జైశంకర్‌ నిర్మొహమాటం | Sakshi Editorial On External Affairs Minister jaishankar | Sakshi
Sakshi News home page

జైశంకర్‌ నిర్మొహమాటం

Oct 1 2026 3:10 AM | Updated on Oct 1 2026 3:11 AM

Sakshi Editorial On External Affairs Minister jaishankar

సంక్షోభ కాలంలో తటస్థంగా ఉండటం, మర్యాదలు పాటిస్తూ మంచితనం ఒలకబోయటం కుదరదు. అది అవతలిపక్షానికే లబ్ధి చేకూరుస్తుంది. అమెరికా తీరుపై దౌత్య మార్గాల్లో మన దేశం లోగడ అసంతృప్తి తెలిపిందా అన్నది తెలియదుగానీ... తాజాగా విదేశాంగ మంత్రి జైశంకర్‌ నిర్మొహమాటంగా మాట్లాడారు. న్యూయార్క్‌లో సోమవారం జరిగిన ఆసియా సొసైటీ పాలసీ ఇనిస్టిట్యూట్‌(ఏఎస్‌పీఐ) సదస్సులో మన వైఖరేమిటో తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి ఏలుబడిలో కొచ్చాక మనతో తేడాగా ప్రవర్తిస్తున్నారు. భారత్‌వంటి అతి పెద్ద మార్కెట్‌ కావాలి. తన ఉత్పత్తులు నచ్చిన ధరకు విక్రయించుకోవాలి. లాభాలు గడించాలి. అదే సమయంలో పాకిస్తాన్‌తో అంటకాగుతూ, ఆకాశానికెత్తుతారు. దాన్ని బుజ్జగిస్తారు. రోగికి పత్యం రుచించనట్టు మనం చెప్పేది ఆయనకు నచ్చదు. నిజానికి ఇది ట్రంప్‌కు మాత్రమే పరిమితమైన వింత కాదు. ఆయన ముందున్న పాలకులు... వారే పార్టీ వారైనా ఇలాగే ప్రవర్తించారు. కాకపోతే దౌత్య మర్యాదలు పెద్దగా తెలియని, ఖాతరుచేయని మనిషి గనుక ట్రంప్‌ బాహాటంగా ప్రవర్తిస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వంలోని భారత్‌... తనతో కాక నాటి సోవియెట్‌ యూనియన్‌తో సన్నిహితంగా మెలగటం అమెరికాకు కంటగింపైంది. అందుకు విరుగుడుగా పాకిస్తాన్‌ను చేరదీసింది. భారత్, పాక్‌మధ్య జరిగిన నాలుగు ప్రధాన యుద్ధాల్లోనూ, ఘర్షణల్లోనూ దాని పరోక్ష హస్తం ఉంది. నిజమైన మిత్రదేశంతో ఎలా మెలగాలో అమెరికాకు ఏనాడూ తెలియదు.

ఉగ్రవాదంలో పాకిస్తాన్‌ పాత్రపై స్పష్టమైన సమాచారం ఉన్నా కంటితుడుపు చర్యగా దానికి విడుదల చేయాల్సిన నిధుల్ని ఆపినట్టు నటించటం, కొన్నాళ్లకే ఏదో ఒక సాకుతో విడుదల చేయటం దశాబ్దాలుగా రివాజైంది. ఆయుధ సామగ్రి విషయంలోనూ అంతే. ఉగ్రవాద చేష్టలతో ఆర్థికవ్యవస్థ సర్వనాశనమై దివాళా స్థితిలో పడిన పాకిస్తాన్‌ను ఆర్థికంగా ఆదుకోవాల్సిందే. కానీ అందుకు షరతులుండాలి. ఆ నిధుల్ని ఉగ్రవాదానికి ఊతమందించటానికి మళ్లించకూడదు. ఇందువల్ల మనకొస్తున్న ఇబ్బందులేమిటో అమెరికాకు పట్టదు. అలాగే వాణిజ్య ఒప్పందం పేరిట తాను విధించే షరతులు స్థానిక వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చేకూర్చగల నష్టం దానికి లెక్కలేదు. ఈ విషయంలో భారత్‌ అభ్యంతరాలు ఆయన బేఖాతరు చేస్తారు. అంతా తన నిర్దేశానుసారం అమలు కావాల్సిందేనన్నది ట్రంప్‌ పట్టుదల. వాణిజ్య ఒప్పందం ఖరారైపోయిందంటూ పలుమార్లు ఆయన ఏకపక్షంగా ప్రకటించారు. మొన్న ఫిబ్రవరిలో సైతం ఇక సంతకాలే తరవాయి అన్నారు. కానీ భారత్‌నుంచి స్పందన లేకపోవటంతో అదనపు సుంకాలు విధించారు. ఈ బాపతు సుంకాలకు కోర్టులో చుక్కెదురైంది. కానీ అధిక సుంకాల పాటపాడుతూ బెదిరించడం మానుకోలేదు. మరోపక్క ఉగ్రవాదంవల్ల భారత్‌ నష్టపోతున్న వైనం తెలిసినా పాక్‌ను కట్టడి చేయరు. మనపట్ల సహానుభూతి చూపటం ధర్మమనుకోరు.

భారత్‌–పాక్‌ల వైరం సంగతలా వుంచి ప్రపంచం ఇంతటి సంక్లిష్ట స్థితికి చేరుకోవటంలో అమెరికా పాత్ర ఎవరికీ తెలియంది కాదు. ఇరాన్‌పై అమెరికా దుందుడుకు చర్యలవల్ల హార్మూజ్‌ జలసంధిలో రవాణా నిలిచిపోయింది. ఉక్రెయిన్‌ను యూరప్‌ దేశాలద్వారా రెచ్చగొట్టి రష్యాను యుద్ధంలోకి నెట్టింది కూడా అమెరికాయే. ఈ రెండు పరిణామాల కారణంగా అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బతింది. ముడి చమురు, ఎరువులు, ఆహార ధాన్యాల రవాణా నిలిచిపోయి ప్రపంచ దేశాలన్నీ సంక్షోభంలో పడ్డాయి. చాలా దేశాల ఆర్థికవ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనికి సూపర్‌ ఎల్‌నినో రూపంలో వచ్చిపడిన ప్రకృతి వైపరీత్యాలు తోడవుతున్నాయి. అందుకే రానున్న కాలంలో ప్రపంచ ప్రజలు కనీవినీ ఎరుగని పెను సంక్షోభం ఎదుర్కొనబోతున్నారని జైశంకర్‌ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమెరికాకు నేరుగా మన అసంతృప్తి తెలియజేయటం, చేస్తున్న తప్పుల్ని దిద్దుకోమని చెప్పటం... ప్రపంచం మునుపట్లా లేదని, ఏకచ్ఛత్రాధిపత్యం రోజులు అంతరించాయని చెప్పడం అత్యవసరం. దీన్ని సకాలంలో నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, తడబాటులేకుండా తెలిపినందుకు ఆయన్ను అభినందించాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement