ఎప్పటిలోగా తొలగిస్తారో చెప్పాలి | Harish Rao spoke to the media at Telangana Bhavan | Sakshi
Sakshi News home page

ఎప్పటిలోగా తొలగిస్తారో చెప్పాలి

Sep 13 2026 1:03 AM | Updated on Sep 13 2026 1:04 AM

Harish Rao spoke to the media at Telangana Bhavan

22ఏ భూముల నుంచి ప్రజలకు ఎప్పుడు విముక్తి కల్పిస్తారు:హరీశ్‌రావు 

తప్పు జరిగిందని ఒప్పుకున్నారు.. క్షమాపణ చెప్పి గడువు ప్రకటించాలి

తన కుటుంబంపై ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని నిలదీత 

29 ఎకరాలు నావని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: ఎమ్మెల్యే పల్లా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన 22ఏ నిషేధిత భూముల సమస్యకు ప్రభుత్వం తక్షణ పరిష్కారం చూపాలని బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఆయన శనివారం రాత్రి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా బాధితులకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తే, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ఉద్దేశపూర్వకంగా సస్పెండ్‌ చేసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అబద్ధాల ప్రవాహం పారించారని ఆరోపించారు. తాను అడిగిన ఏ ప్రశ్నకూ మంత్రి సమాధానం చెప్పలేదన్నారు.

డిసెంబర్‌ 3, 2025న తొందరలో లిస్ట్‌ అప్‌లోడ్‌ చేయడం వల్ల తప్పు జరిగిందని పొంగులేటి ఒప్పుకున్నారన్నారు. తప్పు ఒప్పుకున్నప్పుడు బాధితులకు క్షమాపణ చెప్పి, సమస్యను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో ప్రకటించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 22ఏ జాబితాలో ఎన్ని ఎకరాలు చేర్చారు, ఎన్ని తొలగించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి ఇల్లు జాబితా నుంచి తొలగించినట్టే ప్రజల భూములను కూడా జాబితా నుంచి తొలగించాలని హరీశ్‌రావు కోరారు. 

కాంగ్రెస్‌ సర్కారే భూమి, ఎన్‌వోసీ ఇచ్చింది.. 
తన కుటుంబ సభ్యులపై పొంగులేటి చేసిన ఆరోపణలను హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. తన మామ హన్మంతరావు రిటైర్డ్‌ బ్యాంకు అధికారి అని, ఆయన కొండపాకలో భూమి కబ్జా చేశారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎక్స్‌ సర్వీస్‌మన్‌ సత్యనారాయణకు 1995లో అప్పటి ప్రభుత్వం ఆ భూమిని కేటాయించిందని, 2010లో కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఎన్‌వోసీ ఇచ్చిందని వివరించారు. ఆ ఎన్‌వోసీ ఆధారంగా తన మామ చెక్‌ ద్వారా డబ్బు చెల్లించి, అప్పటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారన్నారు. 

భూమి కేటాయించి ఎన్‌వోసీ ఇచ్చిందీ కాంగ్రెస్‌... రిజిస్ట్రేషన్  చేసింది కూడా నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని పేర్కొన్నారు. ఎకరం రూ.15 కోట్లు విలువ చేస్తుందని చెబుతూ, రూ.50 లక్షలకు ఇచ్చి రిజిస్ట్రేషన్  చేయించుకున్నారంటూ పొంగులేటి చేసిన వ్యాఖ్యలు కూడా తప్పేనన్నారు. కొండపాక సిద్దిపేట నియోజకవర్గంలో కాకుండా గజ్వేల్‌ నియోజకవర్గంలో ఉందని, ఈ విషయంలోనూ మంత్రి తప్పుగా మాట్లాడారని పేర్కొన్నారు. నాదర్‌గుల్, ఖాజాగూడ భూములు, ఫీనిక్స్‌ కంపెనీ ఒప్పందం తదితర అంశాలపై తాను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

నిరూపిస్తే రాజీనామా చేస్తా: పల్లా 
జనగామ, వట్టినాగులపల్లి భూముల వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. వట్టినాగులపల్లిలో రూ.3 వేల కోట్ల విలువైన 29 ఎకరాల భూదాన్‌ భూమిని తాను తీసుకున్నానని పొంగులేటి ఆరోపించారని, ఇందులో వాస్తవం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే తనకు ఎకరం పది గుంటల భూమికి అగ్రిమెంట్‌ జరిగిందని, రాష్ట్రం ఏర్పడిన తొలి నెలలోనే రిజిస్ట్రేషన్  చేయించుకున్నానని తెలిపారు. ఇది భూదాన్‌ భూమి కాదని 2008లోనే కోర్టు స్పష్టం చేసిందన్నారు. 

తనకు ఉన్నది ఎకరం పది గుంటలేనని, 33 ఎకరాల్లో మైనంపల్లి సోదరులు ప్లాట్లు కొనుగోలు చేశారని, అందులో 8.10 ఎకరాలు మైనంపల్లి చంద్రశేఖర్‌ పేరున ఉన్నాయని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను హరీశ్‌రావుతో కలిసి జనగామకు వెళ్లి ప్రభుత్వ అక్రమాలను బయటపెట్టినందుకే తనపై కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. తన భూమిని 22ఏ జాబితాలో చేర్చి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని, కోర్టు కూడా తన భూమి విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పిందన్నారు. 29 ఎకరాల భూమి తనదని పొంగులేటి నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించలేకపోతే పొంగులేటి రాజీనామా చేస్తారా అని పల్లా సవాల్‌ విసిరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement