56% బీసీలు.. రాజకీయ రంగంలో వాటా ఎక్కడ? | 56 Percent Bc's Political Representation Telangana | Sakshi
Sakshi News home page

56% బీసీలు.. రాజకీయ రంగంలో వాటా ఎక్కడ?

Sep 12 2026 11:14 PM | Updated on Sep 12 2026 11:14 PM

56 Percent Bc's Political Representation Telangana

సాక్షి, హైదరాబాద్‌: జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలకు రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్‌తో ‘56% బీసీలు.. రాజకీయ రంగంలో వాటా ఎక్కడ?’ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, బీసీ ఇంటెలెక్టువల్స్‌ ఫోరం చైర్మన్‌ టి.చిరంజీవులు అధ్యక్షతన జరిగిన సమావేశానికి శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, బీజేపీ నాయకుడు తాడూరి శ్రీనివాస్‌ తదితరులు హాజరయ్యారు.

మూడు మంత్రి పదవులు బీసీలకే ఇవ్వాలి
ప్రస్తుతం ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవులను తక్షణమే బీసీలకు కేటాయించాలని సమావేశం ఏకగ్రీవంగా డిమాండ్‌ చేసింది. త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరింది. వడ్డెర, కుమ్మరి, నాయీబ్రాహ్మణ వంటి ఇప్పటివరకు తగిన ప్రాతినిధ్యం పొందని బీసీ కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

రెండు దశాబ్దాల్లో తగ్గిన ప్రాతినిధ్యం
టి.చిరంజీవులు మాట్లాడుతూ.. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు బీసీలు మంత్రులుగా ఉండగా, 2014లో నలుగురికి, 2018లో ముగ్గురికి, ప్రస్తుతం ఇద్దరికి తగ్గారని గణాంకాలతో వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే బీసీల మంత్రివర్గ ప్రాతినిధ్యం మరింత పడిపోయే ప్రమాదం ఉందన్నారు. జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలు పరిపాలనలో మైనారిటీగా మారడం సామాజిక న్యాయానికి విరుద్ధమన్నారు.

సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. మెజారిటీగా ఉన్న బీసీలు రాజకీయ అధికారంలో మాత్రం మైనారిటీ స్థాయిలో ఉండటం బాధాకరమన్నారు. శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాడాలని, జనగణనలో ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్‌ కోడ్‌ కేటాయించాలని కోరారు.

‘ఓట్లు మనవి.. సీట్లు వారివా?’
బీసీలకు కేవలం ఓటు హక్కు కాకుండా జనాభా ప్రాతిపదికన అధికారంలోనూ వాటా కావాలని బాలగోని బాలరాజుగౌడ్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సామాజిక న్యాయం విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం కోసం అన్ని ప్రజాస్వామిక శక్తులు ఏకమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

అలాగే, తాడూరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. బీసీలను విభజించి వారి ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. కటకం నరసింహారావు బీసీ హక్కుల కోసం తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమం నిర్మించాలని కోరారు. గుజ్జ సత్యం రానున్న కాలం బీసీలదేనన్నారు.

తదుపరి వట్టే జనార్దన్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. యాదవులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవుల్లో కనీసం ఒకటి యాదవులకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ విఠల్‌ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలకు రాజకీయంగా అన్యాయం జరిగిందన్నారు.

బీసీలకు ప్రత్యేక ప్రాతినిధ్యం కావాలి
జనాభాలో మెజారిటీగా ఉన్నప్పటికీ బీసీలకు అధికారంలో తగిన వాటా దక్కడం లేదని సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఓట్లు మనవి.. సీట్లు వారివా?’ అనే పరిస్థితి మారాలని, బీసీలు ఓటు బ్యాంకుగా కాకుండా రాజకీయ నిర్ణయాధికారంలో భాగస్వాములు కావాలని స్పష్టం చేసింది.

జనగణనలో ప్రతి కులానికి యూనిక్‌ కోడ్‌ కేటాయించడం, బీసీల రాజకీయ ప్రాతినిధ్యంపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, గణాంకాలతో కూడిన ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం, బీసీ కులాలు, సంఘాలు, మేధావులు ఐక్యంగా ముందుకు సాగడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.

అడ్వొకేట్‌ రాజు మాట్లాడుతూ.. బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో బీసీలు సాధించిన విజయం వారి ఐక్యతకు నిదర్శనమన్నారు. పొన్నం దేవరాజు మాట్లాడుతూ బీసీ అడ్వొకేట్లు తమ హక్కులు, రాజకీయ, సామాజిక ప్రాతినిధ్యం కోసం ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎర్ర సత్యనారాయణ, సూర్యనారాయణ, రిటైర్డ్‌ డీఆర్వో ఇలి వెంకన్న, దుర్గయ్యగౌడ్‌, మెట్టు సూర్యప్రకాశ్‌, బైరి శేఖర్‌, కర్ణాటి మనోహర్‌, చిన్నారాములు, ముదిరాజ్‌, చెన్న శ్రీకాంత్‌, బొంగు ప్రసాద్‌, నీరజ గౌడ్‌, లింగేశ్‌, చోళ రాజేశ్వర్‌, యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ వాటా దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని సమావేశం స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement