పన్నుపై అపోహలొద్దు | Minister Sridhar Babu clarifies on property tax hike | Sakshi
Sakshi News home page

పన్నుపై అపోహలొద్దు

Sep 13 2026 1:13 AM | Updated on Sep 13 2026 1:13 AM

Minister Sridhar Babu clarifies on property tax hike

20 శాతాన్ని సీఎం ఆమోదం మేరకు 10 శాతానికి తగ్గిస్తున్నాం 

‘క్యూర్‌’లో ఆస్తి పన్నుల పెంపుపై స్పష్టతనిచ్చిన మంత్రి శ్రీధర్‌బాబు 

ఈ మేరకు బిల్లుకు సవరణ ప్రతిపాదించిన స్పీకర్‌.. ఆమోదించిన అసెంబ్లీ 

అపెక్స్‌ కౌన్సిల్‌కు మేయర్లనూ ఆహ్వానించాలని కోరిన బీజేపీ, ఎంఐఎం

సాక్షి, హైదరాబాద్‌: కోర్‌ అర్బన్‌ రీజియన్‌లో పన్నులపై అపోహలు వద్దని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. ప్రతి ఏటా 20 శాతం ఆస్తి పన్నులు పెరుగుతాయనే విషయం వాస్తవం కాదన్నారు. పన్నులు ఎలా అంటే అలా పెంచడానికి వీల్లేదని, ప్రస్తుతం అమల్లో ఉన్న కంప్యూటేషన్‌ పద్ధతి ప్రకారమే పన్నులు పెరుగుతాయని, గరిష్టంగా 10 శాతానికి మించి పెరగవన్నారు. అది కూడా కేవలం 0.15 శాతం నివాస, 0.75 శాతం వాణిజ్య సముదాయాల మీద మాత్రమే పడుతుందని వివరించారు. శనివారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరపున కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (ఇంటిగ్రేటెడ్‌ గవర్నెన్స్‌) బిల్లు–2026 (క్యూర్‌)ను ప్రవేశపెట్టిన శ్రీధర్‌బాబు చట్టం లక్ష్యాలను వివరించారు. 

క్యూర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాలు రాష్ట్ర ఆర్థిక ఉత్పత్తిలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని వివరించారు. శనివారం మధ్యాహ్నం తర్వాత శ్రీధర్‌బాబు బిల్లుపై జరిగిన చర్చలో పలు పార్టీల సభ్యులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. బిల్లులో పెట్టిన 20 శాతాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం మేరకు 10 శాతానికి తగ్గిస్తున్నట్టు చెప్పారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు విస్తరించిన హైదరాబాద్‌ నగరాన్ని పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి చైర్మన్‌గా ప్రత్యేక కార్యనిర్వాహక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 

నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, రవాణా, ట్రాఫిక్‌ నియంత్రణ, వరదల నివారణ, చెత్త నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో వివిధ సంస్థలు, శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు. భవిష్యత్‌లో నగర అవసరాలకు అనుగుణంగా ఈ వ్యవస్థ పనిచేసేలా క్యూర్‌ చట్టాన్ని రూపొందిస్తున్నట్లు వివరించారు. అనంతరం బిల్లు ఆమోదానికి ప్రతిపాదించిన సందర్భంగా స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ కూడా ఈ అంశాన్ని వివరించారు. పన్నుల పెరుగుదలను 20 నుంచి 10 శాతానికి తగ్గిస్తూ బిల్లులో సవరణ చేయాలని సీఎం చేసిన ప్రతిపాదనను సభ ముందు ఆమోదానికి పెట్టారు. ఈ సవరణతోపాటు క్యూర్‌ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.  

ఎంఐఎం, బీజేపీ ఏకాభిప్రాయం 
పాల్వాయి హరీశ్‌బాబు (బీజేపీ) లేవనెత్తిన అంశాన్ని ప్రస్తావిస్తూ కోర్‌ రీజియన్‌లో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేసే అపెక్స్‌ కౌన్సిల్‌ కేవలం విధాన నిర్ణయాల కోసమేనని, ఈ సమావేశాలకు అవసరమైతే మేయర్లను ఆహ్వానిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ఈ కౌన్సిల్‌ ఏర్పాటు ద్వారా మేయర్లు, కార్పొరేటర్ల స్థానిక అధికారాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని వివరించారు. ఇందుకు విభేదించిన హరీశ్‌బాబు అపెక్స్‌ కౌన్సిల్‌కు మేయర్లను రమ్మనకపోతే వారికి ఇంకేం అధికారాలుంటాయని ప్రశ్నించారు. 

ఎంఐఎం సభ్యుడు జుల్ఫికర్‌ అలీ జోక్యం చేసుకుంటూ.. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాలకు మేయర్లను ఆహ్వానించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. దీంతో పాల్వాయి హరీశ్‌బాబు బల్లలు చరిచి మరీ అభినందించారు. ఎంఐఎం సభ్యుడు కూడా అదే చెబుతున్నాడంటూ అధికార పక్షానికి చూపెట్టే ప్రయత్నం చేశారు. వెంటనే శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుంటూ... జుల్ఫికర్‌ అలీని హరీశ్‌బాబు గైడ్‌ చేస్తున్నారని, అందుకే ఆయన ఆ కోణంలో మాట్లాడుతున్నారని బదులిచ్చారు. మూడు కార్పొరేషన్లను నియంత్రించేందుకు అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయడం లేదని, ఈ కౌన్సిల్‌ విశాల దృక్పథంతో పనిచేస్తుందని వివరణ ఇచ్చారు. 

ప్రజలపై తీవ్ర భారం: అక్బరుద్దీన్‌  
క్యూర్‌ బిల్లులోని పలు అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని, బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. బిల్లు న్యాయస్థానాల్లో నిలవదని, సెలక్ట్‌ కమిటీకి పంపాలని డిమాండ్‌ చేశారు. క్యూర్‌ పరిధిలోని కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ల అధికారాలకు కత్తెరేసి కీలక అధికారాలను క్యూర్‌ అపెక్స్‌ కౌన్సిల్‌కు, పురపాలక, పట్టణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి నేతృత్వంలోని క్యూర్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి అప్పజెప్పారని తప్పుబట్టారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు అధికారాలు అప్పజెప్పకపోతే ఎన్నికలు నిర్వహించి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. 

ప్రస్తుతం అమల్లో ఉన్న వార్షిక అద్దె విలువకి బదులుగా ప్రభుత్వం నిర్ణయించే మార్కెట్‌ విలువ ఆధారంగా ఆస్తి పన్నులను విధించాలని బిల్లులో పొందుపర్చడం పట్ల అభ్యంతరం తెలిపారు. స్థలం, భవనం మార్కెట్‌ విలువలను కలిపి ఆస్తి పన్నులు విధిస్తే నగర ప్రజలపై తీవ్ర భారం పడుతుందని తప్పుబట్టారు. ఏటా 20 శాతం ఆస్తి పన్నులు పెంచాలని బిల్లులో ప్రతిపాదించడాన్ని వ్యతిరేకించారు. ఆస్తుల మ్యుటేషన్‌ చేసుకున్న మాత్రాన వాటిపై హక్కులు రావని బిల్లులో పెట్టారని తప్పుబట్టారు. 

మరో ఆరు నెలల్లో మూడు కార్పొరేషన్ల ఎన్నికలకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ బిల్లుతో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్‌లో భూగర్భ కేబుల్‌ వ్యవస్థ ఏర్పాటుకి సంబంధించిన రూ.1,400 కోట్లు విలువైన కాంట్రాక్టును ఒకే కంపెనీకి ప్రభుత్వం ఇవ్వడాన్ని అక్బరుద్దీన్‌ ప్రశ్నించారు. బిల్లుపై బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉత్తమ్‌ పద్మావతిరెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, నవీన్‌యాదవ్‌ సైతం మాట్లాడారు.  

కోర్టుల్లో నిలబడదు: పాల్వాయి హరీశ్‌ 
‘క్యూర్‌’చట్టం న్యాయస్థానం ముందు నిలబడదని, దానిని ఉపసంహరించుకోవాలని బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీశ్‌బాబు డిమాండ్‌ చేశారు. ఈ బిల్లుకు తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమన్నారు. ఈ చట్టం అమలులోకి వస్తే... మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు ఎలాంటి అధికారాలు ఉండవని, సీఎంకు అపరిమిత అధికారాలను కట్టబెడ్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లుకు సంబంధించి 4,100 అభ్యంతరాలు వస్తే.. అందులో 3 వేలకు పైగా ఆస్తిపన్ను పెంపుదలపై ఆందోళన వ్యక్తమైందన్నారు.  

విశ్వనగరం ట్యాగ్‌ ఉండాలి: కూనంనేని సాంబశివరావు 
వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు విశ్వనగరం ట్యాగ్‌ ఉండాలని, అందుకోసం అధికార వికేంద్రీకరణతో మరింత అద్భుత నగరంగా తీర్చిదిద్దాలని సీపీఐ పక్షనేత కూనంనేని సాంబశివరావు చెప్పారు. విశ్వనగరం ట్యాగ్‌ వస్తేనే.. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారన్నారు. విస్తీర్ణంలో మూడో స్థానంలో.. జనాభాలో ఏడో స్థానంలో మన రాజధాని ఉందన్నారు.  

సదుపాయలు కల్పించాలి : దానం  
‘క్యూర్‌’పరిధిలో ప్రజల నుంచి ఏటా 20 శాతం వరకు ఆస్తిపన్ను వసూలు చేయాలనే నిర్ణయం సరికాదని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. ఇప్పటికే కోటీ 30 లక్షల జనాభా నివసిస్తున్న హైదరాబాద్‌ త్వరలోనే 2 కోట్ల జనాభాకు విస్తరించనుందని, వీరందరికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళిక బద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.  

మండలిలో క్యూర్‌ బిల్లు 
జిల్లాల విభజన అంతా అశాస్త్రీయమే: శ్రీధర్‌బాబు 
సాక్షి, హైదరాబాద్‌: పది జిల్లాలున్న తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా ఎలా విభజించారో బీఆర్‌ఎస్‌ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. జిల్లాల విభజన పూర్తిగా అశాస్త్రీయంగా జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే క్యూర్‌ బిల్లును రూపొందించినట్లు వివరించారు. శాసనమండలిలో ఆయన క్యూర్‌ బిల్లును ప్రవేశపెట్టి మాట్లాడారు. మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాశ్‌ మాట్లాడుతూ అత్యంత కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టేటప్పుడు అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సభ్యులకు ముందస్తుగా ఇవ్వాలని, బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఇస్తే వాటిని చదివేదెప్పుడని ప్రశ్నించారు. 

అనంతరం సభ్యులు అద్దంకి దయాకర్, ప్రొఫెసర్‌ కోదండరామ్, ఏవీఎన్‌ రెడ్డి, పింగిలి శ్రీపాల్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ బిల్లుకు సంబంధించి సూచనలు చేశారు. అనంతరం బిల్లును ఆమోదించినట్లు చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. అంతకుముందు శ్రీధర్‌బాబు తెలంగాణ ప్రజా విశ్వాసం బిల్లును సభలో ప్రవేశపెట్టగా.. ఎలాంటి చర్చ లేకుండానే సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement