గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మరో పరువు హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రీల్స్‌తో పరువు తీస్తోందని, తండ్రీ కొడుకు కలిసి తమ ఇంటి ఆడబిడ్డను మట్టుబెట్టారు. తొలుత హిట్ అండ్ రన్ కేసుగా భావించి నప్పటికీ అనుమానాస్పద మరణంగా నమోదు చేసుకున్న పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు. కన్న తండ్రి, సోదరుడు కలిసి చేసిన 'పరువు హత్య' గా తేలడంతో కలకలం రేపింది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం బాధితురాలు సోఫియా (22) ఒక ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తోంది. అయితే బైక్ యాక్సిడెంట్ సంఘటనను లోతుగా విచారించగా అసలు విషయం తెలిసి పోలీసులే నివ్వెర పోయారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, హత్య అని పోలీసులు వెల్లడించారు.
సుమారు మూడు నెలల క్రితం సోఫియాకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో సమాజంలో తమ కుటుంబ గౌరవం దెబ్బతింటుందంటూ ఆగ్రహంతో రగిలి పోయిన తండ్రి, కొడుకుతో కలిసి ఆమెను అంత మొందించడానికి కుట్ర పన్నినట్టు నిర్ధారణ అయింది.
ఇదీ చదవండి: ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ ఆత్మహత్మ, సూసైడ్ నోట్
తమ పథకం ప్రకారం తండ్రి మహ్మద్ ఫారూక్, సోదరుడు మహ్మద్ హబీల్ సోఫియాను బైక్‌పై బయటకు తీసుకెళ్లారు. ఘెల్జీపురా గ్రామం వద్ద ఉన్న ఒక నిర్జనమైన బాటలోకి బైక్‌ను మళ్లించి, హబీల్ తన ప్యాంట్‌లో దాచుకున్న సుత్తితో సోఫియా తలపై మూడుసార్లు తీవ్రంగా దాడి చేశాడు. దాడి అనంతరం, ఆమెను తిరిగి ప్రధాన రహదారిపైకి తీసుకొచ్చి, బైక్‌ను ధ్వంసం చేసి తీవ్ర వేగంతో వచ్చిన వాహనం ఢీకొట్టినట్లుగా సీన్ క్రియేట్ చేశారు.
హిట్ అండ్ రన్ కేసుగా భావించి సోఫియాను సోలా సివిల్ ఆసుపత్రికి తరలించగా, మరుసటి రోజు చికిత్స పొందుతూ మరణించింది. వేగంగా వచ్చిన వాహనం వెనుక నుంచి ఢీకొట్టిందని హబీల్ పోలీసులకు చెప్పినప్పటికీ, విచారణలో వారి మర్డర్ ప్లాన్ బయటపడింది. ప్రస్తుతం పోలీసులు నిందితులైన తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకుని, వారిపై హత్య కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: సౌండ్ వద్దు అన్నందుకు మ్యుజీషియన్‌ను కొట్టి చంపేశారు


