అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అమెరికా ప్రభుత్వ అధికారిక వ్యవహారాల్లో ‘కృత్రిమ మేధ’(అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ) అనే పదానికి బదులుగా ‘సూపర్ ఇంటెలిజెన్స్’ అనే పదాన్ని ఉపయోగించాలని ఆదేశించారు. ఈ మేరకు సెప్టెంబర్ 29న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. ‘కృత్రిమ’ అనే పదం ఈ సాంకేతికత సామర్థ్యాన్ని సరిగ్గా ప్రతిబింబించడం లేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ఈ నిర్ణయానికి ముందు శ్వేతసౌధంలో ప్రపంచంలోని ప్రముఖ సాంకేతిక సంస్థల అధిపతులతో ట్రంప్ సమావేశమయ్యారు. మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్, ఎన్విడియా అధినేత జెన్సన్ హువాంగ్, ఆంథ్రోపిక్ అధినేత డారియో అమోడెయి, ఓపెన్‌ఏఐ అధ్యక్షుడు గ్రెగ్ బ్రాక్‌మన్, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల, గూగుల్ అధినేత సుందర్ పిచాయ్, ఎలాన్ మస్క్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. అత్యాధునిక సాంకేతికత అభివృద్ధి, భద్రత, భవిష్యత్ నియంత్రణలపై ఈ సమావేశంలో చర్చించారు.
🇺🇸 Rarely has there been a White House table like this one. Elon on Trump's left, Jensen Huang on his right, with Zuckerberg, Pichai, Bezos and other AI builders around them.
Trump's message was simple: "We have a very big lead, and we're gonna keep our lead."
He called AI…— Edison (@Edison_TechAI) September 29, 2026
కంపెనీలే భద్రత చూసుకోవాలి
సమావేశం అనంతరం ట్రంప్, టెక్ సంస్థల అధినేతలు ఒక స్వచ్ఛంద భద్రతా ఒప్పందాన్ని ప్రకటించారు. దీనిని ట్రంప్ ‘నైతికంగా కట్టుబడి ఉండే ఒప్పందం’గా అభివర్ణించారు. దీని ప్రకారం సంస్థలు తమ సాంకేతిక వ్యవస్థలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి. అంతర్గత నియంత్రణలు ఏర్పాటు చేసుకోవడంతోపాటు స్వతంత్ర, బాహ్య సంస్థలతో భద్రతా తనిఖీలు చేయించుకోవాలి. సంస్థల పాలక మండళ్లు కూడా ఈ వ్యవస్థల భద్రతను పర్యవేక్షించాల్సి ఉంటుంది.
ఇది చట్టం కాదు.. స్వచ్ఛంద ఒప్పందమే
టెక్ సంస్థలు అంగీకరించిన ఈ పత్రానికి ప్రస్తుతం చట్టబద్ధమైన అమలు బలం లేదు. అంటే నిబంధనలు పాటించకపోతే వెంటనే శిక్షించే విధానం ఇందులో లేదు. అయితే సైబర్ భద్రత, జీవ భద్రత, రసాయన సంబంధిత ప్రమాదాలు వంటి అంశాల్లో ప్రమాదాలను గుర్తించి నియంత్రించేందుకు సంస్థలు చర్యలు తీసుకోవాలని ఒప్పందం సూచిస్తోంది. భవిష్యత్తులో అవసరమైతే వీటిలో కొన్ని అంశాలను చట్టాలుగా మార్చే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు.
US President Donald Trump, Meta CEO Mark Zuckerberg, Google CEO Sunder Pichai, Elon Musk and other tech giants brief media after meeting on Super Intelligence pic.twitter.com/dcLpatwSxl
— ANI (@ANI) September 29, 2026
ప్రభుత్వ నియంత్రణ వద్దు..
కృత్రిమ మేధ రంగంపై కొత్తగా కఠినమైన సమాఖ్య నిబంధనలు తీసుకురావడం కంటే కంపెనీలే తమను తాము పర్యవేక్షించుకోవాలన్న వైఖరిని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఉన్న చట్టాలు, ప్రభుత్వ సంస్థల ద్వారా అవసరమైన చర్యలు తీసుకోవచ్చని ఆయన అన్నారు. అమెరికా సాంకేతిక రంగంలో చైనా కంటే ముందంజలో ఉండాలంటే అభివృద్ధిపై అధిక నియంత్రణలు విధించడం సరికాదన్నది ట్రంప్ వైఖరి.
డేటా కేంద్రాలకు భారీ ప్రోత్సాహం
అత్యాధునిక సాంకేతికత అభివృద్ధికి భారీ కంప్యూటింగ్ సామర్థ్యం అవసరం. ఇందుకోసం డేటా కేంద్రాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ట్రంప్ కోరుతున్నారు. అయితే ఈ కేంద్రాలు పెద్ద మొత్తంలో విద్యుత్‌ను వినియోగిస్తాయి. దీంతో విద్యుత్ డిమాండ్ పెరగడం, స్థానిక మౌలిక వసతులపై ఒత్తిడి రావడం, ప్రజలకు విద్యుత్ ఖర్చులు పెరిగే అవకాశం ఉండటంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. డేటా కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రాంతాలకు టెక్ సంస్థలు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని ట్రంప్ సూచించారు.
పది మందితో ప్రత్యేక కమిటీ?
సూపర్ ఇంటెలిజెన్స్ రంగాన్ని పర్యవేక్షించేందుకు దాదాపు పది మందితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే ఆ కమిటీలో ఎవరుంటారు? దానికి ఎలాంటి అధికారాలు ఉంటాయి? అన్న దానిపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. అమెరికా సాంకేతిక ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ఈ రంగంలో వేగంగా అభివృద్ధి అవసరమని ట్రంప్ చెబుతున్నారు.
భద్రతపై మాత్రం ఆందోళనలు
అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు కొన్ని సందర్భాల్లో వాటికి నిర్దేశించిన పరిమితులను దాటి పనిచేసే అవకాశం ఉందన్న ఆందోళనలు ఇప్పటికే ఉన్నాయి. సైబర్ దాడులు, జీవ భద్రత, రసాయన ప్రమాదాలు వంటి అంశాల్లో ఈ సాంకేతికతను దుర్వినియోగం చేసే అవకాశాలపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో అమెరికా ఇప్పుడు అభివృద్ధి వేగాన్ని పెంచడంతోపాటు భద్రతా నియంత్రణలను ఎలా బలోపేతం చేయాలి అన్న సవాల్‌ను ఎదుర్కొంటోంది.
ఇదీ చదవండి: మొరాకోకు తొలి మహిళా ప్రధాని! ఈ ఫాతిమా ఎవరంటే..


