బల్గేరియాకు చెందిన అంధ భవిష్యవేత్త బాబా వంగా 2027 సంవత్సరానికి సంబంధించి చెప్పినట్లు ప్రచారంలో ఉన్న జోస్యం ఒకటి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓ రహస్య వ్యాధి లేదా జన్యుపరమైన ప్రయోగం కారణంగా కొంతమంది మనుషుల్లో మానవాతీత శక్తులు వెలుగులోకి వస్తాయని ఆమె అనుచరులు చెబుతున్నారు. అయితే ఈ జోస్యాన్ని బాబా వంగా నిజంగా చెప్పారనడానికి ఎలాంటి నిర్ధారణ లేదు. భవిష్యత్ సంఘటనలపై బాబా వంగా చెప్పినట్లు ప్రచారంలో ఉన్న పలు జోస్యాలు గతంలో వార్తల్లో నిలిచాయి.
కొవిడ్ మహమ్మారి, 9/11 దాడులు, ప్రిన్సెస్ డయానా మరణం వంటి ఘటనలను ఆమె ముందుగానే ఊహించారని అనుచరులు చెబుతుంటారు. అయితే ఈ ఘటనలకు సంబంధించిన జోస్యాలను ఆమె నిజంగా చెప్పారనడానికి ఎటువంటి అధికారిక ఆధారాలు లేవు. కాగా 2027కు సంబంధించి ప్రచారంలో ఉన్న జోస్యం ప్రకారం.. ఏదో ఒక ప్రయోగం లేదా అనారోగ్యం కారణంగా కొద్దిమంది వ్యక్తులు ‘సూపర్‌హ్యూమన్స్’గా మారతారట. వారి సామర్థ్యాలు ఎలా ఉంటాయి? ఈ పరిణామం ఎలా చోటుచేసుకుంటుంది? అనే విషయాలపై మాత్రం ఎలాంటి వివరాలు లేవు. ఈ జోస్యం నిజమవుతుందా లేదా అనేది భవిష్యత్తులో తేలనుంది.
2026లో ప్రపంచ యుద్ధం, వాతావరణ మార్పులతో ముడిపడిన ప్రకృతి విపత్తులు, సాంకేతికత నుంచి ముప్పు, గ్రహాంతరవాసుల సందర్శన వంటి పరిణామాలను బాబా వంగా ఊహించారని ఆమె అనుచరులు చెబుతున్నారు. తూర్పున ప్రారంభమై పశ్చిమ దేశాలకు విస్తరించే యుద్ధం జరుగుతుందని కూడా ఆమె చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రడామస్ కూడా మూడో ప్రపంచ యుద్ధం గురించి పేర్కొన్నట్లు చెబుతున్నారు.
బాబా వంగా చెప్పినట్లే 2026లో వెనిజులా, కొలంబియా, జపాన్, ఇండోనేషియాలో భారీ భూకంపాలు, ఆగస్టులో నేపాల్, టిబెట్‌లో భారీ వరదలు సంభవించాయని ఆమె అనుచరులు అంటున్నారు. 2026 నవంబరులో భారీ అంతరిక్ష నౌక భూమిని సందర్శిస్తుందని బాబా వంగా చెప్పినట్లు ప్రచారంలో ఉంది. ఒక క్రీడా కార్యక్రమం సందర్భంగా గ్రహాంతరవాసులు వస్తారనే మరో జోస్యం కూడా ప్రచారంలో ఉంది.
ఇది కూడా చదవండి: మోక్షం కోసం చివరి మజిలీ.. ముక్తి భవన్


