ఉద్యోగులకు మరింత మెరుగైన ప్రయోజనాలు.. వేతన పరిమితి పెంపుతో పరిధి భారీగా విస్తరణ
25 శాతం నిధి నిల్వ తప్పనిసరి.. విత్ డ్రాయల్స్ 75 శాతానికి ఓకే.. మూడు రకాలుగా ఉపసంహరణ... నిబంధనలకు లోబడి క్లియరెన్స్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, కార్మీకులు, పెన్షనర్ల సామాజిక భద్రతకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) పలు కీలక సంస్కరణలు అమల్లోకి తెచ్చింది. పీఎఫ్ పరిధి విస్తరణ, ఉపసంహరణ నిబంధనల సరళీకరణ, క్లెయిమ్‌ల వేగవంతమైన పరిష్కారం, డిజిటల్ సేవల విస్తరణ వంటి అంశాల్లో ఈపీఎఫ్‌ఓ తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగులకు మెరుగైన ఫలితాలు ఇవ్వనున్నాయి. అయితే ఇవి పాత ఖాతాదారులకు ఒకే విధంగా వర్తించదు. వేతనం, సభ్యత్వం ప్రారంభమైన తేదీ, ఖాతా స్థితి, సంబంధిత పథకాల నిబంధనలకు అనుగుణంగా ప్రయోజనాలు కలుగుతాయి.
వేతన పరిమితి రూ.25 వేలు.. పరిధి మరింత విస్తరణ
ఈపీఎఫ్‌ఓ కనీస వేతన పరిమితి రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది. ఈ మార్పు ఈ నెల 17 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఇప్పటివరకు తప్పనిసరి పీఎఫ్ పరిధిలోకి రాని రూ.15,000 నుంచి రూ.25,000 మధ్య అర్హత కలిగిన వేతనాలు పొందే కొత్త ఉద్యోగులకు సామాజిక భద్రత ప్రయోజనాలు అందుతాయి. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 51 లక్షల మంది అదనంగా ఈపీఎఫ్‌ఓ పరిధిలోకి వస్తారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
పీఎఫ్‌తోపాటు ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎస్), ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్‌ఐ) ప్రయోజనాల విస్తరణకు ఈ నిర్ణయం ఎంతో ఉపకరం కానుంది. ఇప్పటికే పీఎఫ్ చందాదారులుగా ఉన్న ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఆటోమేటిక్‌గా రూ.25,000పై లెక్కించబడదు. వేతన ఫార్ములా, సంస్థ నిబంధనలు, సభ్యత్వ అర్హత, వాస్తవంగా జమవుతున్న మొత్తాలను పరిశీలిస్తే స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఉపసంహరణలో సరళీకరణ
ఈపీఎఫ్ పార్ట్ విత్‌డ్రాయల్స్‌లో గతంలో ఉన్న అనేక కేటగిరీలుండేవి. తాజాగా వాటి ని కుదించి మూడు ప్రధాన విభాగాలుగా చేశారు. అత్యవసరం, ఇంటి సంబంధిత అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు వంటి విభాగాల కింద ఉపసంహరణను సులభతరం చేసుకునే వెసులుబాటు కల్పించింది.
⇒ అర్హత కలిగిన సందర్భాల్లో పీఎఫ్ మొత్తంలో గరిష్టంగా 75 శాతం విత్‌డ్రా చేయొచ్చు. ఖాతాలో తప్పనిసరిగా 25 శాతం జమ ఉండాలి.
⇒ పాక్షిక ఉపసంహరణలకు సాధారణంగా 12 నెలల కనీస సేవాకాలం.
⇒ విద్య కోసం గరిష్టంగా 10 సార్లు, వివాహాలకు 5 సార్లు ఉపసంహరణకు అవకాశం. ఉపసంహరణ అనంతరం ఖాతాలో కనీసం 25 శాతం మొత్తాన్ని నిల్వ ఉంచే నిబంధన.
తుది సెటిల్‌మెంట్, క్లెయిమ్‌లలో కీలక మార్పులు
⇒ ఉద్యోగం మానేసిన తర్వాత పీఎఫ్ మొత్తాన్ని తుది సెటిల్‌మెంట్ చేసుకునే కాలపరిమితిని 2 నెలల నుంచి 12 నెలలకు పెంచారు. ఈపీఎస్ తుది ఉపసంహరణకు సంబంధించిన కాలపరిమితిని 2 నెలల నుంచి 36 నెలలకు మార్పు చేశారు. ఈ మార్పుల అమలు, వ్యక్తిగత అర్హతలను సభ్యులు అధికారిక నిబంధనల ప్రకారం పరిశీలించుకోవాల్సి ఉంటుంది.
⇒ క్లెయిమ్‌ల పరిష్కారంలోనూ వేగం పెంచే చర్యలు చేపట్టారు. అర్హత కలిగిన రూ.5 లక్షల వరకు క్లెయిమ్‌లను ఆటోమేటిక్ విధానంలో మూడు పనిదినాల్లో పరిష్కరిస్తున్నారు. అయితే బ్యాంకు వివరాలు, ఆధార్ అనుసంధానం, కేవైసీ ధ్రువీకరణ, క్లెయిమ్ రకం వంటి అంశాలపై ఆధారపడి సమయం మారొచ్చు.
⇒ ఈపీఎఫ్‌ఓ 3.0, కేంద్రీకృత డిజిటల్ వ్యవస్థల ద్వారా క్లెయిమ్‌ల ప్రాసెసింగ్, డేటా ధ్రువీకరణ, చెల్లింపులను మరింత సమర్థవంతంగా మార్చే చర్యలు చేపట్టారు. తక్కువ బ్యాలెన్స్ ఉన్న కొన్ని ఇన్‌ఆపరేటివ్ ఖాతాలకు ఆటోమేటిక్ క్లెయి మ్ రూపంలో పరిష్కరించే ప్రక్రియను ప్రయోగాత్మక పద్ధతిలో చేపడుతున్నారు.
⇒ పెన్షనర్లకు ఫేస్ రికగ్నైజేషన్ పద్ధతిలో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సేవలు,ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సహకారంతో ఇంటి వద్దే జీవన ధ్రువీకరణ పత్రం సమరి్పంచే సౌకర్యాలను విస్తరిస్తున్నారు.
ఉద్యోగులు పరిశీలించుకోవాల్సిన అంశాలు
⇒ వేతన పరిమితి పెంపు ప్రతి పాత సభ్యుడి పీఎఫ్ కంట్రిబ్యూషన్ ఆటోమేటిక్‌గా పెరగదనే విషయాన్ని ఉద్యోగులు గుర్తుంచుకోవాలి.
⇒ పాక్షిక ఉపసంహరణకు అర్హతలు, కనీస సేవాకాలం, కనీస నిల్వ నిబంధనలు వర్తిస్తాయి.
⇒ క్లెయిమ్ దరఖాస్తుకు ముందు ఆధార్, బ్యాంకు ఖాతా, కేవైసీ వివరాలు సరిగా ఉన్నాయో పరిశీలించాలి.
⇒ వడ్డీ రేటు, ఉపసంహరణ నిబంధనలు, తుది సెటిల్‌మెంట్ వంటి అంశాల్లో ఈపీఎఫ్‌ఓ అధికారిక ప్రకటనలనే ప్రామాణికంగా తీసుకోవాలి.
⇒ ఈపీఎఫ్‌ఓలో తాజా మార్పుల ప్రధాన ఉద్దేశం సామాజిక భద్రత పరిధిని విస్తరించడం, పీఎఫ్ సేవలను సరళీకరించడం, క్లెయిమ్‌లను వేగవంతం చేయడం.
⇒ ఉద్యోగులు తమ ఖాతాకు వర్తించే నిబంధనలను తెలుసుకున్నప్పుడే ఈ మార్పుల పూర్తి ప్రయోజనాన్ని పొందగలరు.


