సాక్షి, హైదరాబాద్: ఏటా గణేష్ నిమజ్జనం, శోభాయాత్రల్ని మంత్రులు, ఉన్నతాధికారులు హెలీకాఫ్టర్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా పర్యవేక్షిస్తుంటారు. సచివాలయంలో ఉన్న హెలీప్యాడ్, బేగంపేట ఎయిర్‌పోర్టుల నుంచి టేకాఫ్ తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ) పై ఓ హెలీప్యాడ్‌ను నిర్మించారు. ఇది అందుబాటులోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా వినియోగంలోకి రాకపోవడంతో శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ సీవీ ఆనంద్, సీపీ వీసీ సజ్జనర్‌లతో కూడిన హెలీకాఫ్టర్ బేగంపేట విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించింది.
బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.12లో 22+2 అంతస్తులతో ఐజీసీసీసీ నిర్మించారు. ఏ బ్లాక్ పైన హెలీప్యాడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంత ఎత్తులో నిర్మిస్తే హెలీకాఫ్టర్ల రాకపోకలకు అనుమతి ఇవ్వలేమని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీంతో ఎత్తు తగ్గిస్తూ 18 అంతస్తుల్లో డిజైన్ ఖరారు చేశారు. నిర్మాణం పూర్తయ్యాక హెలీకాఫ్టర్ల రాకపోకలకు అనుమతి కోరుతూ కేంద్రం పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు పోలీసు విభాగం దరఖాస్తు చేసింది.
ఈ భవనం ప్రధాన రహదారి వైపు రోడ్డుకు సమానంగానే ఉన్నా... వెనుక వైపు మాత్రం రోడ్డు కంటే దిగువన ఉంటుంది. అధికారులు సెల్లార్ నుంచి ఎత్తును పరిగణనలోకి లెక్కించడంతో అది 83 మీటర్లకు చేరింది. హెలీప్యాడ్ ఆపరేటింగ్‌కు భవనం 70 మీటర్ల ఎత్తే ఉండాలని, ఇది 13 మీటర్లు అదనంగా ఉండటంతో అనుమతి ఇవ్వలేకపోతున్నామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీంతో టీజీఐసీసీసీ పైన ఉన్న హెలీప్యాడ్ ఫొటోలకే పరిమితమైంది.


