అయితే ఉండకూడనివి కూడా 22ఏ జాబితాలో పడ్డాయి
అప్‌డేట్ కాని ధరణి కాపీనే మళ్లీ అప్‌లోడ్ చేయడంతోనే సమస్యలు
తప్పు జరిగిన మాట వాస్తవం... కానీ సరిదిద్దుతున్నాం
దొంగే పోలీస్‌ను దొంగా దొంగా అన్నట్టు బీఆర్‌ఎస్ వైఖరి
ప్రజల ఆస్తులపై హక్కులకు సంపూర్ణ రక్షణ కల్పిస్తాం
ఏడాదిన్నరలోపే భూముల సర్వే చేస్తాం
ధరణి ఫోరెన్సిక్ ఆడిటింగ్‌లో భయంకర విషయాలు తేలాయి... అన్నీ ‘సెట్’కు పంపాం
బీజేపీ, బీఆర్‌ఎస్‌ల చిలకలే వేరు... పలుకులు మాత్రం ఒకటే
శాసనసభలో మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిషేధిత 22ఏ జాబితాలో పెట్టిన భూములేవీ లేవు. మేం అధికారంలోకి వచ్చాక ఈ జాబితాను కొత్తగా తయారు చేయలేదు. 1999లో ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌ను రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఈ జాబితా అవసరం వచ్చింది. అప్పటి నుంచి కొనసాగుతోంది. 2009లో కోర్టు ఆదేశానుసారం ఈ జాబితా తయారు చేశారు. 2009–15 వరకు ఈ జాబితాపై హైకోర్టులో రెండువేల కేసులు పడ్డాయి. ఆ సమయంలో ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. 22ఏ జాబితా భూములను ఐదు కేటగిరీల్లో వర్గీకరించాలని చెప్పింది. కానీ, బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పని చేయలేదు. ఈ నేపథ్యంలో 2017–25 వరకు హైకోర్టులో 28,611 కేసులు పడ్డాయి. దీంతో 45 రోజుల్లో ఈ జాబితా పబ్లిక్‌డొమైన్‌లో పెట్టాలని, కోర్టుకు కూడా కాపీ ఇవ్వాలని, అన్ని జిల్లాల్లో ఇవ్వాలని, 22ఏ జాబితా నుంచి భూములను తొలగించాలంటే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. దీంతో కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా డిసెంబర్ 3, 2025న ఈ జాబితాను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాం. అయితే, తక్కువ సమయం ఉన్నందున జీవో 121, ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన సమయంలో ఏ భూములు ఈ జాబితాలో ఉన్నాయో వాటిని అప్‌డేట్ చేయకుండా అదే కాపీని అప్‌లోడ్ చేశాం. స్వార్థం, స్వలాభం కోసం చేసింది కాదు. తప్పు జరిగిన మాట వాస్తవం. దీనిపై నేను విచారం వ్యక్తం చేశాను. అయితే, యుద్ధ ప్రాతిపదికన సరిదిద్దుతున్నాం’ అని రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. శనివారం అసెంబ్లీలో 22ఏ భూములపై స్వల్పకాలిక చర్చను పొంగులేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా మూడున్నర గంటల పాటు ప్రసంగించారు. చేయాల్సింది చేసి, కొల్లగొట్టాల్సింది కొల్లగొట్టి నంగనాచిల్లా మాట్లాడుతున్నారని, దొంగే పోలీసును దొంగా దొంగా అన్నట్టుగా బీఆర్‌ఎస్ వైఖరి ఉందని ధ్వజమెత్తారు.
47,400 ఎకరాలు తగ్గింది
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి 220 జాబితాలో 1,02,52,690 ఎకరాల భూమి ఉంటే, 2026 ఆగస్టు 31 నాటికి 1,02,05,250 ఎకరాలు ఉందని చెప్పారు. అంటే 47,400 ఎకరాలు తగ్గిందని, ఇంకా తాము లక్షల ఎకరాలు కొత్తగా ఈ జాబితాలో చేర్చింది ఎక్కడని నిలదీశారు. రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి 1,95,812 ఎకరాల వ్యవసాయేతర భూములు 22ఏ జాబితాలో ఉంటే ఇప్పుడు 1,94,543 ఎకరాలున్నాయని, దాదాపు 800 ఎకరాలు తగ్గితే తాము కొత్తగా ఏం చేరుస్తామని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 22ఏ జాబితా నుంచి తొలగించిన ప్రతి అంగుళం భూమికి కాగితాలున్నాయని, టీఎం–15 మాడ్యూల్ ద్వారా ప్రజల పట్టా భూములైన 23వేల ఎకరాలను వారికి ఇచ్చేశామని, జీవోలు, మెమోల లద్వారా మరో 20వేల ఎకరాలు ప్రజలకే ఇచ్చామన్నారు. అయితే, బీఆర్‌ఎస్ హయాంలో ఈ జాబితా నుంచి తొలగించిన 23వేల ఎకరాల భూమికి కాగితాల్లేవని కమిటీ చెప్పిందన్నారు. 22ఏ జాబితా కారణంగా రిజిస్ట్రేషన్లు తగ్గాయని అనడంలో వాస్తవం లేదన్నారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్, బీజేపీలు ఒక్కటేనని, ఇక్కడ పలికే చిలుకలు మాత్రమే వేరని, కానీ పలుకులు మాత్రం ఒకటేనన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు, ఏలేటి మహేశ్వర్‌రెడ్డిలు ఒకే తరహాలో మాట్లాడిన మాటలను స్పీకర్ అనుమతితో సభకు వీడియో ద్వారా వినిపించారు.
శకుని మామ చేసి ఉంటే..
‘అగిపెట్టెల అబద్ధాల రావు, శకుని మామ తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్నారు. అప్పుడే వారు ఈ జాబితాను సరిచేసి ఉంటే ఇప్పుడు సమస్య వచ్చేది కాదు. వారు తెచ్చిన ధరణి కారణంగా ఎంతో మంది ఆత్మహత్యల పాలయ్యారు. ఇప్పుడేదో మాట్లాడుతున్నారు. మనిషి రక్తం మరిగిన పులి మళ్లీ మళ్లీ తిరిగినట్టు అధికారం కోసం దోచుకోవడం కోసం నోరు తెరిస్తే అబద్ధాలాడుతున్నారు. కానీ ఆ పులికి తెలియదు.. వచ్చి రేవంత్‌రెడ్డి అనే బోనులో పడతాడని. ముక్కుతాడు వేసి కట్టేస్తాడని తెలియదు. నిద్ర పట్టని రాత్రులు గడుపుతూ రోడ్డెక్కి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. 22ఏ జాబితాతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నప్పుడు పిల్లకాకులు అరవడమెందుకు? ప్రధాన ప్రతిపక్ష నేత వచ్చి మాట్లాడొచ్చు కదా? సలహాలు ఇవ్వచ్చు కదా? వసతులు, ఏర్పాట్లు కావాలి కానీ ప్రజలకు సమస్య వచ్చినప్పుడు కనుచూపు మేరలో కనిపించవా? నువ్వున్నప్పుడు నేను మాట్లాడాలనే కోరిక అలానే మిగిలిపోయేట్టుంది’ అని పొంగులేటి చెప్పారు.
మొహం చాటేయడం అలవాటే..
22ఏ జాబితాలో ఉన్న భూములను చూపెట్టి పేదల కడుపుకొట్టారని, అందుకే సమాధానం చెప్పాల్సి వస్తుందని సభలో గందరగోళం సృష్టించి ప్లాన్ ప్రకారం పారిపోయారని పొంగులేటి అన్నారు. అయితే, చర్చకు మొహం చాటేయడం వారికి అలవాటేనని, సభ నుంచి వారు పారిపోయినా ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇప్పుడు 22ఏ జాబితా కారణంగా అక్కడక్కడా ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే అని, కానీ ధరణిని అమల్లోకి తెచ్చినప్పుడు మూడు నెలల పాటు అసలు రిజిస్ట్రేషన్లనే నిలిపివేశారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి 387 గ్రామాలకు నక్షాల్లేవని, ఆయా గ్రామాల్లో సర్వే చేసి భూముల సమస్యలు తీరుస్తున్నామని చెప్పారు. ఇందుకోసం మొదటి దశలో భాగంగా 70 రోవర్లు కొనుగోలు చేశామని, 32 జిల్లాల్లోని 70 చొప్పున గ్రామాల్లో తొలిదశలో పైలట్ సర్వే చేస్తున్నామన్నారు. నవంబర్ చివరికల్లా ఈ సర్వే పూర్తవుతుందని అన్నారు.
23వేల ఎకరాలు అక్రమంగా బదిలీ
ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని వారు చేసిన అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహిస్తే అనేక భయంకర విషయాలు వెలుగులోనికి వచ్చాయని పొంగులేటి చెప్పారు. పైలట్‌లో భాగంగా సిద్ధిపేట, సిరిసిల్లలో ఆడిట్ చేస్తే 23వేల ఎకరాల భూమిని 13వేల ఖాతాలకు బదిలీ చేసినట్టు తేలిందన్నారు. ఏ భూమి ఎవరి ఖాతాలోకి వెళ్లింది.. విదేశాల్లో జరిగిన లావాదేవీలేంటి? అక్కడ కట్టుకున్న హోటళ్ల వివరాలను ప్రత్యేక విచారణ బృందం (సెట్)కు పంపామని తెలిపారు. అధికారం పోయిన తర్వాత కూడా అధికారంలోనే ఉన్నామని భ్రమపడుతూ, పాత వ్యవస్థలను ఉపయోగించుకుని పేదల భూములను కొల్లగొట్టాలనే ఆలోచనలను మానుకోవాలని హితవు పలికారు. అసలు 22ఏ భూముల విషయంలో కొన్ని సమస్యలను గుర్తించామని, వాటిపై సభ సూచన మేరకు త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పొంగులేటి వెల్లడించారు. యూఎల్‌సీ భూములు, జీహెచ్‌ఎంసీతో పాటు హెచ్‌ఎండీఏ, డీటీసీపీలు అనుమతిలిచ్చిన లేఅవుట్లు, జీవో 59, జీవో 118, అసైన్డ్ భూముల్లో కట్టుకున్న ఇళ్లు, ఇందిరమ్మ హౌసింగ్ కింద కేటాయించిన ఇంటి స్థలాలు, నాలా మార్పిడి కాని భూములు, ప్రభుత్వ భూముల్లో అనధికారిక లేఅవుట్ల విషయంలో సమస్యలున్నాయని, వీటిని సభ నిర్ణయం మేరకు పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని పొంగులేటి స్పష్టం చేశారు.
ధరణి దందాతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టారు...
–ఎన్నికల్లో ఖర్చుకు వాడారు
–హరీశ్‌రావు సొంత మామకు ప్రభుత్వ భూమిని కట్టబెట్టించారు
–ఇలా పొందినవారిలో పల్లా రాజేశ్వరరెడ్డి, గంగుల కమలాకర్ ఉన్నారు
ధరణి పోర్టల్‌ను అట్టుపెట్టుకుని బీఆర్‌ఎస్ పెద్దలు రూ.లక్షల కోట్లు కొల్లగొట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అలా వచ్చిన డబ్బును గత ఎన్నికల్లో ఖర్చు కోసం వాడుకున్నారన్నారు. ఎకరాల కొద్దీ భూమిని నిషేధిత జాబితా నుంచి తప్పించి పట్టా భూములుగా మార్చి విక్రయించి భారీగా డబ్బు పోగు చేసుకున్నారన్నారు. అలాంటి లావాదేవీలకు సంబంధించి తమ ప్రభుత్వం గుర్తించిన భూములను తిరిగి నిషేధిత జాబితాలోకి చేరుస్తూ, అవి పేదలకు దక్కేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 22ఏకు సంబంధించి శాసనససభలో జరిగిన స్వల్పకాలిక చర్చను ప్రారంభిస్తూ ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్‌రావులను ప్రధాన పాత్రధారులుగా పేర్కొంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను శకుని మామ అని, హరీశ్‌రావును అగ్గిపెట్టెల అబద్ధాల రావు, అని కేటీఆర్‌ను డ్రామాల వ్యక్తి అంటూ పదేపదే సంబోధించారు.
ఉదాహరణలతో సభ ముందు...
ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని అసైన్‌మెంట్, భూదాన్ భూములను నిషేధిత జాబితా నుంచి తప్పించి పట్టా భూములుగా మార్చి ప్రైవేట్ పరం చేశారంటూ మచ్చుకు కొన్ని ఉదంతాలుగా సభ దృష్టికి తెచ్చారు. పొంగులేటి మాటల్లోనే...
⇒ ‘సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో సర్వే నెం.271లో 327.09 ఎకరాల ప్రభుత్వం భూమిని గతంలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పట్టాల కోసం కేటాయించింది. ఇందులో 6.18 ఎకరాల భూమిని గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న హరీశ్‌రావు తన సొంత మామ (భార్య తండ్రి) హన్మంతరావుకు కట్టబెట్టించారు. ఇందులో కొంత భూమికి సంబంధించి మిషన్ భగీరథ పరిహారం కూడా పొందారు.
⇒ మెదక్ జిల్లా శివంపేట మండలం సిక్లిందాపూర్ గ్రామంలో సర్వే నెం.33 నుంచి 87 వరకు ఉన్న 569.05 ప్రభుత్వ భూమిలో 2023 అక్టోబరు 5న 372.32 ఎకరాలకు సంబంధించి ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్ (ఓఆర్‌సీ) జారీ చేశారు. దాన్ని మొత్తంగా స్వాహా చేశారు. ఆ రూపంలో పోగుచేసుకున్న రూ.కోట్ల మొత్తాన్ని ఎన్నికల ఖర్చుగా వినియోగించారు.
⇒ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పలతుర్తి గ్రామ సర్వే నం.58, 59లో ఉన్న 476.30 ఎకరాలు ప్రభుత్వం భూమిలో.... 112.21 ఎకరాల భూమిని 22ఏ జాబితా నుంచి తప్పించి ఓ కుటుంబంలోని సభ్యుల పేర్లతో ఓఆర్‌సీ జారీ చేశారు. ఇక్కడే 195.25 ఎకరాలను కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టాలు జారీ చేసే సమయంలో కొందరు పసిగట్టి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ బాగోతం వికటించి తిరిగి ఆ భూములు నిషేధిత జాబితాలోకి చేరాయి.
⇒ రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగుల పల్లి గ్రామంలో సర్వే నం. 186 నుంచి 189లో ఉన్న 29.27 ఎకరాల భూదాన్ భూమి ఉండగా, దాన్ని పట్టా భూమిగా కన్వర్ట్ చేయించారు. ఇందులో 24.27 ఎకరాలను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మరో ఇద్దరి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ భూమి ప్రస్తుత విలువ రూ.3 వేల కోట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు దీన్ని మేము తిరిగి నిషేధిత జాబితాలో చేర్చాం.
⇒ ఇదే గ్రామం శంకర్‌హిల్స్ ఏరియాలోని సర్వే నం. 111–191 లోని 460 ఎకరాల భూమికి పట్టాదారులు గతంలో ఓ ప్రైవేటు సంస్థకు జీపీఏ ఇచ్చారు. దాన్ని ఆ సంస్థ 3,333 ప్లాట్లుగా విడదీసి విక్రయిస్తోంది. మరోవైపు ఆ భూమిని మరో సంస్థకు మరోసారి జీపీఏ చేశారు. ఆ సంస్థ ఎకరాల రూపంలో విక్రయిస్తోంది. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లగా స్టేటస్‌కో జారీ అయింది. 2022లో నాటి ప్రభుత్వం ఆ భూమిని నిషేధిత జాబితాలో పెట్టింది. తర్వాత 226.06 ఎకరాలను ఆ తర్వాత నిషేధిత జాబితా నుంచి తప్పించి ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారు. అలా పొందినవారిలో బీఆర్‌ఎస్ నేత గంగుల కమలాకర్ కూడా ఉన్నారు’


