హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు పటిష్ఠ వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి అర కిలోమీటరుకు వ్యర్థాల సేకరణ కేంద్రాలు నెలకొల్పాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సూచించారు. కొత్తగా నిర్మించే షాపింగ్ కాంప్లెక్సులు, వాణిజ్య భవనాల్లో మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్లను తప్పనిసరి చేయాలని కోరారు.
శనివారం రాష్ట్ర శాసనసభలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు-2026’పై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. పర్యావరణ సుస్థిరత, వాతావరణ మార్పులపై కార్యాచరణ, లింగ సమానత్వం, సార్వత్రిక ప్రాప్యత, సమ్మిళిత పట్టణ రూపకల్పన, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలతో సమగ్ర కార్యాచరణ వ్యవస్థను ప్రతిపాదించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. వీటితోపాటు ఘన వ్యర్థాల సేకరణ, తరలింపు, నిర్మూలనకు స్పష్టమైన ప్రణాళికను రూపొందించాలని సూచించారు. ఒక నగరంలోకి ప్రవేశించే వారికి మొదట కనిపించే పరిసరాలే ఆ నగరంపై తొలి అభిప్రాయాన్ని కలిగిస్తాయని పద్మావతి రెడ్డి అన్నారు.
పరిశుభ్రమైన రహదారులు, క్రమబద్ధమైన వ్యర్థాల నిర్వహణ, ప్రజలకు అందుబాటులో ఉండే పౌర సదుపాయాలు నగర అభివృద్ధికి ప్రధాన సూచికలని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుంచి ఘన, జీవ వ్యర్థాలు వెలువడుతున్నాయని, నిర్మాణ పనుల ద్వారా శిథిల వ్యర్థాలు, ఆసుపత్రుల నుంచి జీవవైద్య వ్యర్థాలు, హోటళ్లు, వీధి ఆహార కేంద్రాల నుంచి ఆహార వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు. వాటి స్వభావానికి అనుగుణంగా సేకరించి, శాస్త్రీయ పద్ధతిలో తరలించి, సురక్షితంగా నిర్మూలించే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
“మనిషి ఉన్న ప్రతి చోటా ప్రతిరోజూ వ్యర్థం ఉత్పత్తి అవుతుంది. అందువల్ల వ్యర్థాల నిర్వహణ అప్పుడప్పుడు చేపట్టే కార్యక్రమంగా కాకుండా ప్రతిరోజూ నిరంతరాయంగా కొనసాగే వ్యవస్థగా ఉండాలి” అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో రహదారుల పక్కన, పాదచారి మార్గాల మూలల్లో, ఖాళీ స్థలాల్లో చెత్తను పారవేస్తున్నారని చెప్పారు. కొద్దిరోజుల్లోనే అది భారీ చెత్త కుప్పగా మారి దుర్వాసన వెదజల్లడంతోపాటు వీధి కుక్కలు చేరడానికి కారణమవుతోందన్నారు. దీనివల్ల ప్రజారోగ్యంతోపాటు నగర పర్యావరణం, సౌందర్యం దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు నగర రూపకర్తలు, ఆర్కిటెక్టుల సహకారంతో ప్రతి అరకిలోమీటరుకు ఒక వ్యర్థాల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కేంద్రాలు సాధారణ చెత్త కుండీల మాదిరిగా కాకుండా నగర సౌందర్యంలో భాగంగా కనిపించేలా ఆకర్షణీయంగా, శాస్త్రీయంగా రూపకల్పన చేయాలన్నారు.
ప్రజలు నడిచి వెళ్లగలిగే దూరంలో వ్యర్థాల సేకరణ కేంద్రాలు ఉంటే ఎక్కడపడితే అక్కడ చెత్త పారవేసే పరిస్థితి తగ్గుతుందని చెప్పారు. పురపాలక సంస్థలకు వ్యర్థాల సేకరణ, తరలింపు, నిర్వహణ కూడా సులభతరం అవుతుందన్నారు. నగరం నివసించడానికి ఆరోగ్యకరంగా, చూడటానికి ఆహ్లాదకరంగా ఉండాలంటే పరిశుభ్రత విషయంలో ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమలు చేయాలని కోరారు.


