియోగదారుల, కార్మిక, మోటారు ప్రమాద పరిహారం, భూసేకరణ, సివిల్, క్రిమినల్‌ తదితర వివిధ రకాల పెండింగ్, ప్రీ–లిటిగేషన్‌ కేసులకు రాజీ పరిష్కారాలు కల్పించారు. 

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ప్యాట్రన్‌ ఇన్‌ చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్‌ పి.శామ్‌ కోషి, హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ మార్గదర్శకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 342 లోక్‌ అదాలత్‌ బెంచీలు ఏర్పాటు చేశారు. వీటిలో 340 బెంచీలు జిల్లా కోర్టుల్లో, రెండు బెంచీలు తెలంగాణ హైకోర్టులో పనిచేశాయి. అత్యధికంగా మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్స్‌కు సంబంధించి హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జి సమక్షంలో ఇన్సూరెన్స్‌ కంపెనీ రూ.5 కోట్ల పరిహారాన్ని బాధితులకు అందజేసింది. 

హైకోర్టులో 182 కేసుల పరిష్కారం..
తెలంగాణ హైకోర్టులో జస్టిస్‌ కె.సుజన, జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావు ఆధ్వ ర్యంలో రెండు ప్రత్యేక లోక్‌ అదాలత్‌ బెంచీలు పనిచేశాయి. వీటి ద్వారా 182 పెండింగ్‌ కేసులు రాజీ మార్గంలో పరిష్కరించారు. మోటారు ప్రమాద పరిహా రం కేసుల్లో బాధితులకు రూ.14.81 కోట్లకు పైగా పరిహారం మంజూరైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement