వాషింగ్టన్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్
విశ్లేషణ
అమెరికా, చైనాల దీర్ఘకాలిక ప్రత్యర్థిత్వం ఎట్లున్నా, ప్రస్తుతానికి నదిని ప్రశాంతంగా ఉంచి అందులో పడవ ప్రయాణం ప్రశాంతంగా సాగించాలన్నది ఇరువురి వ్యూహం. రెండు దేశాల అధ్యక్షులు గత మే నెలలో బీజింగ్‌లో సమావేశమై నప్పుడు చూపిన ఈ వైఖరులే గత వారాంతంలో వాషింగ్టన్‌లో కూడా కనిపించాయి. సారాంశంలో అంతకుమించిన కొత్తదన మేమీ లేదు. దాని అర్థం ఈ రెండు శిఖరాగ్ర సమావేశాలు నిష్ఫలమైనవని కాదు. వాటికి అనేక ఫలితాలు వర్తమానంలో ఉండటమే కాదు. భవిష్యత్తులోనూ ఉంటాయి.
పోరు నష్టం పొందు లాభం
ఇటువంటి దృక్పథానికి చొరవ తీసుకుని అమెరికా అధ్యక్షునికి ప్రతిపాదిస్తున్నది చైనా అధ్యక్షుడు కాగా, అందుకు ట్రంప్ బీజింగ్‌లో అర్ధాంగీకారం తెలిపి ఇపుడు వాషింగ్టన్ చర్చలలో పూర్తిగా సమ్మతించినట్లు కనిపిస్తున్నది. ఆ మేరకు పత్రాలు అయితే ఏమీ రాసుకోలేదు గానీ, ఇరువురి వ్యాఖ్యలను పరిశీలించినపుడు అందులో సందేహ మేమీ తోచటం లేదు. మనం సహకరించుకుంటే ఇద్దరమూ లాభ పడతామని జిన్‌పింగ్ గత మే నెలలో వలెనే ఈసారి కూడా సూచించారు. ఘర్షణ పడితే ఉభయులమూ నష్టపోగలమని హెచ్చరించారు. అందుకు ట్రంప్ స్పందన గమనించదగ్గది. చారిత్రకంగా అమెరికా, చైనాలు రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రత్యర్థులను ఓడించాయనీ, అదే విధమైన పరస్పర సహకారంతో ముందుకు సాగి అభివృద్ధి సాధించగలమనీ అన్నారాయన. రెండు దేశాలు కూడా ఆ విధంగా తమ ప్రజల మేలుకు, ప్రపంచం బాగుకు కృషి చేయ వచ్చునని ఇరువురూ అభిప్రాయపడ్డారు.
ఇవి సంబంధాలను స్థూలంగా నిర్దేశించే మౌలిక వైఖరులు. తక్కిన పలు విధాలైన మాటలన్నీ ఈ పరిధిలోకి ఒదిగిపోయేవే. ఉదాహరణకు, మనం అభివృద్ధిలో పోటీదార్లమే గానీ శత్రువులం కాము, మన మధ్య నిర్మాణాత్మకమైన, వ్యూహాత్మకమైన సుస్థిరత అవసరం. లేనట్లయితే విస్ఫోటనాత్మకమైన ఘర్షణ తలెత్తుతుంది వంటివి. అయితే, ఇటువంటి సామరస్యతను చూపుతూనే చైనా అధ్యక్షుడు, ఆయన సీనియర్ అధికారులు అమెరికాకు కొన్ని హెచ్చరికలను సూటిగా చేశారు. గతం నుంచి చేస్తూ వచ్చినవే ఇపుడు మరొకసారి చేశారు. వాటిని వారు ‘రెడ్ లైన్స్’ అంటున్నారు.
రెడ్ లైన్స్
వాటిలో అన్నింటికన్న మొదటిది తైవాన్. ఆ విషయంలో తేడాలు వస్తే అమెరికాతో ‘ఏ యుద్ధానికైనా సిద్ధ’మని జిన్‌పింగ్ గత బీజింగ్ సమావేశంలోనే ట్రంప్‌కు స్పష్టం చేయటం తెలిసిందే. అందువల్లనే ట్రంప్ స్వదేశానికి తిరిగి వెళుతూ, తాము అమెరికా నుంచి 9,500 మైళ్లు ప్రయాణించి చైనాతో యుద్ధం చేయలేమ న్నారు. తైవాన్‌కు 14 బిలియన్ డాలర్ల ఆయుధాల విక్రయాన్ని రద్దు చేయలేదు గానీ నిరవధికంగా నిలిపి వేశారు. తైవాన్ స్వాతంత్య్రాన్ని బలపరచబోమని మరొకమారు సూచించారు. అయితే వాషింగ్టన్ శిఖరాగ్రంలో చైనా అధ్యక్షుడు కోరింది, స్వాతంత్య్రాన్ని కేవలం బలపరచకపోవటం కాదు వ్యతిరేకించాలని. ఆయుధ విక్రయాలను రద్దు చేయాలని. ఇందుకు ట్రంప్ స్పందన తెలియదుగానీ, చైనాతో బేరసారాలకు ఇదొక కార్డుగా ఉపయోగపడుతుందన్నారు.
ఇరువురు నేతల మధ్య వాషింగ్టన్‌లో గత మే నెల కన్నా
భిన్నంగా చర్చకు వచ్చిన అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఒక్కటే. ఈ విషయమై రెండు దేశాల వైఖరులు పూర్తి భిన్నంగా ఉన్నట్లు ముందునుంచే స్పష్టమైంది. ఇపుడు ఏకాభిప్రాయం రాగలదని ఎవరూ ఆశించలేదు. రాలేదు కూడా. రాగల కాలంలో ఏఐ వల్ల అనూహ్యమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, కనుక అందులో పైచేయి సాధించాలి తప్ప ఎటువంటి నియంత్రణలకు అంగీకరించరాదన్నది ట్రంప్ ప్రభుత్వ విధానం. నియంత్రణలు లేని ఏఐ వల్ల పొంచి ఉన్న ప్రమాదాలు కూడా అనూహ్యమైనవేనని సాక్షాత్తూ అమెరికన్ నిపుణులు, ఏఐ సంస్థలు హెచ్చరిస్తున్నా, ఆధిపత్య అన్వేషణలో మంచి చెడులను ఆలోచించని ఆయన దేనినీ లెక్క చేయటం లేదు. ఏఐ అభివృద్ధిలో చైనాతో ఏర్పడిన గట్టి పోటీ అందుకు తోడవుతున్నది. ఏఐతో అందరం లాభపడాలని, అదే సమ యంలో నష్టాల నివారణకు ఉమ్మడి నియంత్రణలు అవసరమన్న చైనా అధ్యక్షుని ప్రతిపాదనను ట్రంప్ ప్రస్తుత చర్చలలో అంగీకరించక పోవటానికి కారణం కూడా అదే. వైట్ హౌస్ విందుకు హాజరైన టెక్ దిగ్గజాలు రాగల రోజులలో తీసుకోగల వైఖరి ఏమిటన్నది ప్రపంచం తగినంత ఆందోళనతోనే ఎదురుచూస్తుందనాలి.
జీ–2
ఇతర విషయాలకు వస్తే, రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధ మంటున్న దానికి బీజింగ్‌లో కుదిరిన యుద్ధ విరామం ఈ నవంబర్‌లో ముగియనుండగా దానిని మరో నెలలు జనవరి వరకు పొడి గించుకున్నారు. ఇందులో పెద్ద విశేషం లేదు. అమెరికా తీవ్రమైన వాణిజ్య లోటులో ఉన్నందున దానిని భర్తీ చేసుకునేందుకని చెప్తూ, చైనా సహా అన్ని దేశాలపై యథేచ్ఛగా సుంకాల పెంపు, అందుకు ఎదురు వ్యూహంగా చైనా ప్రభుత్వం తన సుంకాలు పెంచటం, అమెరికా నుంచి కొనుగోళ్లు తగ్గించటం, ముఖ్యంగా అతి కీలకమైన ఖనిజాల ఎగుమతిని నియంత్రించటం వంటి చర్యలు తెలిసినవే. చర్చల ద్వారా ఇందులో చేసుకుంటూ వస్తున్న సర్దుబాట్లను ఇపుడు రెండు నెలలు పొడిగించుకున్నారు. అంతకన్న గత్యంతరం లేదు కూడా. తమ ప్రయోజనాల కోసం ఇతర దేశాలను చతురోపాయాల ద్వారా లొంగదీసుకునే కాలం అమెరికా సహా పాశ్చాత్య కూటమికంతా మెల్లగా గతించిపోతున్నది. చైనా వంటి ‘సమ ఉజ్జీ’ (ఇది పాశ్చాత్యుల పద ప్రయోగమే)తోనైతే వీలు పడేదే కాదు.
చివరిగా రెండు ముఖ్య విషయాలు చెప్పుకోవాలి. ఒకటి, ఈ విధమైన ప్రశాంత ప్రయాణం అమెరికా కన్న చైనాకు ఎక్కువ అవ సరం. పాశ్చాత్య దేశాలకు ఆధిపత్య సాధనలు, యుద్ధాలు, నష్టాలు, తిరిగి కోలుకోవటాలు చరిత్ర పొడవునా ఉన్నవే. అదే క్రమంలో వారు వర్తమానంలోనూ యుద్ధాలు సాగిస్తున్నారు. మునుముందు కూడా చేస్తారు. అందుకు చైనా, రష్యాలు మినహాయింపు కాగలవని ఎవరూ శిలాక్షరాలు రాయలేరు. చైనా పరిస్థితి అది కాదు. నల్ల మందు యుద్ధాల (1839) కాలం నుంచి విప్లవం (1949) వరకు వందేళ్లపాటు విదేశీ ఆక్రమణలకు, తీవ్ర నష్టాలకు గురైనందున ఇక మీదట అటువంటి పరిస్థితులు ఎదురు కాకుండా కేవలం అభివృద్ధి పైన దృష్టిని కేంద్రీకరించాలన్నది వారి ఆలోచన. అందుకోసం అమె రికా అనే గాక సాధారణ రూపంలోనే ప్రశాంతమైన నది, ప్రశాంత మైన పడవ ప్రయాణం వారి ప్రణాళిక. ఇది ఒక విషయం కాగా రెండవది, అమెరికా చైనాల శాంతియుత సహజీవన ప్రభావాలు వారిద్దరిపైనే గాక ప్రపంచ వ్యాప్తంగా, ఆసియా, పసిఫిక్ సహా అనేక ప్రాంతాలపై గణనీయంగా ఉండనున్నాయి. ఆ విధంగా వారి సంబంధం అధికారికంగా జీ–2గా మారకపోయినా, అనధికారికంగా అదే పాత్ర నిర్వహిస్తుంది.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


