2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో పట్టుకు వ్యూహం
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌పై ఫోకస్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పోటీతో ‘బీసీ’ కోసం అన్వేషణ
వరంగల్–ఖమ్మం–నల్లగొండ అభ్యర్థిగా ‘ఏనుగుల’!
ఖైరతాబాద్‌లోనూ బలమైన అభ్యర్థి కోసం కసరత్తు
ఇటీవల కేసీఆర్‌ను కలిసిన మన్నె గోవర్ధన్‌రెడ్డి... తలసాని కుమారుడి ఆసక్తి?
జిల్లా, మండల, కార్పొరేషన్ల ఎన్నికలకూ సమాయత్తం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరోమారు వరుస ఎన్నికల సందడి తెరమీదకు వస్తుండటంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ కొత్త పంథాలో సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగాలని భావిస్తోంది. గతంలో కొన్ని ఎన్నికలకు దూరంగా ఉండి రాజకీయంగా నష్టపోయిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని సమీప భవిష్యత్‌లో జరిగే అన్ని ఎన్నికల్లోనూ సర్వశక్తులూ ఒడ్డాలని పార్టీ నిర్ణయించింది. ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక మొదలుకొని శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంటోంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ కార్పొరేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలకూ పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే సన్నద్ధం చేసేదిశగా బీఆర్‌ఎస్ అడుగులు వేస్తోంది.
మండలి పట్టభద్రుల స్థానాల్లో..: శాసనమండలి పట్టభద్రుల కోటాలో ‘వరంగల్–ఖమ్మం–నల్లగొండ’, ‘హైదరాబాద్– రంగారెడ్డి–మహబూబ్‌నగర్’ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను బరిలోకి దించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. ప్రస్తుతం ‘హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్’పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఉన్న దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణీదేవి మరోమారు పోటీకి విముఖంగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది.
‘బీసీ’సామాజికవర్గం నుంచి వెతుకులాట
‘వరంగల్–ఖమ్మం–నల్లగొండ’పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసి ఓటమిపాలైన ఏనుగుల రాకేశ్‌రెడ్డికే మరోమారు అవకాశం ఇవ్వడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో ‘హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్’స్థానం నుంచి బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. స్పోర్ట్స్ అథారిటి మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
అయితే బీసీ సామాజికవర్గానికి చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ కేడర్‌కు చెందిన అధికారి, మరో హైకోర్టు న్యాయవాది పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నా , ఆర్థికంగా బలమైన వ్యక్తి కోసం అన్వేషణ సాగుతున్నట్టు ప్రచారం. మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ కుమారుడు కాసాని వీరేశ్ కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీసీ సామాజికవర్గానికి చెందిన ఓ మాజీ మంత్రిని కూడా బరిలోకి దించితే ఎలా ఉంటుందనే కోణంలో బీఆర్‌ఎస్‌లో చర్చ జరుగుతోంది.
బీజేపీకి అవకాశం ఇవ్వరాదనే కోణంలో..
గతంలో ‘కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్’పట్టభద్రుల నియోజకవర్గంతోపాటు ‘కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్’, ‘వరంగల్–ఖమ్మం–నల్లగొండ’ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికకు బీఆర్‌ఎస్ దూరంగా ఉంది. దీంతో ‘కరీంనగర్–ఆదిలాబాద్– నిజామాబాద్– మెదక్’పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్‌ఎస్ బరిలో లేకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా పోలరైజ్ అయిందనే అంచనాకు బీఆర్‌ఎస్ వచ్చింది. మరోవైపు ‘హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్’పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పోటీ చేసే అవకాశాలు ఉండటంతో, సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు బలమైన అభ్యర్థిని పోటీలోకి దించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది.
ఖైరతాబాద్‌లో గులాబీ దళానికి మరో పరీక్ష
2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి దూరమైన బీఆర్‌ఎస్ ఆ తర్వాత హైదరాబాద్ జిల్లా పరిధిలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ ఓటమి పాలైంది. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో భిన్నమైన వ్యూహంతో ముందుకు సాగాలని పార్టీ భావిస్తోంది. సుదీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న మన్నె గోవర్దన్‌రెడ్డి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో గోవర్దన్‌రెడ్డి భార్య మన్నె కవితారెడ్డి రెండు పర్యాయాలు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌గా కూడా పనిచేశారు. తలసాని సాయికిరణ్ పేరు కూడా ఆశావహుల జాబితాలో వినిపిస్తోంది.
గ్రేటర్ సహా స్థానిక ఎన్నికలపైనా నజర్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, మరికొన్ని మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. సుదీర్ఘకాలంగా వాయిదా పడుతూ వస్తున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండు రోజుల క్రితం ఎర్రవల్లి నివాసంలో పార్టీ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు.
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్, బీజేపీ వేస్తున్న రాజకీయ ఎత్తుగడులు, బీఆర్‌ఎస్ అనుసరిస్తున్న వ్యూహాలు, ప్రతివ్యూహాలపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల మొదటివారంలో ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలతో కేసీఆర్ వరుస భేటీలు నిర్వహించాలనే యోచనలో ఉన్నారు. దసరా తర్వాత క్షేత్ర స్థాయిలో వివిధ ఎన్నికలను ఎదుర్కొనే విధంగా కేడర్‌ను సన్నద్ధం చేసేలా కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది.


