‘నిజమైన గొప్ప కళ ఎల్లప్పుడూ ఆశాభావంతో కూడుకున్నది. కళాకారులు తమ సృజనాత్మక పనిలో సంతోషాన్ని పొందుతారు. గొప్ప కళలన్నీ విషాదాంతంగా ఉంటాయనేది వాస్తవమైనా పై అంశాన్ని ఏ మాత్రం మార్చలేదు’ అని ప్రముఖ సంఘసంస్కర్త, అమెరికన్ రచయిత అప్టన్ సింక్లెయిర్ సంస్కృతి, కళల పట్ల తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు.
‘డ్రాగన్ టీత్స్’ (డ్రాగన్ కోరలు) అంటూ హిట్లర్ ఫాసిజాన్ని ఎండగట్టిన సింక్లేర్ తన పుస్తకానికి పులిట్జర్ బహుమతి పొందిన తర్వాత, ‘కళాకారులు కేవలం కళారూపాలను మాత్రమే కాదు, నూతన సమాజ సృష్టి కర్తలు కావాలన్న’ ఆకాంక్షను సైతం వెల్లడించారు. సకల వైవిధ్య జానపద కళలకు, పౌరాణిక వీరగాథలకు, పటాల కథలకు, విప్లవ గీతాలకు ప్రసిద్ధి పొందిన తెలంగాణలో ‘ప్రజా కళాజాతర’ సెప్టెంబర్ 26 ఉదయం నుండి 28 మధ్యాహ్నం వరకు 50 గంటల పాటు ఏకధాటిగా జరుగుతున్నది. సాంకేతికంగా అరుణోదయ ప్రజా గాయనిగా నా విప్లవ ప్రజా సాంస్కృతికోద్యమ 50 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా ఇది జరుగుతున్నా దీనిని అచ్చమైన ‘ప్రజా కళాజాతర’ గానే పరిగణించి ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను.
సంస్కృతి–కళలు–సాహిత్యం ఆ యా కాలాలలో ఉనికిలో ఉన్న దోపిడి ఆర్థిక–రాజకీయ సామాజిక ప్రభావాలతో ముడిపడి ఉంటా యనేది వాస్తవమే. అదే సమయంలో ఆధిపత్య వర్గ–కుల రాజకీ యాలకు, సంస్కృతికి వ్యతిరేకంగా సాగుతున్న వర్గ–కుల పోరా టాలు కూడా చరిత్ర పొడవునా మనకు కనబడుతున్నాయి. మను వాద సంస్కృతి – కార్పొరేట్ దోపిడీ అనే సమ్మిళిత నకిలీ జాతీయ వాద ప్రభావాన్ని తట్టుకుంటూ మౌఖిక సంప్రదాయం నేటికీ సజీవంగా ఉంది.
ఛత్రపతి శివాజీకి సమకాలికుడిగా ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను మనం శారద వీణపై పలికించిన శారద గాండ్ర నుండే సేకరించాము. అది బహుజన రాజకీయ చైతన్యాన్ని రగిలించింది. సమ్మక్క–సారమ్మల ధీరత్వం, ఆదివాసీ వీరుల వీరత్వం, బంజార యోధుల గాథలెన్నో ప్రజల నోట్లో నాను తున్నాయి. మహత్తర తెలంగాణ సాయుధ పోరాటం (1946–51) జానపద కళారూపాలెన్నింటినో ప్రజాస్వామీకరించి రూపాన్ని మార్చకుండానే, విప్లవ సారంతో దానికి వన్నెలద్దింది.
నక్సల్బరీ–శ్రీకాకుళం–గోదావరిలోయ పోరాటాల ప్రేరణతో 1970ల కల్లోల దశాబ్దంలో 1974లో ‘అరుణోదయ’ పురుడు పోసు కుంది. ఏడేళ్ల వయసు నుండి మా నాయిన కామ్రేడ్ బండ్రు నర్సింహులు వేలు పట్టుకుని పాటలు పాడుతూ సాగిన నాకు 1974 తర్వాత అరుణోదయ జెండా చేతికందింది. అది జన విముక్తయినా, స్త్రీ విముక్తయినా, కుల నిర్మూలనైనా, ఆదివాసి స్వయం పాలనైనా, తెలంగాణ లాంటి ప్రాంతీయ ప్రజాస్వామ్య ఆకాంక్షలైనా ఉద్యమ గాయనిగా సుదీర్ఘంగా ప్రజలతోనే ఉంటున్నాను. ఈ సుదీర్ఘకాలంలో కళారంగమే జీవితంగా బతుకొచ్చని నిరూపించుకున్నా.
ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతి నిర్మాణం ఏ ఒక్క సంస్థతోనో సాధ్యం కాదని తేలిపోయింది. 52 ఏళ్ల అరుణో దయలో, నా 50 ఏళ్ల విప్లవ ప్రజా సాంస్కృతికోద్యమ ప్రస్థానాన్ని వ్యక్తిగత ఉత్సవంగా కాకుండా ‘ప్రజా కళాజాతర’గా జరపడాన్ని నేను అంగీకరించాను. ప్రజా కవులు, కళాకారులు, జానపద కళాకారులు, వృత్తి కళా కారులు మొదలుకొని ప్రజా కళాభిమానులందరినీ ఒకచోట చేర్చుదాం.
‘ఒకే దేశం–ఒకే సంస్కృతి’ అనే నియంతృత్వ పోకడ లను ఎదిరిస్తూ, వైవిధ్య సంస్కృతే ప్రజాస్వామ్యమని ‘గంగా జమునా తెహజీబ్’ (సంస్కృతి)గా ప్రసిద్ధిగాంచిన తెలంగాణ నేల నుండి చాటి చెబుదాం. ఆప్టన్ సింక్లెయిర్ మాత్రమే కాదు, వందల, వేలమంది ప్రగతికాముకులు కలగన్నట్టు మనం కళా రూపాలనే కాదు, నూతన సమాజ రూపురేఖలను చిత్రిస్తూ అమరుల కలలకు ఆచరణ రూపం ఇద్దాం.
– ‘అరుణోదయ’ విమలక్క‘, సాంస్కృతిక కార్యకర్త (నేటి నుంచి హైదరాబాద్ ఆర్టీసీ కల్యాణ మండపంలో ఏకధాటిగా 50 గంటల ‘ప్రజా కళాజాతర’ సందర్భంగా)
ఇదీ చదవండి: ఇంకా ప్రపంచానిది ఆటవిక న్యాయమేనా?


