నిరంకుశత్వంపై ధర్మాగ్రహం | Sakshi Editorial On Allahabad High Court Fires Over illegal cases | Sakshi
Sakshi News home page

నిరంకుశత్వంపై ధర్మాగ్రహం

Sep 10 2026 12:59 AM | Updated on Sep 10 2026 12:59 AM

Sakshi Editorial On Allahabad High Court Fires Over illegal cases

ఒకసారంటూ జనం ఓట్లతో గద్దెనెక్కాక ఇష్టారాజ్యంగా పాలించవచ్చునని భావించే పాలకులకూ, వారి అడుగులకు మడుగులొత్తే ఉన్నతాధికారులకూ అలహాబాద్‌ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు చెంపపెట్టు. అక్రమమో, సక్రమమో... ఒక కేసులో అరెస్టయ్యాక, పాలకులు తల్చుకుంటే ఎన్నాళ్లయినా చెరసాలపాలు కాకతప్పదన్న భయాందోళనలు ప్రజల్లో వ్యాపింపజేయటానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటాయి. ఇటీవలి సంవత్సరాల్లో ఆ జాడ్యం మరింత ముదిరింది. జనాన్ని సంఘటితపరిచే వారితో కఠినంగా వ్యవహరిస్తే ఇతరులు బెదిరిపోతారనీ, అంతా ‘పరిష్కారం’ అవుతుందనీ ప్రభుత్వాలనుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగ న్యాయస్థానాల వైఖరెలా ఉండాలో, ప్రాథమిక హక్కుల అమలుకు ఎంతగా ప్రాధాన్యమివ్వాలో జస్టిస్‌ అతుల్‌ శ్రీధరన్, జస్టిస్‌ అచల్‌ సచ్‌దేవ్‌లతో కూడిన ధర్మాసనం చూపించింది. ఈ నిరసనల్లో పాల్గొన్న న్యాయశాస్త్ర విద్యార్థిని ఆకృతి చౌధరీపైనా, మరికొందరిపైనా మొన్న ఏప్రిల్‌లో జాతీయ భద్రతా చట్టాన్ని (ఎన్‌ఎస్‌ఏ) ప్రయోగించి గౌతమ్‌ బుద్ధనగర్‌ జిల్లాలోని కస్నా జైలుకు పంపారు. తగిన కారణం లేకుండా, ఏకపక్షంగా ఎన్‌ఎస్‌ఏ వంటి కఠినమైన చట్టాన్ని ప్రయోగించటంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసి, ఆమెకు రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలనీ, ఈ మొత్తాన్ని జిల్లా మేజిస్ట్రేట్‌ (కలెక్టర్‌) మొదలు పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జి వరకూ అందరి జీతాల్లోనూ కోతబెట్టి అందించాలనీ ఆదేశించింది. 

కేసు పూర్వాపరాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా పరిసర ప్రాంతాల్లోని ఫ్యాక్టరీ కార్మికులకు రోజూ 10 నుంచి 12 గంటలు పనిచేస్తే నెలకు రూ. 10,000 నుంచి రూ. 13,000 వరకూ వేతనం లభిస్తుంది. హరియాణాలోనూ, దాని పరిధిలోకొచ్చే పొరుగునున్న గురుగ్రామ్‌లోనూ ఈ తరహా కార్మికుల కనీస వేతనాన్ని 35 శాతం పెంచి రూ. 15,000గా నిర్ధారించారు. తమకూ వేతనాలు పెంచాలనీ, అది రూ. 20,000వరకూ ఉండాలనీ నోయిడా కార్మికులు డిమాండ్‌ చేస్తూ నిరసనలకు దిగారు. ఇందులో ఏం వైపరీత్యం ఉంది? వారు డిమాండ్‌ చేసినంతా ఇవ్వటం సాధ్యం కాకపోవచ్చు. చర్చలకు పిలిస్తే కలిగే నష్టమేమిటి? ఈ కార్మికులకు వేతనం ఒక్కటే సమస్య కాదు. నియామక పత్రాలుండవు కనుక అదనపు చాకిరీకి అదనంగా ఏమీ రాదు. వారాంతపు సెలవులుండవు. పీఎఫ్, ఆరోగ్య బీమా వంటివి లేవు. నిర్దిష్టంగా ఒక తేదీకి వేతనాలు, భద్రతా ప్రమాణాలు కనబడవు. 

మహిళా కార్మికుల స్థితి మరింత ఘోరం. కార్మికులకొచ్చే వేతనాల్లో కాంట్రాక్టర్ల అక్రమ కోతలు సరేసరి. 58.2 శాతం మందికి అసలు నియామక పత్రాలే లేవు. 47 శాతం మందికి వేతనంతో కూడిన సెలవు లేదు. అరకొరగానైనా రోజులు గడిచినంత కాలం ఎవరూ ప్రశ్నించలేదు. కానీ గడ్డురోజులు దాపురించాక మౌనంగా ఉండలేకపోయారు. ఇవన్నీ ప్రభుత్వ పెద్దలకు తెలియదని కాదు. అయినా ఎడాపెడా కేసులు పెట్టి జైళ్లకు పంపితే అంతా సమసిపోతుందని భావించారు. ఆకృతి తదితరులు నిరసనలో హింసకు కుట్ర పన్నారని, జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని చెప్పడానికి వాట్సాప్‌ మెసేజ్‌లు లేదా ఇతరత్రా ఆధారాలు చూపలేకపోయారని ధర్మాసనం వ్యాఖ్యానించటం గమనార్హం. న్యాయమైన కోర్కెల్ని శాంతియుతంగా తెలపడానికి శాంతిభద్రతలకు విఘాతం సాకుతో అవకాశం ఇవ్వకపోవటం నిరంకుశ పాలనకు దారితీస్తుందని అభిప్రాయపడింది. విధుల్ని సక్రమంగా నిర్వర్తించే అధికారుల్నీ, పోలీసులనూ జనం దేవతలే అసూయ పడేంతగా నెత్తినపెట్టుకుంటారనీ, అక్రమ చర్యలకు పాల్పడితే అందుకు విరుద్ధమైన ఫలితాలొస్తాయనీ హెచ్చరించింది. 

ఉత్తరప్రదేశ్‌ ఒక్కటే కాదు... పలు రాష్ట్రాల్లో పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలనూ, కార్యకర్తలనూ, సామాజిక మాధ్యమాల బాధ్యులనూ అక్రమ కేసులతో వేధిస్తున్నారు. నెలల తరబడి జైళ్లపాలు చేస్తున్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా మార్పు లేదు. కానీ ఎల్లకాలమూ ఇది సాగదు. ఇదే వరస కొనసాగితే ఏపీలోనూ కఠిన చర్యలు తీసుకునే స్థితి ఏర్పడుతుంది. అప్పుడు పాలకులూ, వారి రెడ్‌ బుక్‌లూ అధికారుల్ని రక్షించటం అసాధ్యం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement