హైదరాబాద్: ఏబీవీపీ కార్యకర్తల పట్ల పోలీసుల వ్యవహరించిన తీరుపై కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వాళ్లపై దాడులు చేసి భయపెట్టాలని చూస్తారా? అని ప్రశ్నించారు. అరెస్టు చేసిన ఏబీవీపీ నేతలను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయని కారణంగానే ఏబీవీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారని, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన చేస్తే కాళ్ళు చేతులు విరగ్గొడతారా? అని నిలదీశారు.
‘కాంగ్రెస్ సర్కార్‌కు పోయే కాలం దాపురించింది. ప్రశ్నించే వాళ్లపై దాడులు చేస్తూ భయపెట్టాలని చూస్తోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అరెస్ట్ చేసిన ఏబీవీపీ నేతలను విడిచిపెట్టాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి. జీవో నంబర్-9ను రద్దు చేయాలి. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి.
అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ, విద్యార్థి సంఘాలపై అమానుషంగా ప్రవర్తించడం దుర్మార్గం. విద్యార్థులని చూడకుండా ఇష్టరీతిన గొడ్డున బాదినట్లు చావగొడతారా?, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్యాల రాకేష్ తీవ్ర అస్వస్థత కాగా తోటి నాయకులు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. విద్యార్థి నాయకుడు అస్వస్థకు గురికాడారానికి కారణం పోలీసులు కాదా?, ఈ ఘటన చూస్తే అర్థం అవుతుంది పోరాడే విద్యార్థులపై ఏ రకంగా దాడి చేస్తున్నారో అనే విషయం. అరెస్ట్ చేసిన ఏబీవీపీ నాయకులను బేషరతుగా విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: హెచ్‌ఎండీఏ పర్మిషన్ ఇస్తే.. హైడ్రా కూలగొడుతుందా?: కాంగ్రెస్ ఎమ్మెల్యే


