గుప్పు.. ముప్పు! | Growing Cannabis Use in Telangana | Sakshi
Sakshi News home page

గుప్పు.. ముప్పు!

Sep 26 2026 3:42 AM | Updated on Sep 26 2026 3:42 AM

Growing Cannabis Use in Telangana

రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి వినియోగం

మత్తు బారిన విద్యార్థులు, యువత, డాక్టర్లు, ఐటీ, ప్రైవేటు ఉద్యోగులు 

హైదరాబాద్, పరిసర ప్రాంతాలు కలిపి 15 లక్షల మందికి పైగానే దీనికి బానిసలైనట్టు అంచనా 

300 మంది సెల్లర్లు.. రోజుకు దాదాపు రూ.40 లక్షలకు పైగా దందా 

జిల్లాలకూ విస్తరించిన మహమ్మారి డబ్బు కోసం చోరీలు.. మైకంలో నేరాలు 

ఏఓబీ నుంచే ప్రధానంగా రాష్ట్రంలోకి గంజాయి రవాణా 

ప్రైవేటు బస్సులు, కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాల్లో తరలింపు 

నియంత్రించలేని ఈగల్, ఎక్సైజ్, ఇతర పోలీస్‌ విభాగాల నిఘా 

సమన్వయ లోపం, ఉమ్మడి  వ్యూహాలు లేకపోవడమే కారణమనే విమర్శలు 

‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌

స్నేహితుడిని చంపిన టెన్త్‌ విద్యార్థి 
బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పదో తరగతి చదువుతున్న అక్షయ్‌కుమార్‌ అనే విద్యార్థి గంజాయికి బానిసయ్యాడు. ఈ ఏడాది మార్చిలో స్థానిక పార్క్‌లో గంజాయి సేవిస్తుండగా..అతడి స్నేహితుడు రఘువీర్‌ అడ్డుకున్నాడు. మత్తులో ఉన్న అక్షయ్‌కుమార్‌ అతని తలపై బలంగా కొట్టడంతో స్పాట్‌లోనే మరణించాడు.  

డబ్బులివ్వలేదని తల్లిని చంపేశాడు
నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలో కరుణాకర్‌ అనే వ్యక్తి గంజాయికి బానిస అయ్యాడు. గంజాయి కొనేందుకు డబ్బుల కోసం తల్లి యాదమ్మతో గొడవపడ్డాడు. ఆమె ఇవ్వకపోవడంతో అప్పటికే మత్తులో ఉన్న కరుణాకర్‌ ఆమెను బలంగా గోడకేసి కొట్టడంతో చనిపోయింది. ఆమె తల్లి అనే కనీస స్పృహ కూడా లేని పరిస్థితుల్లో మృతదేహాన్ని ఇంటి సమీపంలోని ముళ్లపొదల్లో పడేశాడు.  

నాగోజు సత్యనారాయణ 
రాష్ట్రంలో గ్రామాల్లోనూ గంజాయి గుప్పుమంటోంది. మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నామని ప్రభుత్వం చెబుతున్నా..ఈ మత్తు మహమ్మారి పట్నం దాటి పల్లెటూర్లకు పాకుతోంది. హైదరాబాద్‌ నగర పరిధిలోని పలు కీలక ప్రాంతాలతో పాటు జిల్లాల్లోనూ గంజాయి వాడకం పెరుగుతుండ డం ఆందోళన కల్గిస్తోంది. హైదరాబాద్, పరిసర ప్రాంతాలు కలిపి దాదాపు 15 లక్షల మందికి పైగా గంజాయికి అలవాటైనట్టు అనధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గ్రామాలను కూడా కలిపితే ఈ సంఖ్య మరింత భారీగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ఖాళీ చేసిన సిగరెట్లలో దట్టించి, ప్రత్యేకమైన పేపర్‌తో బీడీలా చుట్టుకుని గంజాయిని వినియోగిస్తున్న యువత ఆ మత్తులో చిక్కి నేరాలకు పాల్పడుతున్నారు. విపరీత ప్రవర్తనతో వ్యవహరిస్తున్నారు. వావి వరసలు సైతం మరిచిపోతున్నారు. హింసకు పాల్పడుతున్నారు. గంజాయికి అలవాటు పడిన గ్యాంగ్‌లు రాత్రివేళల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. దాడులు, గొడవలకు దిగుతున్నాయి.

గంజాయి కొనేందుకు అవసరమైన డబ్బుల కోసం కొందరు చోరీలకూ పాల్పడుతున్నారు. విద్యార్థులు, యువతతో పాటు డాక్టర్లు, ఐటీ ప్రొఫెషనల్స్, ప్రైవేటు ఉద్యోగులు సైతం గంజాయి మత్తుకు అలవాటుపడడం కలవరం రేకెత్తిస్తోంది. ఈగల్‌ ఫోర్స్, ఎక్సైజ్, స్థానిక పోలీసులు నిఘా పెడుతున్నా..గంజాయి మహమ్మారిని తగిన విధంగా కట్టడి చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. శాఖల మధ్య సమన్వయ లోపం, ఉమ్మడిగా దాడులు నిర్వహించకపోవడం ఇందుకు కారణమవుతోందని, ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణ మరో పంజాబ్‌లా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా గంజాయి పంజాపై ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలనలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.  

రైళ్లలో ప్యాకెట్టు పెట్టి.. 
    రాష్ట్రంలోకి వస్తున్న 90% గంజాయి ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏఓబీ) నుంచే వస్తోంది. తొలుత జిల్లాలకు అటు నుంచి హైదరాబాద్‌కు చేరుతోంది. ప్రధానంగా మల్కాన్‌గిరి, కోరాపుత్, గంజాం జిల్లాల నుంచి వస్తోంది. రవాణా కోసం కార్లు, ప్రైవేటు బస్సులు, లారీలు, ఇతర లగేజీ వాహనాలు, బైక్‌లు సైతం వాడుతున్నారు. రైళ్లల్లోనూ రవాణా చేస్తున్నారు. ముఖ్యంగా కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్, ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్‌–పుణె సూపర్‌ఫాస్ట్, షాలిమర్‌–సికింద్రాబాద్‌ సూపర్‌ఫాస్ట్, విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో గుట్టుచప్పుడు కాకుండా కొరియర్ల ద్వారా సరఫరా అవుతోంది.

సాధారణంగా రైళ్ల జనరల్‌ బోగీల్లో ఒకచోట గంజాయి ప్యాకెట్లు పెడతారు. కొరియర్లు మరోచోట కూర్చొని వాటిని గమనిస్తుంటారు. గమ్యస్థానం చేరిన తర్వాత ప్యాకెట్లు తీసుకుని దిగిపోతారు. ఒకవేళ పోలీసులు, ఇతర భద్రత సిబ్బంది కంట పడితే అక్కడినుంచి మెల్లగా జారుకుంటారు. ఇక దుస్తులు, మందులు, ఇతర పదార్థాల మాటున కొరియర్‌ సర్వీసుల ద్వారా కూడా రవాణా అవుతోంది.  

ప్రైవేటు బస్సు డ్రైవర్లకు కమీషన్‌ ఇచ్చి.. 
    మల్కన్‌గిరి ప్రాంతం నుంచి నగరానికి వచ్చే ప్రైవేటు బస్సుల ద్వారా ఎక్కువ గంజాయి వస్తోంది. ఈ బస్సుల డ్రైవర్లు కేజీకి రూ.1500 కమీషన్‌ తీసుకుని గంజాయి పెట్టేందుకు అనుమతిస్తున్నారని ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. ఏదో ఒక లగేజీ మాటున ఇలా వచ్చే గంజాయిని ఎక్కువగా ఆటోనగర్, హయత్‌నగర్‌లో అన్‌లోడ్‌ చేస్తున్నారు. ప్రత్యేకంగా సమాచారం ఉంటే తప్ప వీళ్లు దొరకడం లేదు.  

పెడ్లర్లు సైతం ఒక పాయింట్‌ వరకే.. 
    గంజాయి రవాణా ముఠాలు తెలిసిన వ్యక్తులతోనే లావాదేవీలు జరుపుతారు. ఒక్కో డీలర్‌కు, ఒక్కో కొనుగోలుదారుకు ఉండే ప్రత్యేక ఫోన్‌ నంబర్‌ నుంచి మినహా ఇతర ఏ ఫోన్‌ నంబర్ల నుంచి ఫోన్‌ వచ్చినా గంజాయి గురించి మాట్లాడరు. కొనేందుకు వచ్చే పెడ్లర్లను సైతం ఒక పాయింట్‌ వరకే అనుమతిస్తారు. ఆ తర్వాత వాహనాన్ని వాళ్లే ఏఓబీలోపల గంజాయి పండించే ప్రాంతానికి తీసుకెళ్లి లోడ్‌ చేసి, తిరిగి ఆ పాయింట్‌ వద్దకు వచ్చి అప్పగిస్తారు. ఏఓబీలో గంజాయి ఒకరు పండిస్తారు.. ప్యాకింగ్‌ మరొకరు..అమ్మే ముఠాలు వేరేవి. అందరితోనూ అందరికీ లింకులు ఉండవు. దీంతో దర్యాప్తు ఏజెన్సీలకు చిక్కులు ఎదురవుతున్నాయి. బెంగళూరు, మహారాష్ట్ర, పుణే, యూపీ, బిహార్‌..ఏపీ, తెలంగాణ ఇలా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో గ్యాంగ్‌ విక్రయిస్తుంటుంది. 

రాత్రి వేళల్లో ప్రయాణం.. 
    గస్తీ విధుల్లో ఉండే పోలీసులను, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లోని చెక్‌ పోస్టులను, టోల్‌ గేట్లను సులువుగా దాటేందుకు గంజాయి ముఠాలు అర్ధరాత్రి సమయాన్ని ఎంచుకుంటాయి. ప్రధానంగా టోల్‌గేట్లు, చెక్‌పోస్టులను తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్యలో దాటేలా ఈ ముఠాలు ప్లాన్‌ చేసుకుంటున్నట్టు ఓ దర్యాప్తు అధికారి తెలిపారు. గస్తీ సిబ్బంది నిద్రమత్తులో ఉండి అంతగా పట్టించుకోరని ఆ సమయాన్ని ఎంచుకుంటారని వెల్లడించారు. నిజంగానే ప్రత్యేకంగా సమాచారం ఉన్నప్పుడు తప్ప..మిగిలిన రోజుల్లో చెక్‌పోస్టుల సిబ్బంది ఆ వేళల్లో అంత అప్రమత్తంగా ఉండరనే అభిప్రాయం ఉంది. 

వాసన రాకుండా పకడ్బందీ ప్యాకింగ్‌
    ఎండు గంజాయిని ప్రత్యేకమైన ప్యాకింగ్‌తో రవాణా చేస్తున్నారు. ఏఓబీలో గంజాయి సాగు చేసే ప్రాంతంలోనే ఈ ప్రత్యేక ప్యాకింగ్‌ జరుగుతుంది. అక్కడే చెక్క పెట్టె మాదిరి ఉన్న దాన్లోకి గంజాయిని తూకం వేసి పోస్తారు. ఆ తర్వాత జాకీలతో దాన్ని దగ్గరగా ముద్ద అయ్యేలా ప్రెస్‌ చేస్తారు. దాన్ని చతురస్రాకరాల్లో సమంగా కత్తిరించి ప్రత్యేక కవర్లలో నింపి ప్రత్యేకమైన టేపును చుడతారు. ఇలా చేయడం వల్ల పరిమాణం కుదించుకుపోవడంతో పాటు గంజాయి వాసన బయటికి రాకుండా ఉంటుంది.  

ఏఓబీ నుంచి ఈ రూట్లలో.. 
రూట్‌ 1 : మల్కాన్‌గిరి –సీలేరు (ఏపీ)– చింతూరు (ఏపీ)–భద్రాచలం–ములుగు–వరంగల్‌ అర్బన్‌–కరీంనగర్‌–జగిత్యాల–నిర్మల్‌–మహారాష్ట్ర 
రూట్‌–2 : మల్కాన్‌గిరి –సీలేరు– చింతూరు–భద్రాచలం–కొత్తగూడెం–ఖమ్మం– సూర్యాపేట– నల్లగొండ–హైదరాబాద్‌ 

రూట్‌–3 : మల్కాన్‌గిరి –సీలేరు– చింతూరు–భద్రాచలం–కొత్తగూడెం–ఖమ్మం–మహబూబాబాద్‌–జనగామ– యాదాద్రి భువనగిరి– మేడ్చల్‌ మల్కాజిగిరి– హైదరాబాద్‌– సంగారెడ్డి–జహీరాబాద్‌–కర్ణాటక...(కొన్ని ముంబై, పుణే) 
రూట్‌–4 : మల్కాన్‌గిరి –సీలేరు– చింతూరు–భద్రాచలం–కొత్తగూడెం–ఖమ్మం–మహబూబాబాద్‌–జనగామ– యాదాద్రి భువనగిరి– మేడ్చల్‌ మల్కాజిగిరి– హైదరాబాద్‌– మహబూబ్‌నగర్‌–నారాయణపేట్‌–గోవా 

ధూల్‌పేట దాటి నలు దిశలా.. 
ఒకప్పుడు ధూల్‌పేట్‌ కేంద్రంగా, ఆ తర్వాత సీతాఫల్‌మండి ప్రాంతంలో ఎక్కువగా గంజాయి విక్రయాలు జరుగుతుండేవి. కానీ గత కొన్నేళ్లలో నగరం నలుమూలకూ విస్తరించింది. ప్రస్తుతం బార్కస్, సలాల, ఎర్రకుంట, లంగర్‌ హౌస్, అప్పా జంక్షన్, మీర్‌పేట్, టీకేఆర్‌ కమాన్‌ పరిసర ప్రాంతాలు, అస్మత్‌పేట్, బాబానగర్, చాంద్రాయణగుట్ట, మాసబ్‌ట్యాంక్‌ బ్రిడ్జి నుంచి మెట్ల మార్గంలో విజయ్‌నగర్‌ కాలనీ, పీఎస్‌ నగర్‌కు వెళ్లే దారిలో .. డబీర్‌పుర, జగద్గిరిగుట్ట, నేరేడ్‌మెట్, మల్కాజిగిరి, సైనిక్‌పురి సహా చాలా ప్రాంతాలకు పాకింది. 

నానక్‌రామ్‌గూడ కూడా గంజాయికి ప్రధాన కేంద్రంగా మారింది. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఎక్కువగా ఇక్కడ కొంటున్నారు. హబీబ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మాన్‌గర్‌ బస్తీలో బహిరంగంగానే విక్రయాలు జరుగుతున్నాయి. బలరాం హోటల్‌ పక్కన , బస్తీ దవాఖాన, హబీబ్‌నగర్‌ నాలా, వినాయక కమ్యూనిటీ హాల్‌ గల్లీ డెడ్‌ ఎండ్‌ ప్రాంతంలో నిరాటంకంగా దందా సాగుతోంది.  

రోజుకు 200 కిలోలకు పైగా విక్రయాలు 
    హైదరాబాద్‌ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిరోజూ కనీసం 200 కిలోలకు పైగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో కిలో రూ.2 వేల నుంచి రూ.5 వేలకు దొరికే గంజాయి.. హైదరాబాద్‌కు చేరేసరికి రూ.16 వేలకు, ఆ తర్వాత కస్టమర్‌కు చేరేసరికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు చేరుతోంది. ఈ లెక్కన రోజుకు సగటున రూ.40 లక్షలకు పైగానే గంజాయి వ్యాపారం జరుగుతోందని అంచనా. గంజాయిని తీసుకునే సెల్లర్స్‌.. 10 గ్రాముల పొట్లాలు తయారు చేస్తున్నారు. వీటిని ఒక్కొక్కటి రూ.300 చొప్పున, డిమాండ్‌ను బట్టి కొన్నిసార్లు రూ.500 వరకు అమ్ముతున్నారు. 

ఓజీ ఖుష్‌తో సంపన్న వర్గాల ఖుషీ 
    నగరంలో సాధారణ గంజాయితో పాటు ఓజీ ఖుష్‌ (ప్రత్యేక మొక్క)ను ఎక్కువగా వాడుతున్నారు. ఓజీ ఖుష్‌ గంజాయి గ్రాము ధరే రూ.3 వేల వరకు ఉంటుంది. దీంతో సంపన్న వర్గాలు ఈ గంజాయి వాడుతున్నాయి. ఇది ఎక్కువగా బ్యాంకాక్‌ నుంచి విమానాల ద్వారా దిగుమతి అవుతోంది. విదేశాల్లో గంజాయి సాగు చట్టబద్ధమే. 

విద్యార్థులే టార్గెట్‌గా గంజాయి చాక్లెట్లు 
    సూ్కల్, కాలేజీ పిల్లలకు కొందరు గంజాయి చాక్లెట్లను అలవాటు చేస్తుండడం ఆందోళన కల్గిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌ జగద్గిరిగుట్ట పరిధిలో విద్యార్థులు, యువత లక్ష్యంగా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముఠా పట్టుబడింది. ఈ ఏడాది ఆగస్టులో శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బిహార్‌కు చెందిన ఒక వ్యక్తి నడుపుతున్న పాన్‌షాప్‌లో ఏకంగా 25 కిలోల బరువున్న 5,298 గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు.

కొంత కాలం కిందట షాద్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాల సమీపంలోని పాన్‌ డబ్బాలో గంజాయి చాక్లెట్ల విక్రయం కలకలం రేపింది. ఇతర రాష్ట్రాల వలస కూలీలు ఏజెంట్లుగా గంజాయి చాక్లెట్ల రవాణా, విక్రయాలు గుట్టుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా బిహార్, యూపీ, జార్ఖండ్‌ నుంచి వచ్చే కూలీలు స్థానికంగా అక్కడి పాన్‌షాప్‌లలో రూ.1 ఒకటి చొప్పున దొరికే గంజాయి చాక్లెట్లను ఇక్కడ రూ.50 నుంచి రూ.100కు అమ్ముతున్నారు. తొలుత తోటి కూలీలకు, క్రమంగా ఆ ప్రాంతంలోని వారికి అలవాటు చేస్తున్నారు.  

నిక్‌ నేమ్స్‌  
    గంజాయి వాడేవారు ఎన్నో కోడ్‌ పదాలు, నిక్‌ నేమ్స్‌ పెట్టుకుంటున్నారు. ‘జాయింట్‌ కొట్టడం’అనే పదం యువత ఎక్కువగా వాడుతున్నారు. పాట్‌– అంటే గ్రీన్‌ గంజాయి...చీటా అంటే ఎండు గంజాయి. చాక్లెట్, ఫూడీ అని కోడ్‌ నేమ్‌లతోనూ పిలుస్తున్నారు. గద్వాలతో పాటు కొన్ని జిల్లాల్లో గంజాయిని ‘ఆకు’అని పిలుచుకుంటున్నారు.  

డాన్ల నుంచి ఆటో డ్రైవర్ల దాకా..! 
హైదరాబాద్‌లో గంజాయి విక్రయాలు అంటే తొలుత లేడీ డాన్‌ నీతూభాయ్‌ పేరును దర్యాప్తు ఏజెన్సీలు చెబుతుంటాయి. కానీ ఇప్పుటు అలాంటి డాన్‌లు ఏరియాకు ఒకరు చొప్పున తయారయ్యారు. ప్రధానంగా నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో పాపాలాల్, సంకేశ్‌...ఫతేనగర్‌లో మంజు, లేడీడాన్‌ కవిత, లంగర్‌హౌస్‌..కాళీ మందిర్‌ ప్రాంతంలో భరత్‌సింగ్‌ (కాలేజీ విద్యార్థులకు సరఫరా చేస్తాడు) ఈ దందా చేస్తున్నారు. ఇక నగరంలో 50 నుంచి 100 మంది వరకు ఆటోడ్రైవర్లు కూడా ప్రత్యేకంగా దీని విక్రయాలు జరుపుతున్నారు. సిటీ మొత్తం 300 మంది వరకు గంజాయి సెల్లర్స్‌ ఉన్నారని అంచనా. కాగా డాన్‌ల నెట్‌వర్క్‌పై నామమాత్రపు కేసులు మినహా గట్టి చర్యలు ఉండడం లేదన్న విమర్శలు ఉన్నాయి.  

జిల్లాలూ గుల్ల 
    రాష్ట్రంలోని పలు జిల్లాలకూ గంజాయి విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం సింగరేణి కోల్‌బెల్ట్‌ ఏరియాలో గంజాయి వినియోగం విచ్చలవిడిగా ఉంది. గోదావరిఖని ఏరియాకు మహారాష్ట్ర నుంచి రైలు మార్గంలో ఎక్కువ గంజాయి వస్తోంది. రామగుండం, మంచిర్యాలలో కారి్మక ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్‌ వెనుక ప్రాంతంలో, సీసీసీ, శ్రీరామ్‌పూర్‌ ప్రాంతంలో, మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాల్లోనూ గంజాయి విక్రయాలు పెరిగాయి.

గోదావరిఖని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని విఠల్‌నగర్, తిలక్‌నగర్‌ దిగువన ప్రాంతం గంజాయి అడ్డాగా మారడంతో స్థానికులు ధూల్‌పేట్‌ అని పిలుస్తున్నారు. ఎఫ్‌సీఏ, సెవెన్‌ఏ ఇంక్లేయిన్‌ ఏరియాల్లోనూ గంజాయి గుప్పుమంటోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనూ గంజాయి చాపకింద నీరులా విస్తరిస్తోంది. సిద్దిపేట, గజ్వేల్, తూప్రాన్, మెదక్, జహీరాబాద్, నారాయణఖేడ్, పటాన్‌చెరుతోపాటు చుట్టుప్రక్కల గ్రామాలు, చిన్న చిన్న పల్లెలలకు ఈ మత్తు విస్తరరిస్తోంది.  

ఓ నేతపై పీడీ యాక్ట్‌..కొందరి బంధువర్గం సైతం 
    ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు మహారాష్ట్ర నుంచి ఎక్కువగా గంజాయి వస్తోంది. ఒడిశా నుంచి తొలుత నాందేడ్‌కు అక్కడి నుంచి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ప్రాంతాలకు తరలిస్తున్నారు. కామారెడ్డి, నిజామాబాద్‌ పట్టణాల్లోనూ గంజాయి వాడకం పెరిగింది. కామారెడ్డి జిల్లా పరిధిలో మాచారెడ్డి మండలం, సదాశివనగర్‌ మండలం, రామారెడ్డి, నిజాంసాగర్, బాన్స్‌వాడ మండలాల్లోనూ..నిజామాబాద్‌ జిల్లాలో వేల్పూర్‌ మండలం, నందిపేట్, కమ్మర్‌పల్లి, తాళ్లరామ్‌పూర్, భీంగల్‌ ఏరియాలో, ఆర్మూర్‌ లోనూ గంజాయి వాడకం పెరుగుతోంది. గంజాయి విక్రయాలకు సంబంధించి ఓ పారీ్టకి చెందిన నేతపై పీడీ యాక్ట్‌ నమోదైంది. స్థానిక కొందరు నాయకుల బంధువర్గం సైతం ఈ దందాలో ఉన్నట్టు ఆరోపణలున్నాయి.  

ఖమ్మం స్కూల్లో గంజాయి పొట్లాలు 
    ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగానే ఎక్కువగా గంజాయి రవాణా అవుతోంది. కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కువగా ఉమ్మడి జిల్లాకు తరలిస్తున్నారు. కాలేజ్, స్కూల్‌ పిల్లలకు గంజాయి మత్తు అలవాటు అవుతుండడం ఆందోళన కల్గిస్తోంది. ఖమ్మం త్రీ టౌన్‌పోలీస్‌ స్టేషన్‌పరిధిలోని గాం«దీనగర్‌ ప్రభుత్వ పాఠశాల పదో తరగతిలో రెండు నెలల క్రితం గంజాయి పొట్లాలు బయటపడడం కలకలం రేపింది. స్థానికంగా కొందరు యువకులు బైక్‌లపై ఒడిశాకు వెళ్లి తెస్తున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం పట్టణాలలోని కొన్ని ప్రాంతాల్లో...మధిర, ఖమ్మం రూరల్‌ మండలంలోని చాలా ప్రాంతంలోనూ విస్తరించింది. ఇల్లందు పక్కన సారపల్లి మండలంలో ఒక తండావాసులు గంజాయి సరఫరాలో కీలకంగా పనిచేస్తున్నట్టు తేలింది.  

ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో హాట్‌స్పాట్లు 
    మహబూబ్‌నగర్‌ టౌన్‌లో ఎనిమిది, గద్వాల్‌లో ఆరు, జడ్చర్లలో మూడు గంజాయి హాట్‌స్పాట్‌లు ఉన్నట్టు పోలీస్‌ వర్గాలు చెబుతున్నాయి. వనపర్తి, గద్వాల్‌ పట్టణాల్లో జులాయిలుగా తిరిగే మైనర్లు ఎక్కువగా బానిసలు అవుతున్నారు. మహబూబ్‌నగర్‌ టౌన్‌తో పాటు స్థానిక మెడికల్‌ విద్యార్థులు, ఇతర విద్యార్థుల్లోనూ గంజాయి వాడకం పెరిగింది. జడ్చర్ల దగ్గరలోని పోలేపల్లి సెజ్‌లో వలస కారి్మకుల ద్వారా స్థానిక గంజాయి విస్తరిస్తోంది. అచ్చంపేట, కొల్హాపూర్‌లో అంతరపంటగా గంజాయి సాగు చేస్తున్న వైనాలు ఉంటున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నల్లగొండ, వరంగల్‌ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ గంజాయి వాడకం కేసులు నమోదవుతున్నాయి. 

మెదడుపై ప్రభావం, దుష్పరిమాణాలు 
గంజాయి వినియోగం జ్ఞాపకశక్తి, నేర్చుకోవడం, ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, సమన్వయం, స్పందన వేగం వంటి మెదడు కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా యుక్త వయసులో మెదడు ఇంకా అభివృద్ధి చెందే స్థితిలో ఉంటుంది. ఆ వయసులో వినియోగం మెదడు ఎదుగుదలను ప్రభావితం చేస్తుంది. కొంతమందిలో గంజాయి తీసుకున్న తర్వాత ఆందోళన, భయం, అనుమానాలు, గందరగోళం వంటి పరిస్థితులు తలెత్తుతాయి. గంజాయిని పొగ రూపంలో తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల కణజాలానికి నష్టం వాటిలి దగ్గు, కఫం, బ్రాంకైటిస్‌ వంటి శ్వాస సంబంధిత సమస్యలు పెరగవచ్చు. డ్రైవింగ్‌ సామరŠాధ్యన్నీ ఇది దెబ్బతీస్తుంది. 

ఏఓబీలోనే ఎందుకు? 
ఆంధ్రా ఒడిశా సరిహద్దులో వేల ఎకరాల్లో గంజాయి ఎందుకు పండిస్తున్నారన్న సందేహం సహజమే. ఇది రెండు రాష్ట్రాల సరిహద్దులో మల్కాన్‌గిరి, కోరాపూట్‌ తదితర ప్రాంతాల్లో కొండలు, అడవులు, మారుమూల ప్రాంతాలున్నాయి. గంజాయి సాగు ప్రాంతాలు ప్రధాన రహదారులకు దూరంగా ఉండడంతో పోలీసుల నిఘా, సాధారణ తనిఖీలు కష్టతరంగా ఉన్నాయి. ఏజెన్సీలో ఉండే గిరిజనుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని కొన్ని వ్యవస్థీకృత (ఆర్గనైజ్డ్‌) ముఠాలు వారికి డబ్బులు ఇచ్చి సాగు చేయిస్తున్నాయి. అటవీ భూములు కావడంతో కేసులు నిలబడని పరిస్థితి. స్థానికంగా రాజకీయ నాయకుల అండ కూడా ఉంటోందన్న ఆరోపణలు ఉన్నాయి.  

ఒత్తిడిని తట్టుకునేందుకు.. 
విద్యార్థులు గంజాయిని ఒత్తిడిని జయించే పదార్థంగా భావిస్తున్నారు. పరీక్షల ఒత్తిడి తట్టుకునేందుకు కూడా గంజాయి తీసుకుంటున్నామని ఇటీవల నా దగ్గరకు వచ్చిన కొందరు విద్యార్థులు చెప్పారు. కొంతకాలం తర్వాత అది వారిలో నేర స్వభావాన్ని పెంచుతోంది. పిల్లల ప్రవర్తనలో ఏవైనా మార్పులు గమనిస్తే తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు అప్రమత్తంగా కావాలి. కౌన్సెలింగ్‌ ఇప్పించాలి. 
– డా. చెన్నోజు వీరేందర్, సైకాలజిస్ట్‌ 

వచ్చే తరాలపైనా ప్రభావం ఉంటుంది..:  
గంజాయి వాడకంతో ఒత్తిడి తగ్గుతుందని యువత దీనికి అలవాటుపడుతున్నారు. కానీ గంజాయికి అలవాటైతే ఆ దు్రష్పభావం పుట్టబోయే పిల్లలపైనా ఉంటుందన్నది మరవొద్దు. గంజాయి తీసుకునే వాళ్లలో స్కిజోప్రినియా అంటే వారిలో వారే మాట్లాడుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇది జె/ నెటిక్‌గా తర్వాతి తరాలకు రావొచ్చు. అదేవిధంగా రన్‌ ఎమోక్‌ అంటే.. ఎవరిపైనైనా దాడులకు దిగడం వంటి లక్షణాలు పెరుగుతాయి. ఉన్మాదం పెరుగుతుంది. నా దగ్గరకు చికిత్సకు వస్తున్న వారిలో 13 ఏళ్ల నుంచి 30 ఏళ్లవారే ఎక్కువ. గంజాయికి అలవాటు పడిన 13 ఏళ్ల పిల్లవాడు తండ్రి వివరాలు వాడి ఆన్‌లైన్‌లో రూ.10 లక్షలు పర్సనల్‌ లోన్‌ తీసుకుని బెట్టింగ్‌కు పాల్పడిన ఘటన చూశా. పలు జిల్లాల నుంచి పేషెంట్లను తల్లిదండ్రులు తీసుకువస్తున్నారు.  
డా.మదువంశి గండూరి, ఎండీ, సైకియాట్రిస్ట్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement