రూ. 19 కోట్ల అక్రమాల ఫిర్యాదుపై ముందుకెళ్లొద్దని పోలీసులపై ఓ మాజీ ఐపీఎస్ ఒత్తిడి
సాక్షి,హైదరాబాద్: ‘జూబ్లీహిల్స్ క్లబ్‌లో గత పాలకవర్గ హయాంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఫైల్ ముందుకు కదలొద్దు. అందుకు ఏ స్థాయిలో సిఫారసు చేయించేందుకైనా నేను సిద్ధం. ప్రస్తుత పాలకవర్గాన్ని పనిచేయనీయకుండా అడ్డంకులు సృష్టించే విషయాన్నీ నేనే చూసుకుంటా’అంటూ సీసీఎస్ పోలీసులపై ఓ మాజీ ఐపీఎస్ ఒత్తిడి తెస్తున్న అంశం క్లబ్ సభ్యుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే రిటైరైన ఆ అధికారికి రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక పదవి కూడా అప్పగించడంతో తన పలుకుబడితోపాటు ప్రస్తుత పదవికి ఉన్న అధికారంతో జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్‌లో అన్నీ తానై వ్యవహరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గత పాలకవర్గం చేపట్టిన వివిధ పనులపై సభ్యుల నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రస్తుత పాలకవర్గం నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో ప్రతి పని, చెల్లింపులను పరిశీలించి ఒక నివేదికను రూపొందించింది. అందులో వివిధ రకాల పనులకు మొత్తం రూ. 19 కోట్ల వరకు ఖర్చుపెట్టగా అందులో అనేక అక్రమాలు చోటుచేసుకున్నట్లు గుర్తించింది. వాస్తవ వ్యయం కంటే అధిక అంచనాలతో పనులు చేపట్టడం, క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమాల ద్వారా వచి్చన రాబడి, చేసిన ఖర్చు, సభ్యత్వాల మంజూరు తదితర అంశాల్లో లోపాలను గుర్తించింది.
సీసీఎస్‌లో ఫిర్యాదు చేసినా దర్యాప్తు లేదు..
ఈ ఆర్థిక అవకతవకలపై ప్రస్తుత కార్యదర్శి జగన్నాథరావు జూలై 28న సీసీఎస్‌కు అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేశారు. చెనోయ్ చార్టర్డ్ అకౌంటెంట్స్, సిరి కన్సల్టెంట్స్ (టెక్నికల్ ఎవాల్యుయేషన్ టీమ్) ఆడిట్ సంస్థల నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టి దోషులను చట్టం ముందు నిలబెట్టాలని పోలీసులను కోరారు. కానీ ఇప్పటివరకు కనీసం కేసు కూడా నమోదవలేదు. దీనివెనుక రిటైర్డ్ ఐపీఎస్ చక్రం తిప్పుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు జిల్లా రిజిస్ట్రార్‌పై ఇదే ఐపీఎస్ ఒత్తిడి తెచ్చి ప్రస్తుత పాలకవర్గం ఎన్నికే చెల్లదన్న ఉత్తర్వులు ఇప్పించారని.. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తే ఉత్తర్వును కొట్టేసిందని ప్రస్తుత క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్‌లో దేశంలోకెల్లా ప్రముఖులైన వివిధ రంగాల వృత్తి నిపుణులు, వ్యాపారవేత్తలు, సివిల్ సర్వీస్ అధికారులు సభ్యులుగా ఉన్నారని.. వారందరి అభ్యర్థన మేరకు జరిగిన విచారణ, ఆపై కేసు నమోదుకు ఫిర్యాదు చేస్తే విచారణ ప్రారంభించకపోవడం ఏమిటని వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని క్లబ్ పాలకవర్గం తీవ్రంగా పరిగణిస్తోంది.


