చేవ ఉంటే... చావు డప్పెందుకు? | Sakshi Editorial On Revanth Reddy Govt By Vardhelli Murali | Sakshi
Sakshi News home page

చేవ ఉంటే... చావు డప్పెందుకు?

Sep 13 2026 12:21 AM | Updated on Sep 13 2026 12:21 AM

Sakshi Editorial On Revanth Reddy Govt By Vardhelli Murali

జనతంత్రం

స్పీకర్‌ స్థానం అనేది చట్టసభల్లో ఒక సమున్నతమైన గౌరవ ప్రదమైన రాజ్యాంగబద్ధ హోదా. ఈ పదవిని అధిరోహించడానికి సామాజిక, ఆర్థికపరమైన రిజర్వేషన్లేమీ ఉండవు. యోగ్యత, అనుభవం ప్రాతిపదికలపైనే స్పీకర్‌ను ఎన్నుకుంటారని భావిస్తాము. ఆ స్థానంలో కూర్చున్న తర్వాత ఆ వ్యక్తి స్పీకర్‌ మాత్రమే. దళిత స్పీకర్, బీసీ స్పీకర్, ఓసీ స్పీకర్‌ అనే తేడాలుండవు. లోక్‌సభలోనైనా శాసన సభల్లోనైనా సభావ్యవహారాలకు సంబంధించినంత వరకు స్పీకర్‌దే అత్యున్నత స్థానం. సభ్యులందరూ ఆ స్థానాన్ని గౌరవించవలసిందే. ఉన్నత స్థానాలకు చేరుకున్న పీడిత వర్గాల ప్రతినిధుల నుద్దేశించి పదేపదే వారి సామాజిక నేపథ్యాన్ని పదవికి జోడించి పిలవడం కొందరు నాయకులకు ఒక అలవాటుగా మారింది. ఈ మొరటుతనపు సంబోధనల ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలనేది వారి తాపత్రయం. తెలుగుదేశం నాయకుడు గంటి మోహనచంద్ర బాలయోగి గతంలో లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. 

ఒక దళితుడిని ఆ పదవిలో కూర్చోబెట్టామని చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు ఇప్పటికీ వల్లెవేస్తూనే ఉంటారు. కావలి ప్రతిభా భారతి విషయంలో కూడా అంతే. ‘ఎస్‌సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా’ అని ప్రశ్నించిన సామాజిక దృక్పథం కలిగిన వ్యక్తి చంద్రబాబు. కనుక దళిత స్పీకర్, ముస్లిం రాష్ట్రపతి అంటూ పిలవడాన్ని అర్థం చేసు కోవచ్చు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గత సోమ వారం నాడు ప్రారంభమయ్యాయి. కరెంటు కోతలతో రోడ్డెక్కు తున్న రైతుల గుండెమంటలను మరిపించే తీవ్రమైన రాజకీయ వేడిని రగిలించాలని ఎవరు అనుకున్నారోగానీ, ఆ సంకల్పాన్ని మీడియా విజయవంతంగా నెరవేర్చింది. ‘దళిత స్పీకర్‌’ను బీఆర్‌ఎస్‌ అవమానించిందని ముఖ్యమంత్రి సహా మంత్రులు ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో కూడా ‘దళిత స్పీకర్‌’ పదబంధంతోనే దండెత్తారు. చివరకు స్పీకర్‌ కంటతడి పెట్టు కునేదాకా ఈ ప్రసంగాల ధోరణి కొనసాగింది. ఆ రోజు అసలేం జరిగింది? ఎందుకు ఉద్రిక్తతలు తలెత్తాయనే విషయం కంటే ‘దళిత స్పీకర్‌’కు అవమానం అనే పాయింటే మీడియా స్థలాన్ని, సమయాన్ని ఎక్కువగా ఆక్రమించింది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి సోమవారం నాడు సమావేశాలకు హాజరయ్యేందుకు బీఆర్‌ఎస్‌ సభ్యులు నల్లదుస్తులతో అసెంబ్లీ దగ్గరికి చేరుకున్నారు. వారిని అడ్డుకోవడానికి ముందుగానే పెద్ద ఎత్తున పోలీస్‌ బలగాన్ని మోహరించారు. ఎన్నడూ లేనివిధంగా మహిళా పోలీసుల్ని ముందు వరుసలో నిలబెట్టారని బీఆర్‌ఎస్‌ సభ్యులు ఆరోపించారు. నల్ల టీషర్టులపై నినాదాలు రాసి ఉన్నందున మీకు సభలోకి అను మతి లేదని వారిని అడ్డుకున్నారు.

కొద్దిసేపు వాదోపవాదాలు, తోపులాటల తర్వాత హరీశ్‌ రావు, మరికొందరు నినాదాలు వున్న టీషర్టులను విప్పేసి ఇప్పుడు వెళ్లనివ్వండి అసెంబ్లీకి అంటూ ఒత్తిడి పెంచారు. మహిళా కానిస్టేబుళ్ల ఎదుట చొక్కాలు విప్పినందుకు, హరీశ్‌ రావు, కేటీఆర్‌ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల ఆరోపణతో పాటు పలు సెక్షన్లకింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ పక్షం ఎంత ముందస్తు వ్యూహంతో ఉన్నదో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. తోపులాట సందర్భంగా మాజీమంత్రి జగదీశ్‌ రెడ్డిని కిందపడేసి తొక్కారనీ, ఫలితంగా ఆయనకు కొద్దిసేపు ఊపిరాడని పరిస్థితి ఏర్పడిందనీ బీఆర్‌ఎస్‌ ఆరోపించింది. జగదీశ్‌ రెడ్డి విజువల్స్‌ కూడా బయటికొచ్చాయి. ఒక పోలీస్‌ తన ప్యాంట్‌ను పట్టుకొని లాగడంతో ఆవేశపడ్డానని ఎమ్మెల్సీ తాతా మధు చెప్పారు. ‘ఇలా చేయమని స్పీకర్‌ చెప్పారా మీకు’ అంటూ రెండుసార్లు గట్టిగా అడిగిన తర్వాత ఏ ..... చెప్పాడు మీకు అంటూ ఒక రాయకూడని మాటను వాడి నట్టు సమాచారం. ఆ మాటల్ని యథాతథంగా చూస్తే స్పీకర్‌ను ఉద్దేశించినట్టుగా కనిపించదు. కానీ అంతకుముందు స్పీకర్‌ను అన్నారు కనుక ఇది కూడా స్పీకర్‌కే వర్తిస్తుందన్నది కాంగ్రెస్‌ వాదన.

తాతా మధు సామాజిక నేపథ్యాన్నిబట్టి ఫ్యూడల్‌ అహంకారంతో, దళితులంటే చిన్నచూపుతోనే అట్లా మాట్లాడారని కొందరు కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. విద్యార్థిగా వామపక్ష ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న మధుకు ఫ్యూడల్‌ అహంభావం ఉన్నదంటే నమ్మడం కష్టమే. తాతా మధు నిజంగానే అహంభావంతో మాట్లాడి వుంటే అతనిమీద చర్యలు తీసుకోవడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ కేసీఆర్‌ ఆదేశాల మేరకే ‘దళిత స్పీకర్‌’ను దూషించారని ఆరోపిస్తూ ఆయన నివాసముంటున్న వ్యవసాయ క్షేత్రం దగ్గర చావుడప్పు కొట్టాలని కొందరు కాంగ్రెస్‌ నేతలు పిలుపునిచ్చారు. ఒక శాసనసభ్యుడు బహిరంగంగానే తాము కేసీఆర్‌ చావు కోరుకుంటున్నామని చెప్పాడు. కేసీఆర్‌ను కేవలం ఒక రాజకీయ పార్టీ అధ్యక్షునిగానో, మాజీ ముఖ్యమంత్రిగానో, రాజకీయ ప్రత్యర్థిగానో పరిగణిస్తే పప్పులో కాలేసినట్టే. ఇప్పటికీ లక్షలాదిమంది తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ‘తెలంగాణా బాపు’గా పరిగణిస్తారు. వ్యక్తిగతంగా ఆయన్ను కించపరిస్తే మెజారిటీ ప్రజల మనో భావాలు దెబ్బతింటాయి. గత ఎన్నికలకు ముందున్న పరిస్థితి వేరు. ప్రత్యక్ష ప్రజాసంబంధాలకు దూరమై, తెలిసో తెలియకో ఆయన చుట్టూ ఒక ఇనుపకంచె ఏర్పడిన స్థితిలో కేసీఆర్‌ ‘దొరతనం’ మీద కాంగ్రెస్‌ చేసిన ప్రచారం కొన్ని వర్గాల్లో – ముఖ్యంగా యువతలో పనిచేసింది. ఇప్పుడా పరిస్థితి లేదు. పైగా, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డే తనది ఫ్యూడల్‌ కుటుంబమనీ, తమ ఇంటిముందు నుంచి వెళ్లేవాళ్లు చెప్పులు విడిచి నడిచే వారనీ ఒక సందర్భంలో చెప్పుకున్నట్టు గుర్తు.

ఇటువంటి ఫ్యూడల్‌ జ్ఞాపకాల నుంచి ఆయన బయటకు వచ్చి ఉన్నట్లయితే కులంకార్డు ఎత్తుగడలతో కీలక సమస్యలను దారి మళ్లించే ప్రయత్నాలు చేసేవారు కాదు. స్పీకర్‌పై చేసిన వాఖ్యల మీద మధు వివరణ తీసుకొని, తప్పుచేసినట్టు రుజువైతే ఆయనపై చర్యలకు పరిమితం కావాల్సింది. కేసీఆర్‌ నివాసం ముందు చావుడప్పుకు పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసం? అక్కడేం జరిగింది? భువనగిరి, ఆలేరు, దుబ్బాక, సిద్ధిపేట, గజ్వేల్‌ ప్రాంతాలకు చెందిన కొందరు కాంగ్రెస్‌ నాయకులు డప్పు కళాకారులను వెంటబెట్టుకుని కేసీఆర్‌ నివాసానికి సమీపం దాకా వెళ్లారు. ఈ బృందానికి మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, డీసీసీ ఛీఫ్‌ అంక్షా రెడ్డి, స్థానిక నాయకులు నరేందర్‌ రెడ్డి, అశోక రెడ్డి, నాయని యాదగిరి, సర్దార్‌ ఖాన్, రవీందర్‌ రెడ్డి వగైరాలు నాయకత్వం వహించారు. వీరిని కొంతసేపటి తర్వాత పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కేసీఆర్‌ నివాసం సమీపంలో డప్పు కొట్టడాన్ని నిరసిస్తూ కొద్దిమంది బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆ తర్వాత అక్కడ పసుపునీళ్లు చల్లారు. దళితులు ఆందోళన చేసిన చోట పసుపు నీళ్లు చల్లు తారా? ఇది దళిత వ్యతిరేకత కాదా? దీనిపై రాష్ట్ర వ్యాపితంగా ఆందోళన చేస్తామని కాంగ్రెస్‌ నేతలు హెచ్చరిస్తున్నారు. ఆందోళనకు నాయకత్వం వహించి అరెస్టయిన ఆ కాంగ్రెస్‌ నేతలంతా దళితులేనా? కావాలంటే పోలీసు రికార్డులను పరిశీలించు కోవచ్చు. పసుపు నీళ్లు చల్లుతున్న బీఆర్‌ఎస్‌ అభిమానుల ఫొటోలు కూడా మీడియాలో వచ్చాయి. అందులో ఓ పదిమంది ఉన్నట్టున్నారు. వారిలో సిద్ధిపేట బీఆర్‌ఎస్‌ కార్యకర్త దళిత వర్గానికి చెందిన సాయిప్రేమ్‌ కూడా ఉన్నారు. కనుక ఆందోళన చేసిన వాళ్లంతా దళితులు కాదు. పసుపునీళ్ళు చల్లిన వాళ్ళంతా ఆధిపత్య కులాల వాళ్ళు కాదు. చర్య కాంగ్రెస్‌ది, ప్రతిచర్య బీఆర్‌ఎస్‌ది అంతే!

అసెంబ్లీ ముందు జరిగిన ఘటనలో మరో అమానుషమైన ఉదంతాన్ని మరుగు పరిచే  ప్రయత్నం కూడా ఈ చావు డప్పు ఉదంతంలో ఉన్నదేమోననిపిస్తున్నది. అది మరుగున పడకుండా ఉండేందుకు, ఆ విషయంలో న్యాయం జరగాలనే సంక ల్పంతో బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్‌ను, మానవ హక్కుల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. సీనియర్‌ రాజకీయ నాయకురాలు, ఉమ్మడి రాష్ట్రంలోనే తొలి మహిళా హోంమంత్రి, వైఎస్సార్‌కు దేవుడిచ్చిన చేవెళ్ల చెల్లెమ్మగా ప్రసిద్ధురాలైన సబితా ఇంద్రారెడ్డి గొంతు నులిమే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలను, మరో మాజీమంత్రి, సీనియర్‌ శాసన సభ్యులు సునీతా లక్ష్మారెడ్డి చీరను లాగే ప్రయత్నాలకు సంబంధించిన ఫొటోలను ఫిర్యాదులతో జత పరిచినట్టు సమాచారం. ఈ ఫొటోలను చూసిన తర్వాత మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ తీవ్రంగా స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు సమాచారం. 

అసెంబ్లీ వేదికను ఉపయోగించుకొని ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు వారి సమక్షంలోనే ప్రభుత్వం సమాధానం చెప్ప గలిగి ఉంటే ప్రభుత్వానికి అంతో ఇంతో మంచి పేరు వచ్చేది. అట్లా కాకుండా స్పీకర్‌ భుజం మీద తుపాకి పెట్టి ప్రతిపక్షాన్ని తరిమేయడం, ఫ్లాష్‌ సర్వేలో తమకే ఎక్కువ మార్కులు పడ్డాయని సంతోషపడటం వల్ల ప్రయోజనం లేదు. క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కరెంట్‌ సరఫరా సరిపోక పంటలు ఎండిపోతున్నాయి. రైతులు రోడ్లెక్కుతున్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల దాకా ఇస్తు న్నట్టు చెబుతున్నటికీ మధ్యలో బ్రేకులతో ఐదు నుంచి 8 గంటలే కరెంటు ఉంటున్నదని రైతులు వాపోతున్నారు. సబ్‌స్టేషన్లను ముట్టడిస్తున్నారు. 22ఎ నిషేధిత జాబితా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే సుమారు లక్షన్నర డోర్‌ నంబర్లు ఈ జాబితాలో పడిపోయాయని చెబుతున్నారు. వేలాది మంది రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా సరైన సమాధానం చెప్పే నాథుడే కరువయ్యాడు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం నాడు ఇచ్చిన వివరణ ప్రతిపక్షాన్ని కూర్చోబెట్టుకొని ఇవ్వాల్సింది. వారి సవాళ్లను ధీటుగా ఎదుర్కోవలసింది. అలా కాకుండా ఒంటిచేతి చప్పట్లతో ప్రభుత్వానికి కలిగే ప్రయోజనం ఏం ఉంటుంది? జరిగిన పరిణామాలను బట్టి చర్చించే చేవలేకనే చావుడప్పులకు ఒడిగట్టారని ఎవరైనా అనుకుంటే తప్పెలా అవుతుంది?


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement