మానవాళి ఎరిగిన ఆదిమ కళ సంగీతం. చరిత్రపూర్వయుగంలోనే సంగీతం మొదలైంది. దాదాపు అదే కాలంలో మనుషులు మాటలు నేర్చుకున్నారు. మాటలతో రూపు దిద్దుకున్న భాషలు మానవాళి అనుభవాలకు ఊహలను జోడించి, సాహిత్యాన్ని సృష్టించు కున్నాయి. ఆనంద విషాదాది భావోద్వేగాలను పలికించే స్వరలయలతో రూపుదిద్దుకున్న సంగీతం క్రమంగా శాస్త్రీయతను సంతరించుకుంది. ‘సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం/ ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం’ అనే శ్లోకం ప్రకారం సంగీతం ఆపాత మధురం, సాహిత్యం ఆలోచనామృతం.
సంగీత సాహిత్యాల ప్రస్థానం దాదాపు జమిలిగానే మొదలైనా, స్వభావరీత్యా సంగీ తానికే విస్తృతి, వ్యాప్తి ఎక్కువ. సంగీతంతో సరిపోల్చుకుంటే, సాహిత్యానికి పరిమితులు ఎక్కువ. ‘శిశుర్వేత్తి పశుర్వేత్తి గానరసం ఫణిః/ కో వేత్తి కవితా తత్త్వం శివో జానాతి వా నవా’ అనే శ్లోకం ఉండనే ఉంది. శిశువులు, పశువులు– చివరకు పన్నగాలు కూడా సంగీతానికి ఓలలాడతాయి గాని, సాహిత్య సారమైన కవితా తత్త్వాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడైనా తెలుసుకోగలడో లేడో అనే శంక ఈ శ్లోకం రాసిన పూర్వకవికే ఉండేదంటే, సాహిత్యానికి గల పరిమితి, సంగీతానికి గల విస్తృతి ఎంతటివో తేలికగానే అర్థం చేసుకోవచ్చు.
సంగీతాన్ని ఆస్వాదించడానికి అక్షరజ్ఞానంతో పనిలేదు. సాహిత్య రసాస్వాదనకు అక్షరజ్ఞానం తప్పనిసరి కనీసార్హత. అలాగని లోకంలోని అక్షరాస్యులందరూ సాహిత్యాన్ని ఆస్వాదించగలరనుకుంటే, పొరపాటే! సాహిత్యాన్ని ఆస్వాదించడానికి కించిత్ ఆలోచించే లక్షణం కూడా ఉండాలి. ఆలోచనా సాగరాన్ని మథిస్తేనే తప్ప సాహిత్యామృతం తల కెక్కదు. ఇంతటి ప్రయాస మనకెందుకనే భావనతోనే చదువుకున్న వాళ్లలో కూడా అత్య ధికులు సాహిత్యం జోలికి పోకుండా, నిక్షేపంగా భద్రజీవితం సాగించేస్తుంటారు. అలాంటి భద్రజీవులు కూడా శ్రావ్యమైన సంగీతం వినిపిస్తే, ఆస్వాదించకుండా ఉండలేరు.
సంగీతానికి గల విస్తృతిని గుర్తించిన కవులలో కొందరు వాగ్గేయకారులుగా రాణించారు. తాము రచించిన కృతులను, కీర్తనలను సంగీతాన్ని ఆలంబనగా చేసుకుని జనసామాన్యానికి చేరువ చేశారు. ఇదివరకటి కాలంలో ఈ కోవలోనే మన తెలుగువారైన అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు తదితరులు వాగ్గేయకారులుగా ప్రసిద్ధి పొందారు. ఇటీవలి కాలంలో అమెరికన్ వాగ్గేయకారుడు బాబ్ డిలాన్ సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందాడు. సంగీతాన్ని సాధనంగా మలచుకోవడం వల్లనే వీళ్లంతా జనాలకు అంతగా చేరువ కాగలిగారు.
మానవాళి స్వస్థతకు సంగీత సాహిత్యాలు రెండూ అవసరమే! మనిషికి అక్షరజ్ఞానం, కొంత ఆలోచనా శక్తి ఉన్నప్పుడే సాహిత్యం తన ప్రభావం చూపుతుంది. సంగీతానికి అలాంటి షరతులేవీ లేవు. బేషరతుగానే ప్రభావం చూపిస్తుంది. సాహిత్యం మనిషి ఆలోచనలను వ్యక్తం చేస్తుంది. అవ్యక్తమైన అనుభూతులను వ్యక్తం చేయడానికి సాహిత్యం చాలదు. అలాంటప్పుడు సంగీతమే శరణ్యం. ‘అవ్యక్తాన్ని వ్యక్తం చేయడానికి నిశ్శబ్దం తర్వాత తగిన సాధనం సంగీతం మాత్రమే!’ అన్నాడు ఇంగ్లిష్ తత్త్వవేత్త ఆల్డస్ హక్‌స్లీ. సంగీతంలో మాటలకు మించిన మాయాజాలం ఉంది. అది మాటలకు అందనిది. సాహి త్యంలో ఏ ప్రక్రియలోనైనా మాటలే పనిముట్లు. మాటలు లేకుండా సాహితీ సృజన సాధ్యంకాదు. మాటలు లేకున్నా, సంగీతాన్ని పలికించవచ్చు. ‘మాటలు విఫలమైన చోట సంగీతం మాట్లాడుతుంది’ అన్నాడు డేనిష్ రచయిత హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్.
సంగీత సాహిత్యాలను చికిత్సా పద్ధతులుగా కూడా ఉపయోగిస్తున్నారు. ఈ పద్ధతుల మూలాలు పురాతన నాగరికతల కాలంలోనే ఉన్నా, ఇవి పంతొమ్మిదో శతాబ్దిలో కొంత వ్యాప్తిలోకి వచ్చాయి. మొదటి రెండు ప్రపంచ యుద్ధాల కాలంలో గాయపడిన సైనికుల మానసిక ఆరోగ్యం కోసం ఆస్పత్రుల్లో గ్రంథాలయాలు నిర్వహించేవారు. వారి కోసం సంగీత కచేరీలు నిర్వహించేవారు. కొన్ని సంస్థలు సంగీత సాహిత్య చికిత్స పద్ధతులపై ‘మ్యూజిక్ థెరపీ’, ‘బిబ్లియోథెరపీ’ కోర్సులను కూడా నిర్వహిస్తున్నాయి. కోర్సుల సంగతి ఎలా ఉన్నా, మానవాళి స్వస్థత కోసం సంగీత సాహిత్యాలు రెండింటినీ కాపాడుకోవడం సమాజం బాధ్యత.


