సూసైడ్ నోట్‌లో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు..
రూ.50లక్షల అప్పు తీర్చే దారిలేక బలవన్మరణం
జగిత్యాల జిల్లా గుల్లకోటలో విషాదం
పార్టీ పరంగా ఆదుకుంటాం: కొప్పుల ఈశ్వర్
వెల్గటూర్: ‘నా జీవితంలో కుటుంబానికి ఎప్పుడూ సమయం కేటాయించలేదు...పార్టీ నిర్వహణ, ఈఎంఐలకే అప్పు చేయాల్సి వచ్చింది...భార్యాపిల్లల కోసం ఏమీ చేయలేదు...వాళ్ల పాపం నాకు తగులుతుంది...నాలా ఎవరూ చేయొద్దు. అనాథలను చేసి తనువు చాలిస్తున్నందుకు నన్ను క్షమించాలని నా భార్య పల్లవిని వేడుకుంటున్నా. నా కుటుంబానికి అండగా ఉండి ఆదుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను, నాతో కలిసి పని చేసిన బీఆర్‌ఎస్ నాయకులను పేరుపేరునా వేడుకుంటున్నా..’అంటూ ఓ బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాసిన సూసైడ్ నోట్ అందరినీ కంటతడి పెట్టించింది.
ప్రజాసేవ చేయాలనే కోరికతో కుటుంబాన్ని వదిలి పార్టీకే అంకితమై.. పార్టీ కార్యక్రమాలకు కోసం అప్పు చేసి..వాటిని తీర్చే మార్గం లేక మానసిక వేదనతో జీవితంపై విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడిన సంఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోటలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సింహాచలం జగన్ (48) 2001–2010 వరకు వరుసగా రెండుసార్లు వార్డు సభ్యుడిగా.. 2013లో సర్పంచ్‌గా గెలుపొందాడు.

పాడె మోస్తున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
తెలంగాణ ఉద్యమం సమయంలో కొప్పుల ఈశ్వర్ సమక్షంలో అప్పటి టీఆర్‌ఎస్‌లో చేరాడు. పార్టీ కార్యక్రమాల నిర్వహణకు సుమారు రూ.18లక్షల వరకు అప్పు చేశాడు. వాటిని తీర్చేందుకు బ్యాంకులో రూ.15 లక్షలు హౌసింగ్ లోన్ తీసుకున్నాడు. మరో రూ.5లక్షలు పర్సనల్ లోన్, కొత్త కారు కోసం మరో రూ.5లక్షలు అప్పు చేశాడు. ఇంటి ఖర్చులు, పార్టీ నిర్వహణ, ఈఎంఐలు చెల్లించేందుకు మరో రూ.10 లక్షలు అప్పు చేశాడు. మొత్తంగా రూ.50లక్షల అప్పు అయ్యింది. వాటిని తీర్చేందుకు భార్య ఒంటిపై ఉన్న ఆభరణాలు తాకట్టు పెట్టాడు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా భార్య ఆరోగ్యం బాగలేక ఆస్పత్రిలో చూపిస్తున్నాడు.
అప్పులు తీర్చే దారితోచక మనస్తాపం చెంది శనివారం వేకువజామున ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. జగన్‌కు భార్య పల్లవి, కుమార్తె సంజన (11), కుమారుడు సుధాంష్ (5) ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. పల్లవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. జగన్ మరణ వార్త వినగానే మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ గుల్లకోట చేరుకొని మృతదేహానికి నివాళి అర్పించి స్వయంగా జగన్ పాడె మోసి అంతిమయాత్రలో పాల్గొ న్నారు. పార్టీ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.


