జపాన్‌లోని క్యోటో విశ్వవిద్యాలయం స్నాతకోత్స వంలో 2026 బ్యాచ్ పట్టభద్రులను ఉద్దేశించి ఆ యూనివర్సిటీ ప్రెసిడెంట్, ఇమ్యునాలజిస్ట్ నగహిరో మినాటో ప్రసంగం సంక్షిప్త పాఠం:
విశ్వగురు
ముందుగా, ఈ రోజు పట్టభద్రులవుతున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు. 1900లో క్యోటో యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు 2,31,573 మంది విద్యార్థులు ఇక్కడి నుంచి డిగ్రీ పట్టాలు పొందారు. మీరు ఈ స్థాయికి చేరుకోవడం వెనుక మీ కృషి మాత్రమే కాదు– మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహి తులు, మీకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరి ప్రేమ, ప్రోత్సాహం ఉన్నాయి. మీ విజయాన్ని చూసి వారంతా ఎంత గర్వపడుతున్నారో నేను ఊహించగలను. వారందరికీ కూడా నా కృతజ్ఞతలు, అభినందనలు.
ముఖాముఖి సంభాషణ విలువ
మనమంతా ఇప్పుడు ఒక సమాచార సమాజంలో జీవిస్తున్నాం. మీరు విశ్వవిద్యాలయంలో చేరడానికి ముందు కోవిడ్ మహమ్మారి వచ్చింది. ఆ సమయంలో తరగతులు ఆన్‌లైన్‌లో జరిగాయి. స్నేహితులతో ముచ్చట్లు కూడా ఆన్‌లైన్‌లోనే. ఆ అనుభవం తర్వాత ప్రత్యక్షంగా మాట్లాడటంలోని విలువ మీకు మరింత అర్థమై ఉండవచ్చు. ముఖాముఖి మాట్లాడుతున్నప్పుడు మాటలను మాత్రమే వినం. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశీలిస్తాం. ఎదుటివారి ముఖాన్ని చూస్తాం. వారి గొంతులోని మార్పును గమనిస్తాం. వారి కళ్లను, హావభావాలను చూస్తాం. పంచేంద్రియాల ద్వారా ఎన్నో విషయాలను తెలియకుండానే గ్రహిస్తాం. ఆ అనుభూతులన్నీ కలిస్తేనే నిజమైన మానవ సంభా షణ అవుతుంది. చెప్పని భావాలను సైతం గుర్తించడం, ఎదుటి వారిని గౌరవించడం ప్రత్యక్ష సంభాషణ ద్వారానే సాధ్యం. డచ్ చరిత్రకారుడు రట్గర్ బ్రెగ్‌మన్ తన హ్యూమన్ కైండ్: ఎ హోప్‌ఫుల్ హిస్టరీ పుస్తకంలో ‘మనిషిని మనిషిగా మార్చేది ఏమిటి?’ అనే ప్రశ్నకు సంబంధించి ఆసక్తికరమైన పరిశోధనలను ప్రస్తావించారు. జర్మనీకి చెందిన పరిశోధకులు చిన్న పిల్లలు, ఒరాంగుటాన్లు, చింపాంజీలపై కొన్ని ప్రయోగాలు చేశారు.
స్థలాన్ని గుర్తించే సామర్థ్యం, సంఖ్యలను అర్థం చేసుకోవడం వంటి విషయాలను పరీక్షించారు. మూడు గుంపులూ దాదాపు సమానమైన సామర్థ్యాన్ని చూపించాయి. జ్ఞాపకశక్తి, సమాచారాన్ని అర్థం చేసుకోవడం వంటి విషయాల్లో మనుషులకు, కోతులకు పెద్దగా తేడా కనిపించలేదు. కానీ ఇతరుల నుంచి నేర్చుకోవడం అనే అంశంపై నిర్వహించిన పరీక్షలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కోతులు సున్నా స్థాయి ఫలితాలు సాధించాయి. చిన్న పిల్లల్లో చాలామంది పూర్తి మార్కులు సాధించారు. ఇక్కడ ఇతరుల నుంచి నేర్చుకోవడం అంటే... ఇతరులను గమనించడం, వారి ప్రవర్తనను అర్థం చేసుకోవడం, వారితో సంబంధం ఏర్పరచుకోవడం, వారి అనుభవం నుంచి నేర్చుకోవడం. ఇదే మనిషి ప్రత్యేకతని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి. మనిషి గొప్పతనం కేవలం అతని మెదడులోనే లేదు, ఇతర మనుషు లతో కలిసి జీవించే సామర్థ్యంలో కూడా ఉంది.
ముఖం ఎందుకు ఎర్రబడుతుంది?
మనిషి సిగ్గుపడినప్పుడు ముఖం ఎర్రబడుతుంది. ఇలా జరిగే జీవి మనిషి మాత్రమే. జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చార్లెస్ డార్విన్... ముఖం ఎర్రబడటాన్ని చాలా ప్రత్యేకమైన మానవ లక్షణంగా పేర్కొన్నారు. మనం ఎందుకు సిగ్గుపడతాం? ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని మనం ఎక్కువగా పట్టించుకుంటాం. ఎదుటివారి అభిప్రాయం మనకు చాలా ముఖ్యం. ముఖం ఎర్రబడటం ఒక రకమైన సామాజిక భావ వ్యక్తీకరణ. మనిషి ఒంటరి జీవి కాదు. మనకు ఇతరులు కావాలి. వారి నమ్మకం, సహకారం అవసరం. వారితో సంబంధాలు ముఖ్యం. మనిషి శరీరంలో మరో ఆసక్తికరమైన లక్షణం కళ్లలోని తెల్లటి భాగం. మన కంటి మధ్యలో కనుపాప ఉంటుంది. ఈ తెల్లటి భాగం స్పష్టంగా కనిపిస్తుంది. మనం కళ్లను కొద్దిగా కదిపినా, మనం ఎటువైపు చూస్తున్నామో ఎదుటివారికి అర్థమవుతుంది. మీరు ఎవరితో నైనా మాట్లాడుతున్నప్పుడు... వారు మీ వైపు చూస్తున్నారా లేదా అనేది వెంటనే గుర్తించ గలరు. అందుకే ‘కళ్లు నోటి కంటే ఎక్కువగా మాట్లాడతాయి’ అంటారు. మాటలతో చెప్పలేని భావా లను కూడా కళ్ల ద్వారా పలికించవచ్చు. దాదాపు 200లకు పైగా క్షీరద జాతులుండగా, మనిషికి మాత్రమే ఈ స్పష్టమైన ‘కంటి తెలుపు’ ప్రత్యేకత ఉంది.
టొరంటో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా ఉన్న చరిత్ర కారుడు టిమోతీ స్నైడర్ నేటి ఇంటర్నెట్ యువతకు ఒక సలహా ఇస్తున్నారు. ‘కళ్లలోకి చూడండి, తక్కువగా మాట్లాడండి’ అంటు న్నారు. ‘కంప్యూటర్ మన కళ్లలోకి చూసి మన భావాలను అర్థం చేసుకోలేదు. కానీ మనిషి మాత్రం చూపును పట్టించుకోకుండా ఉండలేడు. మీరు ఇప్పుడు విశ్వవిద్యాలయం అనే చిన్న ప్రపంచం నుంచి బయటకు వచ్చి పెద్ద సమాజంలోకి అడుగుపెట్టబోతున్నారు. అక్కడ మీ అభిప్రాయాలకు పూర్తిగా భిన్నమైన అభిప్రా యాలు ఉన్నవారిని కలుస్తారు. మీతో ఏకీభవించని వ్యక్తులతో మాట్లాడాల్సి వస్తుంది. అలాంటి సమయంలో వారి కళ్లలోకి చూస్తూ, ప్రశాంతంగా మాట్లాడగలగడం ఎంతో ముఖ్యం.
కొత్త ఆలోచనలకు తలుపులు తెరవండి!
నాలుగు సంవత్సరాల క్రితం, మీరు క్యోటో విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టినప్పుడు, ‘మిమ్మల్ని మీరు తెలుసుకునే’ ఒక పెద్ద ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారని చెప్పాను. ఈ నాలు గేళ్లలో మీరు ఎంతోమంది కొత్త వ్యక్తులను కలుసుకున్నారు. కొత్త స్నేహితులను సంపాదించారు. మీ మనసును మార్చిన పుస్తకాలను చదివారు. మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటనలను అనుభవించారు. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఈ పరిచయాలన్నీ మీ గురించి మీకు ఏదైనా కొత్త విషయం నేర్పించాయా? అమెరికాలో విశ్వవిద్యాలయాల గ్రాడ్యుయేషన్ కార్యక్రమా లను ‘కమెన్స్‌మెంట్’ అంటారు. ఆ పదానికి అసలు అర్థం ‘ప్రారంభం’. గ్రాడ్యుయేషన్ డే అంటే చదువు ముగిసిన రోజు మాత్రమే కాదు, అది జీవితంలోని కొత్త ప్రయాణానికి తొలి రోజు కూడా. ఈ రోజు మీరు ఒక దశను పూర్తి చేసుకున్నారు, అదే సమయంలో మరో దశను ప్రారంభించనున్నారు.
మీ గురించి మీరు తెలుసుకునే ప్రయాణం కూడా ఇక్కడితో ముగియదు. అది జీవితాంతం కొనసాగుతుంది. కాబట్టి కొత్త పరిచయాలకు మీ మనసును ఎల్లప్పుడూ తెరిచి ఉంచండి. కొత్త అనుభవాలను స్వీకరించడానికి వెనుకాడకండి. మనలో దాగి ఉన్న ప్రతిభను మనం గుర్తించలేకపోవచ్చు. కానీ ఒక కొత్త వ్యక్తి, ఒక కొత్త పుస్తకం, ఒక కొత్త ప్రయాణం లేదా ఒక అనుకోని సంఘటన మనలోని ఆ సామర్థ్యాన్ని బయటకు తీసుకురావచ్చు. అలా మళ్లీ మళ్లీ మనల్ని మనం తెలుసుకుంటాం. మన జీవితానికి మనమే కొత్త అర్థాన్ని ఇస్తాం. అలా అనుకోకుండా వరించిన అదృష్టాన్ని ‘సెరెండిపిటీ’ అంటారు. అయితే అలాంటి అవకాశాలను గుర్తించడానికి మన మనసు సిద్ధంగా ఉండాలి. మనసు తలుపులు మూసేసి ఉంటే, మన ముందున్న మంచి అవకాశాన్ని కూడా మనం గుర్తించలేము. కాబట్టి మీ హృదయాన్ని, మీ మనసును కొత్త అనుభవాలకు ఎప్పుడూ తెరిచి ఉంచండి. మీ జీవిత రహదారిలో వచ్చే ప్రతి మలుపును భయపడకుండా స్వీకరించండి.


