గణేష్‌ నిమజ్జనంలో ఆకతాయిల ఆగడాలు.. | CP Sajjanar Request Over Hyderabad Traffic Situation Due To Immersion | Sakshi
Sakshi News home page

గణేష్‌ నిమజ్జనంలో ఆకతాయిల ఆగడాలు..

Sep 26 2026 12:10 PM | Updated on Sep 26 2026 12:10 PM

CP Sajjanar Request Over Hyderabad Traffic Situation Due To Immersion

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జన వేడుకల వేళ ఆకతాయిల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. నిమజ్జనానికి వచ్చిన యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించిన 1,530 మందిని పోలీసులు గుర్తించారు. వీరిలో 724 మందికి షీటీమ్స్‌ కౌన్సెలింగ్‌ ఇవ్వగా.. 48 మందిని అరెస్ట్‌ చేశారు. మరోవైపు ట్యాంక్‌బండ్‌పై గణేష్‌ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుండటంతో నగరంలో భారీగా ట్రాఫిక్‌ రద్దీ నెలకొంది.

నిమజ్జన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు పోలీస్‌, ట్రాఫిక్‌ సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. నిమజ్జనోత్సవం ప్రశాంతంగా పూర్తయ్యేలా ప్రజలు సహకరించాలని కోరారు.

శనివారం కూడా ట్రాఫిక్‌ ఆంక్షలు..
నిమజ్జనాల నేపథ్యంలో శనివారం కూడా ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయని సీపీ సజ్జనార్‌ తెలిపారు. ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌, పీవీ స్టాచ్యూ, ఇందిరాగాంధీ రోటరీ పరిసరాల్లో సాధారణ వాహనాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అత్యవసరమైతే తప్ప ఈ మార్గాల్లో ప్రయాణించవద్దని, వీలైతే ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని వాహనదారులకు సూచించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్‌లో చిక్కుకోవద్దని కోరారు. ట్రాఫిక్‌ పోలీసులు జారీ చేసే అధికారిక అడ్వైజరీలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.

ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్‌, లిబర్టీ, మోజంజాహీ మార్కెట్‌ ప్రాంతాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారని సీపీ తెలిపారు. భారీ రద్దీ కారణంగా వాహనాల రాకపోకలు మందగించడంతో నిమజ్జన ప్రక్రియ కొంత ఆలస్యమైందన్నారు. నిమజ్జన శోభాయాత్ర శనివారం మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. శాంతియుతంగా నిమజ్జనోత్సవం పూర్తయ్యేలా నగర ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు.

Video Credit: shinenewshyd

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement