భక్తజన సందోహం మధ్య సెక్రటేరియట్ మీదుగా ట్యాంక్‌బండ్‌కు తరలుతున్న ఖైరతాబాద్ గణేశుడు
ఉదయం 9:35కి ప్రారంభమైన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర
మధ్యాహ్నం 2:45 నిమిషాలకు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం
ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన మంత్రి పొన్నం, డీజీపీ తదితరులు
ఖైరతాబాద్/లక్డీకాపూల్: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి నిమజ్జనం నిర్విఘ్నంగా పూర్తయింది. 69 అడుగుల ఎత్తులో విశేష పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఘట్టాన్ని కేవలం 6 గంటల 20 నిమిషాల్లో పూర్తిచేశారు. శుక్రవారం ఉదయం 9:35 నిమిషాలకు ప్రారంభమైన శోభాయాత్ర సాగర తీరానికి చేరుకోగా ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబరు 4 వద్ద మధ్యాహ్నం 2:45 నిమిషాలకు నిమజ్జనం పూర్తయింది.
శోభాయాత్ర ఇలా...
⇒ గురువారం అర్ధరాత్రి తర్వాత ఖైరతాబాద్ మహాగణపతిని భారీ వాహనంపై ఉంచారు. అంతకుముందే రాత్రి 8 గంటలకు కలశపూజ నిర్వహించి విగ్రహ నిమజ్జన ఏర్పాట్లను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా, మహాగణపతిని లిఫ్ట్ చేసి వాహనంపై ఉంచే క్రేన్‌కు సాంకేతిక లోపం రావడంతో ఉదయం 9:35 నిమిషాలకు ప్రారంభమైంది. మహాగణపతి 2:45 నిమిషాల సమయంలో.. అధికారులు అప్పటికే మార్క్ చేసి ఏర్పాటు చేసిన రెడ్ ఫ్లాగ్‌ల మధ్యలో నీటిని తాకుతూ మెల్లగా గంగమ్మ ఒడిలోకి చేరుకున్నాడు. గత సంవత్సరం మధ్యాహ్నం 1:45 నిమిషాలకు సంపూర్ణ నిమజ్జనం కాగా, ఈ సంవత్సరం గంట ఆలస్యంగా నిమజ్జనం పూర్తయింది.
⇒ మహాగణపతిని పైకి లిఫ్ట్ చేసి 30 నిమిషాలు గాల్లోనే ఉంచి నలువైపులా తిప్పుతూ గంగమ్మ ఒడిలో మార్క్ చేసిన ప్రాంతంలో నిమజ్జనం చేశారు. క్రేన్ ఆపరేటర్ బల్విందర్‌సింగ్ చాకచక్యంగా మహాగణపతి నిమజ్జనం చేయించారు.
⇒ ఎలాంటి విఘ్నాలు లేకుండా నిమజ్జనం పూర్తి కావడంతో పోలీసులు, అధికారులు, సిబ్బంది, ఉత్సవ కమిటీ సభ్యులు సంతోషంగా డ్యాన్స్ చేశారు. పాటలకు స్టెప్పులు వేస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం పూర్తయింది : మంత్రి పొన్నం
హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో గణేశ్ నిమజ్జనోత్సవం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిమజ్జనం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన అన్ని ఏర్పాట్లు చేపట్టిందన్నారు. శుక్రవారం నగరంలో గంట పాటు నిమజ్జన ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ ద్వారా సంబంధిత ఉన్నతాధికారులతో కలసి మంత్రి పరిశీలించారు.
ఏరియల్ వ్యూ అనంతరం బేగంపేట విమానాశ్రయంలో మీడియా సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్, సీపీ సజ్జనార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలాతో కలసి మంత్రి పొన్నం మాట్లాడారు. 11వ రోజు గణేశ్ నిమజ్జనం సందర్భంగా సంబంధిత రూట్లు, నిర్దేశించిన పాయింట్లలో నిరంతరం వివిధ శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ప్రభుత్వంలోని అన్ని శాఖలను సమన్వయం చేస్తూ భక్తులు, ఉత్సవ నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.
నిమజ్జన ప్రక్రియను వేగవంతం చేయండి
వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో నిర్వాహకులు సహకరించి విగ్రహాల మూమెంట్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి నిమజ్జన ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయం లేదా వీలైనంత త్వరగా నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
ఈ ఏడాది పోర్టల్‌లో 1.24 లక్షల విగ్రహాలు నమోదు : డీజీపీ సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా సాగుతున్నాయని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిమజ్జన ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, నిమజ్జనాల వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ పోర్టల్‌లో 1.24 లక్షల విగ్రహాలు నమోదయ్యాయని చెప్పారు.
గతేడాది 1.15 లక్షల విగ్రహాలు నమోదయ్యాయని, ఈసారి సంఖ్య పెరిగిందన్నారు. అపార్ట్‌మెంట్లు, ఇళ్లు, వ్యక్తిగత ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను కలిపితే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.5 నుంచి 4 లక్షల వరకు ఉండే అవకాశం ఉందన్నారు. శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 88 వేల విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని డీజీపీ తెలిపారు. ఇంకా మిగతా విగ్రహాలు శనివారం ఉదయానికి ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు.
13 మంది మృతి..
గణేశ్ ఉత్సవాల సందర్భంగా గత పది రోజుల్లో 13 మంది మృతి చెందడం బాధాకరమని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు. నిమజ్జన విధులకు హైదరాబాద్ వచ్చిన కొత్తగూడెం ఎస్‌ఐ వెంకన్న మృతి బాధాకరమన్నారు. సైబరాబాద్ పరిధిలోని పటాన్‌చెరులో ఆరుగురు మృతి చెందడం దురదృష్టకరమని చెప్పారు. ఖైరతాబాద్‌లో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒకరు మృతి చెందగా, నిర్మల్‌లో గుండెపోటుతో ఒకరు మృతి చెందినట్టు తెలిపారు. డీజే శబ్దాల కారణంగా కూడా కొందరు మృతి చెందినట్టు పేర్కొన్నారు. మొత్తం 26 మంది ప్రమాదాల్లో గాయపడగా, మల్కాజిగిరిలో 17 మంది గాయపడినట్లు డీజీపీ తెలిపారు.


