ముగ్గురు సన్నిహితులకు ట్రంప్‌ భారీ నజరానా! | Trump $135,000 Cash Gifts To Three White House Aides Revealed In Annual Financial Disclosures | Sakshi
Sakshi News home page

ముగ్గురు సన్నిహితులకు ట్రంప్‌ భారీ నజరానా!

Sep 9 2026 9:48 AM | Updated on Sep 9 2026 10:32 AM

Trumps 135000 Holiday Gifts to White House Aides

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తనకు అత్యంత సన్నిహితులైన ముగ్గురు వైట్‌హౌస్‌ సిబ్బందికి చెరో 45 వేల డాలర్ల చొప్పున నగదు బహుమతులు ఇచ్చినట్లు వారి వార్షిక ఆర్థిక వివరాల ద్వారా వెల్లడైంది. ముగ్గురికీ కలిపి ట్రంప్‌ అందించిన బహుమతుల విలువ 1.35 లక్షల డాలర్లు. ఈ మొత్తాలు వారు ప్రభుత్వ ఖజానా నుంచి పొందే వార్షిక 1.50 లక్షల డాలర్ల వేతనాలకు అదనం.

ట్రంప్‌ నుంచి నగదు బహుమతి అందుకున్న వారిలో నటాలీ హార్ప్‌, ఛాంబర్లైన్‌ హారిస్‌, మార్గో మార్టిన్‌ ఉన్నారు. ఈ ముగ్గురూ తమ ఆర్థిక వివరాల్లో చెల్లింపులకు ట్రంప్‌నే మూలంగా పేర్కొన్నారు. ‘హాలిడేస్‌ సందర్భంగా నగదు బహుమతి’గా వాటిని వివరించారు. ట్రంప్‌కు ప్రత్యేక సహాయకురాలు, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌గా హార్ప్‌ పనిచేస్తున్నారు. అధ్యక్షుడి వెంట తరచూ కనిపిస్తూ ఆయన కోసం కథనాలు, సోషల్‌ మీడియా పోస్టులు, ఇతర సమాచారాన్ని ప్రింట్‌ చేస్తుండటంతో ఆమెకు ‘హ్యూమన్‌ ప్రింటర్‌’ అనే పేరు వచ్చింది.

ఓవల్‌ ఆఫీస్‌ కార్యకలాపాల డిప్యూటీ డైరెక్టర్‌, అధ్యక్షుడి ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌గా హారిస్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వాషింగ్టన్‌లో నిర్మాణ, డిజైన్‌ అంశాలను పరిశీలించే ఫెడరల్‌ కమిషన్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లోనూ ట్రంప్‌ ఆమెను నియమించారు. ట్రంప్‌ ప్రతిపాదించిన వైట్‌హౌస్‌ బాల్‌రూమ్‌ ప్రాజెక్టును ఈ కమిషన్‌ పరిశీలిస్తున్న నేపథ్యంలో ఆమె నియామకంపై మాజీ కమిషన్‌ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ట్రంప్‌ కమ్యూనికేషన్స్‌ సలహాదారుగా ఉన్న మార్టిన్‌ కూడా అధ్యక్షుడితో తరచూ ప్రయాణిస్తారు. ట్రంప్‌ మలేషియాలో టార్మాక్‌పై నృత్యం చేస్తున్న దృశ్యాలు, ఓవల్‌ ఆఫీస్‌లో సందర్శకులతో మాట్లాడుతున్న దృశ్యాలు సహా ఆయనకు సంబంధించిన వీడియోలను రికార్డు చేసి ప్రచురిస్తుంటారు.

ఈ నగదు బహుమతులు ఏ పరిస్థితుల్లో ఇచ్చారనే దానిపై ఆర్థిక వివరాల్లో పరిమిత సమాచారం మాత్రమే ఉంది. అయితే ట్రంప్‌ తరఫున వైట్‌హౌస్‌ ప్రతినిధి స్పందిస్తూ.. ప్రభుత్వంలో ఉన్న సమయంలోనూ, ప్రైవేటు రంగంలో ఉన్న సమయంలోనూ తన పరిధిలోని వ్యక్తులు, ఉద్యోగులు, సహాయకులకు క్రిస్మస్‌ బహుమతులు ఇవ్వడం అధ్యక్షుడికి చాలా కాలంగా ఉన్న సంప్రదాయమని తెలిపారు. ఈ బహుమతులకు వారి అధికారిక ప్రభుత్వ విధులతో సంబంధం లేదని, సంబంధిత చట్టపరమైన, నైతిక ప్రమాణాల ప్రకారం అవి అనుమతించదగినవేనని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: ముదిరిన అమెరికా–కెనడా వాణిజ్య యుద్ధం.. సుంకాలకు ప్రతిసుంకాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement