ఆర్‌ఆర్‌ఆర్ పనులు మొదలు కాకుండానే మార్పులు
2024 డిసెంబర్ 28న తొలి టెండర్ పిలుపు... ఇప్పటికీ గడువు పొడిగింపులతో సరి... ఐదు నెలల క్రితమే బడ్జెట్ ఖరారై పీపీపీఏసీ కమిటీ ఆమోదించినా నిలిచిన ఫైలు
కేంద్రం ఆమోదం లేకపోవడంతో ముందుకు కదలని ప్రక్రియ
రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభంపై నెలకొన్న అయోమయం
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర ముఖచిత్రాన్ని మార్చే ప్రతిష్టాత్మక రీజనల్ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టులో ని 161.518 కి.మీ. నిడివిగల ఉత్తర భాగం టెండర్ల ప్రక్రియ ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఇప్పటివరకు ఏకంగా 16సార్లు టెండర్లను సవరించడం/తేదీని పొడిగించడం చేసినా ప్రతిష్టంభన మాత్రం నేటికీ కొనసాగుతోంది.
రోడ్డు నిర్మాణానికి అంతా సిద్ధమైనా కేంద్ర ఉపరితల రవాణాశాఖ రకరకాల కొర్రీలతో సవరణలు ప్రతిపాదిస్తుండటంతో టెండర్లు తెరవకుండానే గడువు పొడిగించాల్సి వస్తోంది. తాజాగా 16వసారి ఎన్‌హెచ్‌ఏఐ అక్టోబర్ 23 వరకు గడువు పొడిగించింది. ఇప్పటి వరకు కేంద్ర కేబినెట్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఈ రోడ్డు ప్రతిపాదన తొమ్మిదేళ్లుగా కాగితాలకే పరిమితమైంది. ఫలితంగా ఏటా 10 శాతం కంటే ఎక్కువ నిర్మాణ అంచనా వ్యయం పెరుగుతోంది. రూ. 11 వేల కోట్ల తొలి అంచనా నుంచి ఏకంగా రూ. 25 వేల కోట్లను మించింది.
కేంద్ర కేబినెట్ మౌనం...
ఎన్‌హెచ్‌ఏఐ చేపట్టే ప్రతి భారీ ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక శాఖ అ«దీనంలోని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) ఆమోదం అవసరం. ఈ కమిటీయే బడ్జెట్‌ను ఆమోదిస్తుంది. ఈ ఏడాది మేలో ఈ కమిటీ ఉత్తర రింగు బడ్జెట్‌ను రూ. 23,935 కోట్లుగా ఖరారు చేస్తూ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేయడంతో కేంద్ర కేబినెట్ ఆమోదమే మిగిలింది. కానీ విచిత్రంగా కేంద్ర కేబినెట్ దాన్ని పరిగణనలోకి తీసుకోవట్లేదు. గత ఐదు నెలల్లో దాదాపు 12 ఇతర ప్రాజెక్టులను ఆమోదించిన కేంద్ర కేబినెట్.. ఉత్తర రింగుకు ఆమోదం తెలపకపోవడంతో ఈ ప్రాజెక్టు టెండర్ల గడువును ఎన్‌హెచ్‌ఏఐ పెంచుకుంటూ వెళ్తోంది.
డిసెంబర్ 2024 నుంచి...
ఉత్తర రింగును తొలుత నాలుగు లేన్లుగా (తొలి దశ) ఐదు ప్యాకేజీలతో నిర్మించాలని నిర్ణయించి 2024 డిసెంబర్ 28న టెండర్లు పిలిచారు. గిర్మాపూర్–రెడ్డిపల్లి, రెడ్డిపల్లి–ఇస్లాంపూర్, ఇస్లాంపూర్–ప్రజ్ఞాపూర్, ప్రజ్ఞాపూర్–రాయగిరి, రాయగిరి–చౌటుప్పల్ తంగేడుపల్లి ప్యాకేజీలు ఖరారు చేశారు. ఆ తర్వాత కేంద్రం ఈ రోడ్డును 8 లేన్లకు బదులు ఆరు లేన్లకు కుదించింది. దీంతో ఒకేసారి ఆరు లేన్లను నిర్మించాలని గతేడాది ఫిబ్రవరిలో టెండర్లను సవరించింది.
ఈపీసీ టెండర్లను, ఆ తర్వాత హైబ్రిడ్ యాన్యూటీ పద్ధతిని తెరపైకి తెస్తూ రెండు ప్యాకేజీలుగా రోడ్డు నిర్మాణానికి ఈ ఏడాది మే 20న కొత్త టెండర్లు పిలిచింది. గిర్మాపూర్–ప్రజా్ఙపూర్, ప్రజ్ఞాపూర్–తంగేడుపల్లి ప్యాకేజీలుగా మార్చింది. ఈలోగా 11 సవరణలు జరిగాయి. కొత్త టెండర్ ప్రక్రియ తర్వాత కేంద్రం ఎటూ తేల్చక కాలయాపన చేయడంతో ఇప్పటికి ఆరుసార్లు టెండర్ల తేదీలు పొడిగిస్తూ వచ్చారు. మొత్తంగా 16 సవరణల్లో 11 గడువు పొడగింపులున్నాయి.
భారీగా పెరిగిన బడ్జెట్...
తొలుత 2017 చివర్లో రూ. 11,800 వేల కోట్లతో నిర్మాణ వ్యయాన్ని ప్రతిపాదించగా ఈ ఏడాది మేలో దాన్ని పీపీపీఏసీ రూ. 23,935.6 కోట్ల బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసింది. అంటే దాదాపు రూ. 12 వేల కోట్ల మేర అంచనాలు పెరిగిపోయాయి. బడ్జెట్ ఖరారైనా ఇప్పటికీ పనులు మొదలు కాకపోవటంతో ఆ అంచనా మరో రూ. 2 వేల కోట్లకు పెరిగి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అంటే రూ. 25 వేల కోట్ల మార్కును అంచనా వ్యయం దాటేసింది.
నిధులు ఇలా..
కేంద్ర ప్రభుత్వం 40 శాతం నిధులను నిర్మాణ సంస్థకు చెల్లించనుండగా 60 శాతం నిధులను నిర్మాణ సంస్థ సమకూర్చుకొని పనులు పూర్తి చేస్తుంది. నిర్మాణ సంస్థతో 15 ఏళ్ల కాలానికి ఎన్‌హెచ్‌ఏఐ ఒప్పందం చేసుకుంటుంది. ఆ సంస్థ ఖర్చు చేసిన నిధులను వడ్డీతో సహా వాయిదాల పద్ధతిలో చెల్లిస్తుంది. 15 ఏళ్ల వరకు రోడ్డు నిర్వహణ బాధ్యత నిర్మాణ సంస్థదే.
బడ్జెట్ ఖరారు నాటికి ఇదీ స్వరూపం...
ప్యాకేజీ 1: సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వరకు: 83.518 కి.మీ.
ప్యాకేజీ 2: ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి–భువనగిరి జిల్లా తంగేడ్‌పల్లి గ్రామం వరకు: 78 కి.మీ.లు సేకరించిన మొత్తం భూమి: 1,933.16 హెక్టార్లు
పెద్ద వంతెనలు: 44
చిన్న వంతెనలు: 127
బాక్స్ కల్వర్టులు: 1262
రోడ్ ఓవర్ బ్రిడ్జీలు: 4
అండర్ పాస్‌లు: 44
వెహికల్ ఓవర్‌పాస్‌లు: 1
టోల్‌ప్లాజాలు: 9 (ప్రతి ఇంటర్‌చేంజ్ వద్ద)


