న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ కేంద్ర కార్యాలయానికి మొత్తం రూ.1,472.8 కోట్ల నిధులు అందాయి. ఎన్నికల అనంతరం పార్టీ ముగింపు నిల్వ రూ.7,627.2 కోట్లకు చేరింది. మార్చి 15, 2026న ఉన్న రూ.6,722.6 కోట్లతో పోలిస్తే ఇది రూ.904.6 కోట్ల పెరుగుదల. ఈ వివరాలను బీజేపీ.. ఎన్నికల సంఘానికి సమర్పించిన ఎన్నికల వ్యయ, నిధుల నివేదికలో వెల్లడించింది.
రూ.160 కోట్ల ఎన్నికల వ్యయం
అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేంద్ర కార్యాలయంతో పాటు ఆయా రాష్ట్ర, జిల్లా విభాగాలను కలిపి మొత్తం రూ.160 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో అస్సాంలో రూ.96.3 కోట్లు, తమిళనాడులో రూ.51.6 కోట్లు, పుదుచ్చేరిలో రూ.11.9 కోట్లు వ్యయమయ్యాయి. ఈ ఎన్నికల్లో సాధారణ ప్రచారానికి పార్టీ సుమారు రూ.130.4 కోట్లు ఖర్చు చేసింది. పశ్చిమ బెంగాల్, కేరళ ఎన్నికలకు సంబంధించిన వ్యయ వివరాలను మాత్రం ఎన్నికల సంఘం ఇంకా బహిర్గతం చేయలేదు.
అస్సాంలో అధిక వ్యయం
అస్సాంలో బీజేపీ సాధారణ ఎన్నికల ప్రచారానికి రూ.76.7 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో కేంద్ర పార్టీ విభాగం రూ.23.1 కోట్లు, అభ్యర్థులపై రూ.19.5 కోట్లు వ్యయం చేసినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. స్టార్ క్యాంపెయినర్ల ప్రయాణాలకు రూ.27.3 కోట్లు, ప్రకటనలకు రూ.37 కోట్లు, ప్రచార సామగ్రికి రూ.8.9 కోట్లు, రాష్ట్ర విభాగం ఇతర ఖర్చులకు రూ.2.3 కోట్లు ఖర్చయ్యాయి. అభ్యర్థులకు మొత్తం రూ.19.4 కోట్లు చెల్లించగా, వారి నేర చరిత్ర ప్రచురణకు రూ.16.7 లక్షలు వెచ్చించారు.
తమిళనాడులో రూ.51.6 కోట్లు
తమిళనాడులో బీజేపీ మొత్తం రూ.51.6 కోట్లు ఖర్చు చేసింది. సాధారణ ఎన్నికల ప్రచారానికి రూ.44.5 కోట్లు, అభ్యర్థులపై సుమారు రూ.7 కోట్లు వ్యయమయ్యాయి. పుదుచ్చేరిలో మొత్తం ఎన్నికల వ్యయం రూ.11.9 కోట్లుగా నమోదైంది. ఇదిలా ఉండగా ఇదే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ గతంలో సమర్పించిన వ్యయ వివరాల్లో మొత్తం రూ.248.6 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి: ముగ్గురు సన్నిహితులకు ట్రంప్ భారీ నజరానా!


