18 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రణాళికలు
2030లో ఉత్పత్తి ప్రారంభం..
యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి
వాషింగ్టన్: భారతీయ వ్యాపార దిగ్గజం ఎస్సార్ గ్రూప్ అమెరికాలో భారీ ఉక్కు ప్లాంటు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం దాదాపు 18 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.72 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టనుంది. ఎస్సార్‌లో భాగమైన మెసాబీ మెటాలిక్స్ ఈ మేరకు ఇన్వెస్ట్ చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ప్రణాళికల్లో భాగంగా అయోవా రాష్ట్రంలో 15 బిలియన్ డాలర్లతో స్టీల్ కాంప్లెక్స్‌ను, 3 బిలియన్ డాలర్లతో మినెసోటాలో ముడి ఇనుము గని, పెలెట్ల ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
‘అమెరికా చరిత్రలోనే ఇది అతి పెద్ద ఉక్కు ప్లాంటు’గా ఉంటుందన్నారు. ఎస్సార్ గ్రూప్ వ్యవస్థాపకుడు, వైస్ చైర్మన్ రవి రూయా, ఆయన కుమారుడు.. మెసాబీ మెటాలిక్స్ చైర్మన్ రేవంత్ రూయాతో కలిసి ట్రంప్ ఈ మేరకు ప్రకటించారు. ’అమెరికా ఉక్కు రంగానికి, మా సంస్థకు ఇదొక కీలక మైలురాయి. మేము సమగ్ర ఉక్కు వ్యాపారాన్ని నిర్మిస్తున్నాం. మినెసోటాలోని ముడి ఇనుమును అయోవాలో ప్లాంటుతో అనుసంధానించడం ద్వారా 100 శాతం అమెరికన్ ఉక్కును ఉత్పత్తి చేస్తాం’ అని రేవంత్ రూయా ఈ సందర్భంగా చెప్పారు. భారత్, అమెరికా మధ్య ఆర్థిక బంధాలు బలోపేతం కావడానికి కూడా ఈ పెట్టుబడులు దోహదపడతాయని రవి రూయా పేర్కొన్నారు.
దేశీయంగా పరిశ్రమకు ఊతమిచ్చే లక్ష్యంతో ఉక్కు దిగుమతులపై ట్రంప్ 50% టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో ఎస్సార్ గ్రూప్ పెట్టుబడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘టారిఫ్‌లు కట్టడం ఇష్టం లేక ఇప్పుడు అందరూ ఇక్కడ ప్లాంట్లు నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారు’ అని ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు.
10 మిలియన్ టన్నుల సామర్థ్యం..
వైట్‌హౌస్, మినెసోటా కేంద్రంగా పనిచేసే మెసాబి మెటాలిక్స్ వర్గాల ప్రకారం ప్రతిపాదిత ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 10 మిలియన్ టన్నులుగా ఉంటుంది. 2030 నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఫ్యాక్టరీలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాక కనీసం 1,750 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 8,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని కంపెనీ తెలిపింది.
కార్యకలాపాలు ప్రారంభించిన తొలి పదేళ్లలో 95 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక కార్యకలాపాలకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. మినెసొటా గని నుంచి ఏటా 7.5 మిలియన్ టన్నుల ముడి ఇనుము ఉత్పత్తి అవుతుందని, పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభమయ్యాక 350 మందికి ఉద్యోగాల కల్పన జరుగుతుందని వివరించింది. ఇది అమెరికాలో గత 50 ఏళ్లలో నిర్మించిన తొలి గని కానుంది. 1969లో భారత్‌లో ఏర్పాటైన ఎస్సార్ గ్రూప్‌నకు మెటల్స్, మైనింగ్, ఎనర్జీ, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, రిటైల్ తదితర రంగాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా 30 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేసింది.


