సుందర్‌.. ఈయనో రాక్షసుడు! ఎవరికీ తెలియదు: ట్రంప్‌ | Sundar Pichai Is a Monster: Trump's Remark, Pichai's Funny Reply Go Viral | Sakshi
Sakshi News home page

సుందర్‌.. ఈయనో రాక్షసుడు! ఎవరికీ తెలియదు: ట్రంప్‌

Sep 30 2026 10:42 AM | Updated on Sep 30 2026 10:55 AM

Sundar Pichai Is a Monster: Trump's Remark, Pichai's Funny Reply Go Viral

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ మధ్య వైట్‌హౌస్‌ వద్ద జరిగిన సరదా సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టెక్‌ దిగ్గజాలతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్‌.. పిచాయ్‌ను ఉద్దేశించి “ఈయనో మాన్‌స్టర్‌.. కానీ ఎవరికీ తెలియదు” అంటూ వ్యాఖ్యానించారు. దీనికి సుందర్‌ పిచాయ్‌ కూడా ఒక్క నవ్వు నవ్వి బదులిచ్చారు.

వైట్‌హౌస్‌ వద్ద మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ట్రంప్‌.. పిచాయ్‌ను పిలిచి “సుందర్‌.. ఏమైనా చెబుతావా?” అని అడిగారు. పిచాయ్‌ “ముందుగా థ్యాంక్స్‌...” అని చెప్పబోతుండగానే ట్రంప్‌ ఆయనకు అడ్డుపడ్డారు. “వీళ్లెవరో మీకు అసలు తెలియదు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన వ్యక్తులు వీళ్లు. ఈయన (సుందర్‌ పిచాయ్‌) ఓ మాన్‌స్టర్‌(రాక్షసుడు).. కానీ ఎవరికీ ఈ విషయం తెలియదు” అని ట్రంప్‌ అన్నారు. అంతేకాదు.. ఇలాంటి టెక్‌ దిగ్గజాలకు ప్రతిరోజూ మీడియాతో మాట్లాడాల్సిన అవసరం లేకపోవడం ఎంత మంచి జీవితమో అంటూ వ్యాఖ్యానించారు.

“మీకు గుర్తుండాల్సిన పేరు ఒక్కటే.. సుందర్‌” అని పిచాయ్‌ను ఉద్దేశించి ట్రంప్‌ అన్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలకు పిచాయ్‌ అలా ఒక నవ్వు నవ్వి సరదాగా స్పందించారు. “నేను మాన్‌స్టర్‌ని అన్నదానికంటే ఇది మంచి ట్యాగ్‌లైన్‌ అవుతుందని ఆశిస్తున్నా” అంటూ అక్కడ నవ్వులు పూయించారు.

ట్రంప్‌ భేటీ సారాంశం ఏంటంటే..
వైట్‌హౌస్‌లో ట్రంప్‌.. సుందర్‌ పిచాయ్‌తో పాటు మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌, ఆంత్రోపిక్‌ సీఈవో డారియో అమోడీ, ఎన్విడియా సీఈవో జెన్సెన్‌ హువాంగ్‌, ఓపెన్‌ఏఐ ప్రెసిడెంట్‌ గ్రెగ్‌ బ్రాక్‌మన్‌ తదితర టెక్‌ రంగ ప్రముఖులతో సమావేశమయ్యారు. అధునాతన ఏఐ వ్యవస్థల భద్రత, కంపెనీల అంతర్గత నియంత్రణలు, ప్రమాదాల పర్యవేక్షణ తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ‘వైట్‌హౌస్‌ అకార్డ్‌ ఆన్‌ సూపర్‌ ఇంటెలిజెన్స్‌’ పేరుతో స్వచ్ఛంద ఒప్పందాన్ని ప్రకటించారు. ఇందులో ఏఐ మోడళ్లపై అంతర్గత రిస్క్‌ సమీక్షలు, స్వతంత్ర ఆడిట్లు, కంపెనీ బోర్డుల పర్యవేక్షణ వంటి చర్యలు ఉన్నాయి. ఇది ప్రభుత్వ చట్టబద్ధ నియంత్రణ కాకుండా కంపెనీలు స్వచ్ఛందంగా పాటించే భద్రతా ప్రమాణాల ఒప్పందం.

అమోడీకి ట్రంప్‌ వార్నింగ్‌?
సమావేశంలో ఆంత్రోపిక్‌ సీఈవో డారియో అమోడీ(Dario Amodei)తోనూ ట్రంప్‌ సరదాగా మాట్లాడారు. అమోడీని తన పక్కకు పిలిచిన ట్రంప్‌.. “ఆయన ఓకే అని మాత్రమే చెప్పారు” అంటూ వ్యాఖ్యానించి, వెంటనే “బీ కేర్‌ఫుల్‌” అని హెచ్చరించినట్లు నవ్వుతూ చెప్పారు.

అధునాతన ఏఐ వల్ల మానవాళికి ప్రమాదాలు ఉండొచ్చని అమోడీ గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ట్రంప్‌ ఈ సరదా వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అమోడీ కూడా నవ్వుతూ.. ఏఐ రేసులో అమెరికా ముందుండాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో టెక్నాలజీని సురక్షితంగా అభివృద్ధి చేసేందుకు అందరూ కలిసి పనిచేయాలని చెప్పారు.

‘సూపర్‌ ఇంటెలిజెన్స్‌’పై పిచాయ్‌ ఏమన్నారంటే..
ఏఐకి సూపర్‌ ఇంటెలిజెన్స్‌గా ట్రంప్‌ నామకరణం చేసిన సంగతి తెలిసిందే. సమావేశం అనంతరం పిచాయ్‌ సోషల్‌ మీడియాలో స్పందిస్తూ.. ట్రంప్‌, ఇతర టెక్‌ నాయకులతో ముఖ్యమైన చర్చ జరిగిందని, వైట్‌హౌస్‌ అకార్డ్‌ ఆన్‌ సూపర్‌ ఇంటెలిజెన్స్‌పై సంతకం చేసినట్లు తెలిపారు. ఏఐ అభివృద్ధిలో తగిన పరీక్షలు, మూల్యాంకనాలు, రెడ్‌ టీమింగ్‌, దుర్వినియోగం నివారణకు భద్రతా చర్యలను కొనసాగిస్తామని చెప్పారు. ఈ రంగంలో ఆవిష్కరణలు కొనసాగిస్తూనే బాధ్యతాయుతమైన అభివృద్ధి, భద్రతా ప్రమాణాల విషయంలో ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తామని పిచాయ్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఏఐకి కొత్త పేరు పెట్టిన ట్రంప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement