ఇదేం పరిపాలన అధ్యక్షా | BRS mock assembly at Telangana Bhavan | Sakshi
Sakshi News home page

ఇదేం పరిపాలన అధ్యక్షా

Sep 13 2026 2:02 AM | Updated on Sep 13 2026 2:05 AM

BRS mock assembly at Telangana Bhavan

తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ‘మాక్‌ అసెంబ్లీ’    

రేవంత్‌ పాలనపై విమర్శలతో హోరెత్తిన సభ

సాక్షి, హైదరాబాద్‌: వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెన్షన్‌కు గురైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు శనివారం తెలంగాణ భవన్‌లో ‘మాక్‌ అసెంబ్లీ’నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలను తలపించేలా సభా మందిరాన్ని తీర్చిదిద్ది, స్పీకర్, ముఖ్యమంత్రి, మంత్రుల పాత్రలను పార్టీ నేతలకు కేటాయించారు. జహీరాబాద్‌ ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు స్పీకర్‌గా వ్యవహరించగా, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సీఎం రేవంత్‌రెడ్డి పాత్ర పోషించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇరిగేషన్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాత్రలో, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాత్రలో కనిపించారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఇరిగేషన్‌పై చర్చను ప్రారంభించారు. 

కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని బీఆర్‌ఎస్‌ సభ్యులు విమర్శలు గుప్పించారు. అదే సమయంలో అధికార పక్షం పాత్రధారులుగా వ్యవహరించిన నేతలు ప్రభుత్వంపై వ్యంగ్యా్రస్తాలు సంధించారు. విద్యుత్‌ సమస్యపై వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో సభలో కరెంటు పోవడం, ఎమ్మెల్యే డాక్టర్‌ కె.సంజయ్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని జగదీశ్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి పోడియం వద్దకు వెళ్లి స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. సీఎంను విమర్శిస్తే మైక్‌ కట్‌ చేస్తానంటూ హెచ్చరికలు, కిందనుంచి తనకు చీటీ వచ్చినందున మైక్‌ ఇవ్వనని మాణిక్‌రావు చెప్పడం సభలో నవ్వులు పూయించింది. ఈ సందర్భంగా ఎవరేం మాట్లాడారంటే... 

నీళ్లలోనూ కాంగ్రెస్‌ నిర్లక్ష్యమే: జగదీశ్‌రెడ్డి 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు నీళ్ల విషయంలో అన్యాయం జరిగింది, తెలంగాణలో రెండు కోట్ల ఎకరాలను సాగులోకి తెచ్చిన ఘనత కేసీఆర్‌దే. మిషన్‌ కాకతీయతో చెరువులు, మిషన్‌ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందించాం. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. 

22ఏతో ప్రజలకు చుక్కలు: మర్రి రాజశేఖర్‌రెడ్డి 
22ఏ నిబంధనల పేరుతో రాత్రికి రాత్రే భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. నా నియోజకవర్గంలో సుమారు 30 వేల ఇళ్లను 22ఏ జాబితాలో చేర్చారు. మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కావడం లేదు.  

నా ఇల్లు కూడా 22ఏలో ఉంది: కౌశిక్‌రెడ్డి 
హరీశ్‌రావు ప్రజెంటేషన్‌ తర్వాత పరిశీలిస్తే నా ఇల్లు కూడా 22ఏలో ఉన్నట్లు తేలింది. భూమిని జాబితా నుంచి తొలగించేందుకు ఓ బాధితుడిని 30 శాతం కమిషన్‌ అడిగారు. భూముల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 

కరెంటు లేక పరిశ్రమలకు పవర్‌ హాలిడే: ప్రశాంత్‌రెడ్డి 
రైతులు కరెంటు, యూరియా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్‌ హయాంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ అందించాం.కాంగ్రెస్‌ పాలనలో మళ్లీ కరెంటు కోతలు, పరిశ్రమలకు పవర్‌ హాలిడేలు వస్తున్నాయి. 

నిరుద్యోగులకు ఏవీ ఉద్యోగాలు?: కల్వకుంట్ల సంజయ్‌ 
సీఎం కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు, కంపెనీలు వస్తున్నా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం లేదు. తొలిఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి బీఆర్‌ఎస్‌ ఇచ్చిన వాటిని కూడా తమ ఖాతాలో వేసుకుంటోంది.  

ఆ హామీలు ఎక్కడ?: సునీతా లక్ష్మారెడ్డి 
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై జరిగిన దాడి యావత్‌ తెలంగాణకు జరిగిన అవమానకరం.మహిళలను కోటీశ్వరులను చేస్తామని కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ అమలు కాలేదు. ప్రతి మహిళకు ప్రభుత్వం లక్ష రూపాయలు బాకీ పడింది. 

శాంతిభద్రతలు కనుమరుగు : సబితా ఇంద్రారెడ్డి 
రాష్ట్రంలో శాంతిభద్రతలు కనుమరుగయ్యాయి. పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని విద్యార్థులు కోరితే సీఎం చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి సీఎం క్షమాపణ చెప్పాలి. 

పోడు గిరిజనులపై దాడులు: అనిల్‌ జాదవ్‌ 
చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం విస్మరించింది. కేసీఆర్‌ హయాంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చి, రైతుబంధు కూడా అందించాం. ప్రస్తుత ప్రభుత్వం పోడు భూముల విషయంలో గిరిజనులపై దాడులకు పాల్పడుతోంది. 

క్యూసెక్కులు తెలియవు.. చెక్కులు తెలుసు: పల్లా  
ఇరిగేషన్‌ సబ్జెక్టుపై నేను ప్రిపేర్‌ కాలేదు. చంద్రబాబు సూచనల మేరకు పెట్టుకున్న సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్‌ చెప్పినట్లు నడుచుకుంటా. నాకు బ్యాంకు చెక్కులు అంటే అర్థమవుతుంది. క్యూసెక్కులు అంటే అర్థం కాదు. కేంద్ర జల సంఘం సమావేశాన్ని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంగా భావించి వెళ్లాను. మేడిగడ్డను బాగు చేసి, కేసీఆర్‌కు పేరు వచ్చే పనులు చేసేది లేదు. 

మైనింగ్‌ అంటే మై ఎర్నింగ్‌: గంగుల  
కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి నేను సొంత డబ్బు ఖర్చు పెట్టా. ఇప్పుడు ఆ డబ్బు తిరిగి సంపాదించుకోవాల్సి ఉంది. నేను ఒక్కడినే కమిషన్లు తీసుకోవడం లేదు. కర్నాటకలో 40శాతం కమిషన్లు అయితే ఇక్కడ మేము 30శాతమే తీసుకుంటున్నాం. భూ భారతి కాదు.. భూ హారతి చేస్తాం. మైనింగ్‌ అంటే మై ఎరి్నంగ్‌.  

ఏ వంద రోజుల్లో చేస్తామో చెప్పామా? 
‘‘కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నాం. ఏ వంద రోజుల్లో చేస్తామని ఏమైనా చెప్పామా? ఐదేళ్లు కాదు..25 ఏళ్లు అధికారంలో ఉంటాం. ఎప్పుడో ఒకప్పుడు హామీలు అమలు చేస్తాం.నాకు ఢిల్లీతో సమస్యలున్నాయి. పార్టీలోనూ ఉన్నాయి..చివరికి బీఆర్‌ఎస్‌తో కూడా ప్రశాంతత లేదు. ప్రాజెక్టులన్నీ ఇందిరాగాంధీ కట్టినవే. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని కూడా ఆమే నిర్మించారు. నాకు పాలనలో అనుభవం లేదు.. తెలిసిందల్లా అందరినీ తొక్కుకుంటూ పైకిరావడమే. 

భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వంటి అనుభవజ్ఞులున్నారు.వాళ్లు లేకపోతే మంత్రి పొంగులేటి ఉన్నాడు. పాత రోజులు తెస్తామన్నాం..తెచ్చాం. యూరియా బస్తాల కోసం చెప్పులు లైన్లో పెట్టే పాలన తెచ్చాం. ఉద్యోగాల గురించి హామీ ఇచ్చిన రాహుల్‌గాంధీని అడగాలి. నేను హార్వర్డ్‌ యూనివర్సిటీలో వారం రోజులు చదువుకుని అన్నీ తెలుసుకుని వచ్చా. సభలో నన్ను మాట్లాడనివ్వకపోతే పేగులు మెడలో...గుడ్లు పీకి గోటీలాడుతా..ఇలా పాత భాష మాట్లాడాల్సివస్తది. బంగారం కొనొద్దని ప్రధాని మోదీ చెప్పడం వల్లే తులం బంగారం ఇవ్వడం లేదు. పైగా దొంగలు ఎత్తుకుపోతే నన్ను బద్నాం చేస్తారు. హిట్లర్‌ నాకు ఆదర్శం..పాలన కూడా అలాగే చేస్తా.. నాకు తిక్కలేస్తే లోపలేయిస్తా’’.  – సీఎం పాత్రలో తలసాని 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement